అనాదిగా దళితజాతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో దళితులు మరింత దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. తద్వారా దళితులు ఓటర్లుగానే మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలని కాంక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగంగానే ‘దళిత బంధు’ అనే మరో బృహత్తర పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా మారుతుందనడంలోఅతిశయోక్తి లేదు.
ఒక దీపం వంద దీపాలను వెలిగిస్తుంది. తద్వారా వెలుగురేఖలు విరజిమ్ముతాయి. అట్లాగే ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరు పాటుపడే యజ్ఞమే ‘దళిత బంధు’. ఈ పథకం విజయవంతమై అణగారిన దళితవర్గాలకు మంచి తొవ్వ చూపెడుతుంది. నాడు అంబేద్కర్ దళిత, బహుజనవర్గాల బాగు కోసం కొట్లాడారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత, బహుజనవర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ పథకం కింద అందించబోయే రూ.10 లక్షలను వృథా చేయకుండా ప్రభుత్వం సూచించిన వ్యాపారాల్లో ఏదో ఒకటి ఎంచుకొని ప్రగతిపథాన నడువాలి. అప్పుడే దళితుల సాధికారత సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరుతుంది.
సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంపై ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తుండటం, దళితుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుండటం కుసంస్కారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దళితుల అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి, దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభం కాబోతున్న ‘దళితబంధు’ కార్యక్రమానికి అడ్డుపడటం దళితవర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.
‘దళిత బంధు’ విజయవంతమైతే ఒక్క తెలంగాణకే కాదు, యావత్ దేశ దళిత సమాజాభివృద్ధికి పునాదులు పడుతాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, దళితుల సాధికారత కోసం ప్రతి పౌరుడు కంకణబద్ధులై ముందుకుసాగాలి. తెలంగాణ సమాజం మానవతతో కూడుకున్నది. ఒక వర్గం అభివృద్ధి చెందితే స్వాగతిస్తుందే తప్ప, అడ్డుకోవాలని అస్సలు ప్రయత్నించదు. కానీ బీసీ వర్గాల పేరిట సామాజిక మాధ్యమాల్లో అసత్యపు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుల భరతం పట్టే రోజులు ఎంతోదూరం లేవు. సరైన సమయంలో, సరైన రీతిలో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. కేసీఆర్ నాయకత్వంలో రూపొందుతున్న ‘దళితబంధు’ పథకాన్ని విజయవంతం చేస్తారనడంలో సందేహం లేదు.
రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుత పురోగతిని సాధించింది. కరెంట్, సాగు, తాగునీరు, సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దేశం గర్వించే విధంగా సంక్షేమ పథకాలను అమలుచేశారు. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి చూపించారు. ఆయన రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా అది విజయవంతమైందే తప్ప, విఫలం కాలేదు. ఈ ‘దళిత బంధు’ పథకం కూడా దళితుల జీవితాల్లో మార్పును తీసుకురానున్నది. ఈ పథకం కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధితో, అకుంఠిత దీక్షతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ప్రతి దళిత బిడ్డ కేసీఆర్‌కు తమ మద్దతును ప్రకటించాలి. దళితజాతిలో వెలుగులు నింప బోతున్న సీఎం కేసీఆర్‌కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ‘దళిత బంధు’ ద్వారా రూ.10 లక్షలు అందుకోబోతున్న ప్రతీ దళిత బిడ్డకు అభినందనలు.
(వ్యాసకర్త: వరంగల్ తూర్పుశాసనసభ్యులు)
–నన్నపునేని నరేందర్