Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కోడెగిత్త బీఆర్‌ఎస్‌.. తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు?

-బీజేపీవి శిఖండి రాజకీయాలు.. కాంగ్రెస్సే మా ప్రత్యర్థి
-బహుళ నాయకత్వం మా పార్టీకి ప్రధాన బలం
-వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తాం
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు
-నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలను ఏకకాలంలో అభివృద్ధి చేయటం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూనే పారిశ్రామిక, ఐటీరంగాల విస్తరణ వల్ల ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాం. ఇలా అన్ని రంగాల్లో సమతౌల్య.. సమగ్ర.. సమీకృత, సమ్మిళిత అభివృద్ధి తెలంగాణ సాధిస్తున్నది.

దేశంలో తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలను బీఆర్‌ఎస్‌ శాసిస్తుందని తేల్చిచెప్పారు. బీజేపీ శిఖండి రాజకీయం చేస్తున్నదని, ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు. బహుళ నాయకత్వం బీఆర్‌ఎస్‌కు బలమని, తమ పార్టీ 22 ఏండ్లు పూర్తి చేసుకొని 23వ ఏట అడుగుపెడుతూ కోడెగిత్తలాగా ఉన్నదని పేర్కొన్నారు. పేరు మారినా పార్టీ తన స్వరూపాన్ని, లక్షణాన్ని మార్చుకోలేదని, మార్చుకోదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందటానికి గల నేపథ్యం ఏమిటి?
మొక్క దశ నుంచి వృక్షమైనట్టు.. లేగదూడ కోడెగిత్త అయినట్టు.. 22 ఏండ్లు పూర్తిచేసుకొని 23వ ఏట అడుగుపెడుతున్న బీఆర్‌ఎస్‌ కోడెగిత్తలా ఉడుకునెత్తురుతో ఉరకలేస్తున్నది. కోడెగిత్త అయినా దాని లక్షణం మారదు. అట్లనే టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందినా మా డీఎన్‌ఏ మారలేదు. జెండా మారలేదు. ఎజెండా మారలేదు. మా సైద్ధాంతిక రూపం, మా పనితీరూ మారలేదు. మా నాయకుడు మారలేదు. ఎన్నికల గుర్తూ మారలేదు. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేయకూడదనే నియమం కూడా ఎక్కడా లేదు. హైదరాబాద్‌ గడ్డ మీది నుంచే జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి రావచ్చు. ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే. బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణను అత్యద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్‌ఎస్‌ది.. కేసీఆర్‌ది. తెలంగాణవారికి పరిపాలన చేతకాదు అని వెక్కించినవాళ్లే కీర్తించే స్థాయికి ఎదిగాం. దేశంలో ఏదో ఒక రాష్ట్రం నుంచి అధికారులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు తెలంగాణకు వచ్చి కొత్త విషయాలు తెలుసుకొని పోతున్నారు.

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఆదరణ ఎట్ల ఉన్నది?
మహారాష్ట్రలో కేసీఆర్‌ పర్యటన తరువాత ప్రజల స్పందన అద్భుతంగా ఉన్నది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. సరైన నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. యవత్మాల్‌, చంద్రాపూర్‌, ఔరంగాబాద్‌, నాందేడ్‌.. ఇలా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. డబుల్‌ ఇంజిన్‌ అని ఊదరగొట్టే రాష్ర్టాల్లో ఆత్మహత్యలు కొనసాగుతుంటే ప్రభావశీల సీఎంగా కేసీఆర్‌ సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తున్నది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన విధానాలు, పథకాలు మాకూ కావాలని మహారాష్ట్ర మాత్రమే కాదు అనేక రాష్ర్టాలు కోరుతున్నాయి. మహారాష్ట్రలో మొదలైన విప్లవం కర్ణాటక, ఆంధ్రా, ఒడిశాలో విస్తరించనున్నది.

జాతీయపార్టీగా దేశరాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ఎలాంటి పాత్ర పోషించబోతున్నది?
జాతీయ పార్టీ అంటే వెంటనే 543 లోక్‌సభ స్థానాలకు పోటీచేయాలనే నియమం ఏమీలేదు. బీజేపీ 2 ఎంపీ స్థానాల నుంచి 303 ఎంపీల స్థాయికి రాత్రికి రాత్రే రాలేదు. మాకు తొందరలేం లేదు. దేశ ప్రజల మనోభవాలను, వారి ఆకాంక్షలను గెలుచుకుంటూ వెళతాం. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాం. మా నాయకుడు కేసీఆర్‌ వ్యూహాత్మక ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. వాటిని ఎవరూ ఆపలేరు.

మీ ముందున్న తక్షణ లక్ష్యం ఏమిటి?
2023లో తెలంగాణలో గెలిచి తీరాలి. అదే మా ముందున్న తక్షణ లక్ష్యం. మేం చేసిన పనిని గడపగడపకూ చెప్పుకుంటూ పోతం. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు గుర్తుచేయగలిగితే.. దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా రికార్డు సృష్టిస్తారు. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతి మా నిత్య లక్ష్యం. హైదరాబాద్‌ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతాం. 2024 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి నెలకొనే పరిస్థితులను బట్టి ఎన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయగలిగితే అన్ని ఎక్కువ సీట్లలో పోటీచేస్తాం.

కాంగ్రెస్‌, బీజేపీల్లో ఒకదానితో ఎన్నికల సర్దుబాట్లు ఉంటాయనే వాదన ఉన్నది. దీనికి మీ సమాధానం?
కాంగ్రెస్‌, బీజేపీలే ఈ దేశాన్ని ముంచాయి. ఎట్టిపరిస్థితుల్లో ఆ పార్టీలతో బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేయదు. రాహుల్‌ గాంధీని పొత్తు ఎవడు అడిగిండు? ఆయనపాటికి ఆయనే ప్రజలను గందరగోళపర్చేందుకు పొత్తు ఉండదని ప్రకటన చేశారు తప్ప మరోటి కాదు. బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌, బీజేపీలకు దూరమని చెప్తున్న ది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నైతికతను కాంగ్రెస్‌ కోల్పోయింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీగా మిగిలింది. ప్రధాని మోదీ విధ్వంసక పాలనకు దేశ ప్రజలు విసుగెత్తిపోయారు. కనుక ఈ రెండు పార్టీలకు బీఆర్‌ఎస్‌ సమదూరంగా ఉంటుంది. కాంగ్రెస్‌ 54 ఏండ్లు, బీజేపీ 16 ఏండ్లు దేశాన్ని పాలించి ఏం చేశా యి? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ వేసే తొ లి అడుగు చాలా గట్టిగా, బలంగా, ఆశ్చర్యకరం గా, సంభ్రమాశ్చర్యాలకు గురిచేయబోతున్నది.

మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌ ప్రయత్నాలపై మీ కామెంట్‌?
సంవత్సరం క్రితం కేసీఆర్‌ అదే పనిచేశారు. అయితే, వాళ్లు చేసే ప్రయత్నాలను మేము వ్యతిరేకించం. వాటిని స్వాగతిస్తాం. స్టాలిన్‌, అఖిలేశ్‌, మమత, నితీశ్‌కుమార్‌, తేజస్వీ, కేజ్రీవాల్‌.. ఇలా అందరూ కేసీఆర్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర నాయకులు నిత్యం మాట్లాడుకొంటూనే ఉంటారు.

మోదీ తరువాత అంతటి నాయకుడు ఎవరని బీజేపీ వాళ్లు అంటున్నారు కదా?
2010లో మోదీ ఎవరు? గుజరాత్‌ మాడల్‌ అని ఊదరగొట్టి దేశాన్ని గందరగోళంలోకి నెట్టి.. గోల్‌మాల్‌ చేసి 2014లో గద్దెనెక్కేవరకు దేశంలో మోదీ ఎవరికి తెలుసు? రెండుసార్లు గెలిచి ఈ దేశంలో అత్యంత ప్రభావవంతమై, ప్రతిభావంతమైన సీఎంగా కేసీఆర్‌ తెలంగాణ మాడల్‌ను సృష్టించారు. ‘గొప్ప ఉద్యమకారుడు.. గొప్ప పరిపాలనాదక్షుడిగా ఉండటం అత్యంత అరుదైన విషయం అని సీఎం కేసీఆర్‌ను సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కీర్తించారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం తెలంగాణను కండ్లకు అద్దుకోక తప్పని పరిస్థితిని కేసీఆర్‌ సృష్టించారు. తెలంగాణను శతృదేశంగా చూసినా.. గవర్నర్‌ను, ఇతర వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెట్టినా తెలంగాణను కేంద్రం అనివార్యంగా గుర్తించాల్సిన పరిస్థితులను కేసీఆర్‌ సృష్టంచారు. ఇదీ కేసీఆర్‌ దక్షత. ఇవాళ దేశమంతా గోల్‌మాల్‌ గుజరాత్‌ మాడల్‌ కాదు.. తెలంగాణ మాడల్‌ కావాలనే డిమాండ్‌ వస్తున్నది. అవినీతికి కెప్టెన్‌ మోదీ.. అత్యంత అవినీతిపరుడు.. అత్యంత అనర్హుడు.. అత్యంత అసమర్థుడు.. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని పనిని మోదీ తన దోస్తు అదానీకి చేసిండని శ్రీలంక ప్రభుత్వమే చెప్పింది. కానీ, లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పటంలో మోదీ సిద్ధహస్తుడు. 30 ఏండ్లల్లో ఎన్నడూలేని నిరుద్యోగం, 40 ఏండ్లల్లో ఎప్పుడూలేని ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక గ్యాస్‌ ధరలు, దేశ చరిత్రలో అత్యంత దిగువకు రూపాయి విలువ పతనం.. ఇలా అనేక విషయాల్లో మోదీవి రికార్డులు కావా?

ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా అక్కడక్కడా పార్టీలో విబేధాలు పొడచూపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమకే అని పలుచోట్ల నాయకులు ప్రకటించుకొంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు?
అది పార్టీ బలానికి సంకేతం. ఎదుగుతున్న పార్టీకి ఇవన్నీ సహజం. రాజకీయాల్లో నాయకుల మధ్య పోటీ ఉండటం, పోటీచేయాలని అనుకోవటం తప్పుకాదు. టికెట్‌ కోసం పోటీపడేవాళ్లు కష్టపడి పనిచేసి పార్టీకి ‘నేనైతే గెలుస్తాను అనే అనివార్యత సృష్టించాలి’. అట్లా సృష్టించిన వారికే టికెట్లు వస్తాయి. ఏ పార్టీ అయినా కోరుకొనేది గెలుపు గుర్రాన్నే. ఏ నాయకత్వమైనా నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు ఆశావహుల్లో ఎవరు సరైనోడు అని చూస్తారు. పోటీతత్వం ఉండే రాజకీయాల్లో పోటీ ఉండకూడదు అనుకోవడం, స్పర్ధ ఉండకూడదు అనుకోవడం మంచిది కాదు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. అనారోగ్యకరమైన పోటీ ఉంటే పార్టీ అందుకు తగురీతిలో స్పందిస్తుంది. ఇటీవల పార్టీ ఇద్దరిని సస్పెండ్‌ కూడా చేసింది.

రాష్ట్రంలో అనేక కొత్త పార్టీలు పుట్టాయి. వీటిని మీరెలా చూస్తారు?
బీజేపీ తెలంగాణలో శిఖండి యుద్ధం చేస్తున్నది. ఆ శిఖండిలు ఎవరో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఎన్నిపార్టీలు పుట్టినా.. ఎటువంటి రాజకీయాలు చేసినా బీఆర్‌ఎస్‌కు బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదు.. కాంగ్రెస్సే మాకు పోటీ.

దేశంలో ఎక్కడెక్కడ బీఆర్‌ఎస్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలో శాశ్వత కార్యాలయం త్వరలో ప్రారంభిస్తాం. ఒడిశాలోని భువనేశ్వర్‌, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అయితే ఏర్పాట్లకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాకుండా మహారాష్ర్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్‌లోకి చేరికలు అవుతున్నాయి. పార్టీ కార్యాలయాలు ఆయా రాష్ట్రాల కార్యాచరణకు, వ్యూహరచనకు మరింత ఊతమిస్తాయి.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీఆర్‌ఎస్‌ ప్రకటన అనంతర పరిణామాలపై మీ కామెంట్‌?
సీఎం కేసీఆర్‌ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఒక్క ప్రకటన చేయగానే అందరూ స్పందించారా? లేదా? కేంద్రమంత్రి విశాఖకు ఆగమేఘాల మీద పోయి హడావిడి చేశారు. ఆంధ్రా రాజకీయాల్లో ఒక్కో పార్టీ మింగలేక కక్కలేక అవస్థ పడ్డాయి. మోదీని తిట్టలేక ఎంత ఇబ్బందులు పడ్డారు! దటీజ్‌ కేసీఆర్‌.. అదే చంద్రబాబు మాత్రం మోదీని పొగిడారు? మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ఇచ్చినందుకా? ప్రత్యేక హోదా ఇచ్చినందుకా? విశాఖ ఫ్యాక్టరీని అమ్మినందుకా? తెలుగు ప్రజలకు కేంద్రం విభజన చట్టాలు అమలు చేశారని పొగిడారా?

తెలంగాణ మాడల్‌ అంటే ఇదీ..
-రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ.
-2014లో రూ.1.24 లక్షలున్న తెలంగాణ తలసరి ఆదాయం, 2023 నాటికి రూ.3.17 లక్షలకు పెంచటం. దేశంలో ఈ తరహా వృద్ధి ఉన్న మరో రాష్ట్రం లేదు.
-ఐటీ సెక్టార్‌లో అత్యధిక ఉద్యోగాలను కల్పించిన రాష్ట్రం. దేశంలో మూడోవంతు ఉపాధి అవకాశాలను కల్పించాం.
-రాష్ట్రంలో మిషన్‌ భగీరథ ద్వారా 100 శాతం ఇండ్లకు శుద్ధిచేసిన తాగునీరు.
-విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చాం.
-100 శాతం ఓడీఎఫ్‌ గ్రామాలుగా తీర్చిదిద్దటం.
-సమతుల్య, సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి
-దేశ జనాభాలో 3 శాతంకంటే తక్కువ ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు. కేవలం 141 మున్సిపాలిటీలున్న తెలంగాణ.. 350కిపైగా మున్సిపాలిటీలున్న మహరాష్ట్రతో సమానంగా అవార్డులు గెలుచుకోవటం. దేశంలో మున్సిపాలిటీల్లో రెండోస్థానంలో తెలంగాణ.
-ఐటీ ఎగుమతుల్లో రూ. 57 వేల కోట్ల నుంచి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగుదల. ఇదే దేశంలో అత్యధిక వృద్ధిరేటు.
-మరే రాష్ట్రంలోలేని పారిశ్రామిక వృద్ధి. ఆగస్టు 15న కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ యూనిట్‌కు శంఖుస్థాపన చేయనున్నాం.
-ఏ రాష్ట్రంలో పెరగనంత హరిత వృద్ధి. 7.7 శాతం గ్రీన్‌కవర్‌ పెరగటం. కొత్తగా 5 లక్షల 13 వేల ఎకరాల్లో పచ్చదనం వృద్ధి.
-తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు.
-75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వ్యవసాయ సంక్షోభం. రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు కొనసాగుతుంటే.. తెలంగాణలో రైతుల వికాసం కోసం ఎనిమిదిన్నరేండ్లలో రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టిన రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు ద్వారా 65 లక్షల మంది రైతులకు రూ. 65 వేలకోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం. వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీకి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు. రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు నివారించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా?
-బుల్లెట్‌ ట్రెయిన్‌లో ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా ఫర్వాలేదు.. రూ.లక్ష కోట్లు చాలా చిన్న అమౌంట్‌ అని చెప్పింది ప్రధాని మోదీ. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్‌.
-తెలంగాణలో 2014లో ఎకరం భూమి విలువ ఎంత? ఇప్పుడెంత?

మోదీ.. వాట్‌ ఈజ్‌ దిస్‌..?
-గుజరాత్‌లో కరెంటు యూనిట్‌కు రూ.2.83 ఉండె. ఇప్పుడు రూ.8.83 అయింది నిజం కాదా?
-కార్పొరేట్లకు కేంద్రం రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఈ మొత్తంతో దేశ రైతులందరి రుణాలు మాఫీ చేయవచ్చు. అలా ఎందుకు చేయలేదు?
-లక్షల కోట్లు ముంచినోళ్లు విదేశాల్లో.. దేశ వికాసం కోసం కష్టపడే రైతులు పాతాళంలోనా?
-పరారైనోళ్లు దేశభక్తులు.. ప్రశ్నించినోళ్లు దేశద్రోహులా?
-కార్పొరేట్లకు మినహాయింపులెందుకు? సాధారణ పౌరుడి నెత్తిన భారమెందుకు?
-అదానీ విమానాశ్రయం కొంటే జీఎస్టీ ఉండదు. కానీ సామాన్యులు మాత్రం పాలు పెరుగు కొంటే జీఎస్టీయా? ఇదేం దిక్కుమాలిన లాజిక్‌?
-ఎయిర్‌పోర్టు ఆన్‌గోయింగ్‌ బిజినెస్‌ అయినప్పుడు.. పాలు పెరుగు కాదా?
-ఇవాళ దేశంలో ఏటీఎం అంటే అదానీ టు మోదీ
-చేనేత ఉత్పత్తులపై, పిల్లల జరం మందు కు, దగ్గు మందుపై కూడా జీఎస్టీయా?
-జైపూర్‌ ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగిస్తే జీఎస్టీ ఉండదా?
-రాజ్యాంగాన్నే సవరిస్తున్నప్పుడు జీఎస్టీ చట్టాన్ని ఎందుకు సవరించరు?
-బలిసినోడికి పన్నులు వేయకుండా పేదల రక్తం గుంజుడేంది?
-రైతులకు ఉచిత కరెంటు ఇస్తామంటే కాళ్లకు బంధనాలు వేస్తారా?
-14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు రూ.56 లక్షల కోట్లు.. మోదీ ఒక్కరే చేసిన అప్పు రూ.114 లక్షల కోట్లు. ఇది నిజం కాదా?
-ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధరలు తగ్గినపుడు దేశంలో పెట్రో ధరలు తగ్గవెందుకు?
-సెస్సుల పేరుతో రాష్ట్రాల నుంచి రూ.30 లక్షల కోట్లు పిండుకొని రాష్ట్రాలకు వాటా ఇవ్వరెందుకు? ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి?
-దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… మోదీ చిరుత పులల కథలు చెప్తున్నది నిజం కాదా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.