-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సత్తా చాటిన కేటీఆర్ -పలు ఎన్నికల్లో ఘన విజయాలు -పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి

ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యం! ఒకవైపు పరిపాలన భారం.. మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యత! ఈ సమయంలో పూర్తిగా పరిపాలనపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ బాధ్యతలను యువనేత కే తారకరామారావుకు అప్పగించారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, పార్టీని నవపథాన పయనింపజేస్తున్నారు.
ఏడాదిలో ఎన్నో ఘన విజయాలు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న ఏడాదికాలంలో .. పార్టీ అనేక ఘన విజయాలు సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. ఏ ఎన్నికైనా ప్రత్యర్థులకు అందనంతస్థాయిలో విజయాలను అందించడంలో ఆయన వ్యూహరచన తోడ్పడింది. ఈ క్రమంలోనే పార్లమెంట్, పంచాయతీ, పరిషత్ ఎన్నికలతోపాటు హుజుర్‌నగర్ ఉపఎన్నికలో పార్టీ విజయబావుటా ఎగురవేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచింది. పరిషత్ ఎన్నికల్లో మొత్తం 32 జెడ్పీలపై గులాబీ జెండా ఎగురవేయడంలో కేటీఆర్ పాత్ర ఎనలేనిది.
పార్టీ నిర్మాణంలో కొత్తపుంతలు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం 60 లక్షలు దాటే దిశగా నాయకుల్లో ఉత్సాహం నింపడమేకాకుండా.. దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ సభ్యత్వాన్ని నమోదుచేసిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను నిలిపారు. పోలింగ్‌బూత్, గ్రామ, వార్డు, డివిజన్, మండలస్థాయి కమిటీలను పూర్తిచేయించి పార్టీకి పటిష్ట నిర్మాణరూపాన్ని ఇచ్చేందుకు కృషిచేశారు. సామాజిక బాధ్యతను కూడా భుజానికెత్తుకుంటూ.. అర్హులైనవారు ఓటర్లుగా నమోదుచేయిం చుకోవ డానికి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయంలో.. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదనే చెప్పాలి. కీలక సమయంలో పార్టీ వాణిని ప్రజలవద్దకు తీసుకుపోయేలా కేటీఆర్ చేసిన వ్యూహరచన తిరుగులేని ఫలితాన్నిచ్చింది. తొలుత రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్.. టెలికాన్ఫరెన్సుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కార్యకర్తలకు సూచనలు చేస్తూ ముందుకు నడిపించడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు.
ఎంపీలకు దిశానిర్దేశం రాష్ర్టానికి రావాల్సిన నిధులతోపాటు వివిధ బిల్లులు, రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ ఎంపీలు పోరాటంచేసేలా కేటీఆర్ వారిని కార్యోన్ముఖులను చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు వారితో ప్రత్యేకంగా సమావేశమై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ సమాచారాన్ని అందించారు. అది ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడానికి దోహదంచేసింది.
మున్సిపల్ ఎన్నికలకు రెడీ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఘనవిజయాలు సాధించేలా పార్టీని కేటీఆర్ సర్వసన్నద్ధంచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఇప్పటికే ఇంచార్జిలను నియమించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్నారు. మున్సిపాలిటీల్లో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీని సంస్థాగతంగా మరింతబలోపేతం చేయడానికి తరుచు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు, విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టేలా నాయకులకు సూచనలు ఇస్తున్నారు.