ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలహారం పథకాన్ని రూపొందించి ఇంటింటికీ నల్లాతో మంచినీటి సరఫరాకు కంకణం కట్టుకుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా కోసం 17 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ పథకాన్ని వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.

-ఎల్లంపల్లి నుంచి 17 టీఎంసీలు -మార్చి నుంచి బీడీ కార్మికులకు పింఛన్లు -ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు -పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి -మెదక్‌జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -కలెక్టరేట్‌లో ఆరుశాఖల పనితీరుపై సమీక్ష -గిరిజనులకూ మూడెకరాల భూమి: హరీశ్‌రావు ఆదివారం మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి మండలం చేర్యాల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం పుల్కల్,అందోల్ మండలాల అభివృద్ధి పనులకు శివ్వంపేటలో శంకుస్థాపనలు చేశారు. సింగూరు ప్రాజెక్టు వద్ద జలహారం పథకంలో ఇంటెక్‌వెల్, ఫిల్టర్‌బెడ్ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. అక్కడి నుంచి సంగారెడ్డికి చేరుకున్న మంత్రికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, జడ్పీటీసీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. జడ్పీ భవనాన్ని మంజూరు చేయాలని అభ్యర్థించగా వెంటనే నూతన భవనాన్ని మంజూరు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో ఆరు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన బీడీ కార్మికులకు వచ్చేనెల నుంచి పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడతున్నామన్నారు.
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేనిరుణ బకాయిలు రూ. 90.87 కోట్లను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన మైనర్ గ్రామాలకు రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహం అందిస్తామని, మేజర్ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూలైలో హరితహారం పథకం ప్రారంభించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. రానున్న వేసివిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకు విద్యుత్ కోతలు లేకండా చూడాలని, బిల్లు బకాయిలుంటే కలెక్టర్, డీపీవోలకు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 500 జనాభాగల తండాలను పంచాయతీలుగా మారుస్తున్నామని చెప్పారు.
గిరిజనులకు 3 ఎకరాల భూమి: మంత్రి హరీశ్‌రావు దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమంలాగే వచ్చే సంవత్సరం నుంచి గిరిజన పేద రైతులకు కూడా మూడెకరాల భూ పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహరాజ్ ఉత్సవాలకు కోసం ప్రతి జిల్లాకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు కృషిచేయాలని అధికారులు సూచించారు. సమీక్షా సమావేశంలో అసెంబ్లీ డిఫ్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, బాబుమోహన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితారాంచంద్రన్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, డీఆర్‌వో దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.