Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

యుద్ధప్రాతిపదికన మిషన్ పనులు..

మిషన్ భగీరథ పనుల పూర్తికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డెడ్‌లైన్ విధించారు. యుద్ధం చేసినట్టు చేయాలి. ఏం చేస్తారో చేయండి. కానీ డిసెంబర్ 2017నాటికి మాత్రం మిషన్ భగీరథ పూర్తి కావాలి. నల్లాలనుంచి నీళ్లు దుముకాలి అని ఇంజినీర్లను ఆదేశించారు. ఈ పథకాన్ని తెలంగాణ ఎట్లా పూర్తి చేయబోతున్నదోనని దేశమంతా ఆసక్తిగా చూస్తున్నదని, క్లిష్టమైనదే అయినా విజయవంతంగా పూర్తిచేసి మన సత్తాను చాటుదామని సీఎం పిలుపునిచ్చారు. ఏడాదికి 365 రోజులు 24 గంటలపాటు పరిశుభ్రమైన నీళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. భగీరథ పథకానికి ఎలాంటి నిధుల కొరతలేదని, అందువల్ల నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులు వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు.

cm-kcr-review-meet-on-mission-bhagiratha -భగీరథ టార్గెట్: 2017 డిసెంబర్ -నాణ్యతపై రాజీ పడవద్దు -నిధుల కొరత లేదు, వెంటపడి పనులు చేయించాలి -అధికారులకు సీఎం ఆదేశం -మంచినీటి పైపులతో పాటే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు -ఇండ్లలో నల్లాల బిగింపు పనులే కీలకం -సకాలంలో పూర్తిచేసే కాంట్రాక్టర్‌కు 1.5 శాతం ఇన్సెంటివ్ -గ్రామీణ మంచినీటి విభాగంలో భగీరథ విలీనం -వేముల ప్రశాంత్‌రెడ్డికి పర్యవేక్షణ బాధ్యత.. ఆయన మంత్రితో సమానం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన -ఎంసీహెచ్చార్డీలో మిషన్ భగీరథ పనుల సమీక్ష

గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు, ఇంటింటికీ నల్లాల బిగింపు చాలా కీలకమని చెప్పిన సీఎం, ఈ పనులను సకాలంలో పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 1.5శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. మిషన్‌భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని, ఆరు రాష్ర్టాల ప్రతినిధి బృందాలు ఇప్పటికే మిషన్ భగీరథను అధ్యయనం చేశాయని సీఎం తెలిపారు. సోమవారం నాడు ఎంసీహెచ్‌ఆర్‌డీలో మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌టేక్‌వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, పైపులైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల(జీఎల్‌బీఆర్) నిర్మాణ పనుల పురోగతిపై అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. అనుకున్న ప్రకారం పనులు నడస్తుండడంపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని కితాబునిచ్చారు. నాణ్యతపై మీదే బాధ్యత.. మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత ఉండేలా చూసే బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితే అది మీ మెడకే చుట్టుకుంటుంది అని హెచ్చరించారు. అలాగే పథకం ప్రారంభమయ్యాక వచ్చే బాలారిష్ఠాలమీద ఇప్పుడే దృష్టి పెట్టాలని సూచించారు. నీళ్లు రావటం ప్రారంభమైన తర్వాత రెండు మూడు నెలలు చిన్న చిన్న సమస్యలు వస్తాయని చెప్పిన సీఎం, వాటిపై ముందే ప్రజలకు వివరించాలని చెప్పారు. మరోవైపు అవి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధపరుచుకోవాలన్నారు. నడుమ నీళ్లు ఆగితే ప్రజలు ఊరుకోరు.. ఆ విషయం గుర్తుంచుకోవాలి అని సీఎం చెప్పారు. రాష్ర్టానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేనందున అధికారులు అంకితభావంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు.

ఇంటింటికీ ఇంటర్నెట్.. ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలని ప్రభు త్వం నిర్ణయించిందని, ఈ మేరకు పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందులోనే కలిపి వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేబుల్‌ను 1.5 మీటర్ లోతులో వేయాలన్నారు. ఇందుకు కావలిసిన సాంకేతిక సలహాలను ఐటీ శాఖనుంచి తీసుకోవాలని చెప్పారు. వంద కుటుంబాలు మించని గ్రామాల్లో హెచ్‌డీపీఇ పైపులు వేయాలా? లేక పీవీసీ పైపులు వేయాలా? అనే అంశంపై స్థానిక భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

నల్లాలు బిగించే పనులు చాలా ముఖ్యం భగీరథ పనులను రెండు సెగ్మెంట్లుగా విభజించుకోవాలని, అందులో గ్రామాల వరకూ నీళ్లు తీసుకుపోవటం ఒకటి కాగా, గ్రామాల్లో అంతర్గత పైపులు, ఇంటింటికీ నల్లాల బిగింపు రెండోదిగా పరిగణించి పనులు విభజించుకోవాలని సూచించారు. ఇందులో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైనదిగా భావించాలని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పనులు చేసే కాంట్రాక్టరు సకాలంలో పనులు పూర్తి చేస్తే 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఆర్ డబ్ల్యుఎస్‌కే మిషన్‌భగీరథ బాధ్యత.. భవిష్యత్‌లో మిషన్ భగీరథ నిర్వహణ బాధ్యత గ్రామీణ మంచి నీటి సరఫరా (ఆర్ డబ్ల్యు ఎస్) విభాగానికే ఉంటుందని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టతనిచ్చారు. మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యుఎస్‌లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం తదితర పనులు కూడా ఉన్నందున పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని, పని విభజన పకడ్బందీగా జరగాలని నిర్దేశించారు.

ప్రశాంత్‌రెడ్డికి పర్యవేక్షణ… మిషన్‌భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నావద్దే ఉన్నది. వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించినం.అందువల్ల ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఆయనకు ఉంది. స్వయంగా ఇంజినీర్ కూడా అయిన ప్రశాంత్‌రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు అని సీఎం కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్ సురేందర్‌రెడ్డిలతో పాటు సీఇలు, ఇఇలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తాగునీటి సమస్యను పారద్రోలుదాం.. భగీరథ పథకాన్ని పూర్తి చేసి తాగునీటి సమస్యను రాష్ట్రంనుంచి శాశ్వతంగా పారద్రోలుదామని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి సరఫరాకు భవిష్యత్‌లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రూ.22 వేల కోట్లు రుణాలివ్వడానికి అంగీకరించాయని, ఇదే రీతిలో మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం కూడా సమకూరనుందని చెప్పారు. అవసరమైతే బడ్జెట్‌లోకూడా నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్లకు వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తున్నామని, వారి వెంటపడి పనులు చేయించుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం చెప్పారు. పనులు వేగంగా జరిగేలా వర్క్ ఏజెన్సీలతో మాట్లాడాలని ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.