Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

లేమికి మందు… దళితబంధు

అణగారిన వర్గాలకు ఆర్థిక తోడ్పాటు
దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆలోచనల వెలుగులో ఊపిరి పోసుకున్న ‘తెలంగాణ దళితబంధు పథకం’ దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు నాంది పలకనుంది. దళిత వాడల్లో నెలకొన్న దారిద్య్రాన్ని సమూలంగా పారదోలబోతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ మహాశయుడి ఆశయాలకు ప్రతిబింబమై, అణగారిన ప్రజల జీవితాల్లో నూతన క్రాంతిని సాధించబోతున్నది. దళితబంధు ఒక ఉద్యమం. భయంకరమైన దుర్విచక్షణ, దోపిడి ఫలితంగా ఇన్నాళ్లూ పేదరికంలో అణగారిన దళితజాతి- ఒక్క ఉదుటున తనకు తానుగా లేచి నిలబడి స్వశక్తితో, స్వావలంబనతో, ఆత్మగౌరవంతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు. దళితజాతికి సంపూర్ణమైన ఆర్థిక, సామాజిక మద్దతును అందించేవిధంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇది కేవలం ఒక సాధారణ సంక్షేమ పథకం కాదు. కుల దుర్విచక్షణ సృష్టించిన చీకట్లను ఛేదించి, వెలివాడలను వెలుగువాడలుగా మార్చే మహా ఉద్యమం.
తాండవిస్తున్న పేదరికం


మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ చెబుతున్నట్లు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా కడుపేదలు దళితులే. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న నేటి సందర్భంలోనూ దళితుల స్థితిగతులు పెద్దగా మారలేదు. ‘వీలయినంత తొందరగా ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపకపోతే, మనం ఎంతో శ్రమించి రూపొందించుకున్న ప్రజాస్వామిక రాజ్యాంగ సౌధం కూలిపోతుంది’ అని అంబేడ్కర్‌ హెచ్చరించారు. దేశాన్ని పాలించిన రాజకీయ పార్టీలు అణగారిన జాతుల అభివృద్ధి కోసం నిజాయతీగా ఎన్నడూ ప్రయత్నించలేదు. కొద్దిగా భూమి, కొద్దిమొత్తంలో రుణాలూ అంతే. అంతకు మించి లేదు. ఓట్ల రాజకీయం కోసం విదిల్చిన ఈ కొద్దిపాటి విదిలింపులవల్ల తరతరాలుగా తపిస్తున్న దళితుల ఆర్తి తీరలేదు. పరిస్థితి మారలేదు.


టీఆర్‌ఎస్‌ రాజకీయాలను సామాజిక లక్ష్యాలను చేరుకునే సాధనంగా భావిస్తుంది. ఎంచుకున్న మార్గం పట్ల స్పష్టతతో, ప్రజల పట్ల ఎనలేని విశ్వాసంతో, చిత్తశుద్ధితో, వాక్శుద్ధితో ముందుకు సాగే నాయకుడు కేసీఆర్‌. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నాన్ని తలకెత్తుకున్నప్పుడు ఎందరు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నా, ఎందరు అపశకునాలు పలుకుతున్నా మొక్కవోని విశ్వాసంతో ముందడుగు వేశారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేయించారు. గడచిన ఆరు దశాబ్దాల్లో ఎవరూ పరిష్కరించలేకపోయిన కరెంటు సమస్యను అతి తక్కువ వ్యవధిలో పరిష్కరించగలిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి వర్గం సమస్యనూ పరిష్కరించింది. సాగునీరు, కరెంటుతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను తెచ్చి వ్యవసాయరంగంలో నూతనోత్తేజాన్ని నింపింది. ఆసరా పింఛన్లు ఇచ్చి అనాథలకు, వృద్ధులకు వికలాంగులకు అసహాయులైన ఎందరికో కనీస జీవన భద్రతను కల్పించింది. వృత్తిపనుల వారికి ఆర్థిక అండదండలను అందించింది. ముఖ్యంగా గొల్ల కురమలకు గొర్రెలనిచ్చింది. మత్స్యకారులకోసం చెరువుల్లో చేపలు వదిలి వాటిని ఉచితంగా పట్టుకునే అవకాశం కల్పించింది. నేతన్నలకు పని కల్పించింది. గీతన్నలకు చెట్ల పన్ను రద్దు చేసింది. ఆడపిల్లల పెండ్లి ఖర్చులకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు తెచ్చింది. ‘ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం’ అనే నినాదాన్ని నిజం చేసింది.


బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పినట్టు దళితుల్లో చైతన్యం రావాలంటే విద్యావంతులు కావాలి. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దయెత్తున రెసిడెన్షియల్‌ స్కూళ్ళను స్థాపించారు. తెలంగాణ ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ల సంఖ్య కేవలం 134. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాల్లో 104 స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేసింది. ‘ఒక సమాజం అభివృద్ధికి కొలమానం- ఆ సమాజంలో స్త్రీలు సాధించిన వికాసమే’ అన్న అంబేడ్కర్‌ మాటల స్పూర్తితో ఎస్‌సీ మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వాల కాలంలో ఎస్‌సీ సబ్‌ప్లాన్‌ కింద ఖర్చు చేసిన నిధులు రూ.7,500 కోట్లయితే- ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్‌సీ ప్రగతినిధి కింద సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. దళిత విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా రూ.20 లక్షల మొత్తాన్ని అందిస్తున్నది. నేడు దళితులు తమకాళ్ళ మీద తాము నిలబడాలనే లక్ష్యంతో దళితబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నది. ‘వేల సంవత్సరాలుగా అణగారిపోయిన దళిత సామాజిక వర్గం, మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా సమాన అభివృద్ధిని సాధించాలంటే కొద్దిపాటి సంస్కరణలు సరిపోవు. విశాలదృక్పథంతో ఒక పెద్ద ప్రయత్నం జరగాలె’ అని కేసీఆర్‌ భావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హృదయంలో ఉదయించిన అపూర్వ పథకం తెలంగాణ దళితబంధు. గతంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలకు ఇది పూర్తిగా భిన్నమైనది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలకు మెరుగైన, నిలకడైన, ఆదాయం లభించడం కోసం, అందుకు కావాల్సిన పెట్టుబడి- అక్షరాలా పదిలక్షల రూపాయల భారీ మొత్తాన్ని ఈ పథకం ద్వారా ప్రభుత్వమే సమకూరుస్తుంది. పదిలక్షల రూపాయల పెట్టుబడి మొత్తం వంద శాతం గ్రాంట్‌ రూపంలో అందజేస్తుంది. లబ్ధిపొందే కుటుంబ మహిళ పేరున ఉన్న ఖాతాలో ఈ డబ్బు మొత్తం జమచేస్తారు. గ్రాంట్‌ రూపంలో ఇస్తున్నారు కనుక తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అప్పు కట్టాలనే బాధ ఆ కుటుంబాన్ని వెంటాడదు. వచ్చిన ఆదాయాన్ని తమ జీవన అవసరాలకోసం వినియోగించుకుంటారు. మిగిలింది పొదుపు చేసుకుంటారు. క్రమేణా ఆ కుటుంబం ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతుంది.


ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌లో
రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఆ తరవాత పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ దళితబంధు రాబోయే రోజుల్లో నిశ్చయంగా దేశానికే తొవ్వ చూపిస్తుంది. పథకం విజయవంతం కావడం కోసం నిబద్ధతతో కూడిన వ్యక్తులు అవసరం. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్‌ పుట్టాలె. అవగాహన పెంచాలె. మహాకవి గాలిబ్‌ అన్నట్టు ‘ధ్యేయమును బట్టి ప్రతి పనీ దివ్యమగును’. దుష్ట శక్తులు పన్నే కుట్రలను తుదముట్టిస్తూ ఈ ఉదాత్త పథకం తప్పకుండా ఆశించిన గమ్యాన్ని ముద్దాడుతుంది. సకల జనుల అభివృద్దే ధ్యాసగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన తెలంగాణ దళితబంధు ఉద్యమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేద్దాం.


ఉపాధి ఎంపికలో స్వేచ్ఛ
దళితబంధు పథకం కింద ఉపాధి ఎంపికలో ప్రభుత్వం కేవలం మార్గదర్శనం మాత్రమే చేస్తుంది. పదిలక్షల రూపాయలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అయోమయానికి గురికాకుండా ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవకులు పాత్ర వహిస్తారు. అంతిమంగా ఎంపిక నిర్ణయం లబ్ధిదారుడిదే. తాను ఏ పనిని అల్కగ చేసుకోగలనని భావిస్తాడో అదే పనిని అతడు ఎంచుకోవచ్చు. ఈ పెట్టుబడి మొత్తం సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో గ్రామ, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటవుతాయి. లబ్ధిదారులకు అధికారులు, దళిత బస్తీల్లో ఉండే చైతన్యవంతులు నిరంతరం తగిన సలహాలు సూచనలను అందిస్తారు. అడుగడుగునా ప్రజల భాగస్వామ్యంతో పథకం కొనసాగుతుంది. లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆకస్మిక ప్రమాదానికి లోనైతే దళితబంధు పథకం ఒక రక్షక కవచంగా ఆ కుటుంబాన్ని కాపాడాలని కేసీఆర్‌ ఆలోచించారు. ఇందుకోసం ఈ పథకంలో ‘రక్షణ నిధిని’ భాగం చేశారు. ఈ నిధి కోసం లబ్ధిదారులు ఒక్కొక్కరు పదివేల రూపాయల చొప్పున జమచేస్తారు. ఆ మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఆపద పాలైన కుటుంబాలకు ఈ రక్షణనిధి నుంచి తక్షణం ఆర్థిక సహాయం అందుతుంది.

  • శ్రీ తన్నీరు హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి.
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.