ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. దేశంలో అభివృద్ధికి చిరునామాగా మారింది తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు అన్నిరంగాలు నిర్వీర్యంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ అన్నిరంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలోని వనరులు, రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాడి తెలంగాణ సాధించుకున్నామనే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకుంటూ ఏండ్ల తరబడి నష్టపోయిన ప్రతీదాన్ని తిరిగిపొందేందుకు అడుగులు ముందుకు వేశారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చారు. తెలంగాణకు న్యాయంగా రావలసిన నిధులు రాబట్టుకోవడానికి ఓ పక్క పోరాడుతూనే, రాష్ర్టాన్ని ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడే స్వయం సమృద్ధి సాధించేలా కేసీఆర్ ఆలోచన చేయడం గొప్ప విషయం. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉత్సాహకరమైన, స్నేహపూర్వకమైన వాతావరణం చూసి దేశవిదేశాలకు చెందిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐకియా వంటి అనేక సంస్థలు తెలంగాణకు తరలివస్తున్నాయి. ఒకవేళ కరోనా రాకపోయుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చే ఐదేండ్లలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉండేదనడంలో అతిశయోక్తి లేదు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ప్రభుత్వం పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ఒక్కో పనిని పూర్తిచేసుకుంటూ వెళ్తున్నారు. కరోనా కరాళ నృత్యంతో దేశాలను అట్టుడికిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం సడలని పట్టుతో ప్రజల పక్షాన నిలిచి సంక్షేమబాట పట్టిస్తున్నది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించటం గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
పూర్వం మునులు లోకకళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే రాక్షసులు ఆటంకం సృష్టించినట్లుగా కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల కళ్లముందు జరుగుతున్న సంక్షేమ నిజాన్ని, జరుగుతున్న అభివృద్ధి, సుపరిపాలనను చూసి ఎవరైనా నమ్మి తీరాల్సిందే. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ అభివృద్ధి కోసం అలుపెరుగని శ్రామికుడిలా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పట్ల తెలంగాణ జనావళి మదిలో గూడు కట్టుకున్న బొమ్మను చెరపలేరు. (వ్యాసకర్త: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే)
-మాగంటి గోపీనాథ్