వారం పది రోజుల్లో యాదాద్రి అభివృద్ధి పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌లో కావలసినన్ని నిధులతో పాటు వెయ్యి ఎకరాల భూమి కూడా సమకూరినందున ఇక పనులను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో దాదాపు ఐదు గంటలపాటు యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

-వారం పది రోజుల్లో మొదలుకావాలి -వేయి ఎకరాల్లో అభివృద్ధి పనులు -ఐదెకరాల విస్తీర్ణంలో ప్రధానాలయ నిర్మాణం -గుట్ట చుట్టూ ప్రదక్షిణ రోడ్డు -మరో ట్యాంక్‌బండ్‌గా బస్వాపూర్ చెరువు -అభివృద్ధి పనులు సమీక్షించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కొలువైన ప్రధాన యాదాద్రితో పాటు మొత్తం నవగిరులు ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై ఇప్పటికే తయారైన ప్రతిపాదలనలతోపాటు, కొత్త ప్రతిపాదలనపై కూడా విస్తృతంగా చర్చించారు. ఆధ్యాత్మికం, అహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసే ప్రాంతంగా యాదగిరిగుట్టను రూపుదిద్దాలని సీఎం నిర్దేశించారు.
పుష్కలంగా నిధులు.. యాదాద్రి అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులున్నాయని సీఎం చెప్పారు. వరుసగా రెండు బడ్జెట్లలో ఇప్పటికే రూ.200 కోట్లు కేటాయించామని, టాటా, అంబానీ, జెన్కో, భెల్ లాంటి సంస్థలుకూడా సుమారు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. యాదాద్రి చుట్టూ 943.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో 100 ఎకరాలను సేకరిస్తామని తెలిపారు. అధికారులు వెయ్యి ఎకరాల స్థలాన్ని జోనింగ్‌చేసి, లే అవుట్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
గుట్టపైభాగంలో నిర్మాణాలు… యాదాద్రి గుట్టపై 15 ఎకరాల స్థలం ఉందని, దీనితో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తాయని సీఎం చెప్పారు. ఈ ఐదెకరాల్లో ప్రాకారం, మాడ వీధులు నిర్మించాలని సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు కూడా ఇందులోనే రావాలన్నారు. పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకులకు నివాస గృహాలు, రథమంటపం, క్యూ కాంప్లెక్స్, వీఐపీ అతిథిగృహం నిర్మించాలని చెప్పారు. దేవుడి ప్రసాదాలు తయారుచేసే వంటశాల, అద్దాల మందిరం కూడా అందులోనే రావాలన్నారు. యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాలు ఉంటుందని, దీనిని కూడా సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఈ ప్రధాన గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా నిర్మించాలని సీఎం చెప్పారు.
కింది భాగంలో చేపట్టాల్సినవి.. యాదాద్రి కింది భాగంలో బస్టాండ్, కళ్యాణమంటపం, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించాలని సీఎం ఆదేశించారు.అలాగే పూజకు వినియోగించే పూలచెట్లతో కూడిన స్వామివారి ఉద్యానవనం, మండల దీక్షలు తీసుకునే వారికోసం వసతి కేంద్రాలు నిర్మించాలి. యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, గెస్ట్‌హౌజ్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, గోశాల, అన్నదానం కోసం భోజనశాల, పర్మినెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువుకట్టను ట్యాంక్‌బండ్ మాదిరిగా తీర్చిదిద్దాలన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా నాలుగులైన్ల రోడ్లు వేయాలని, ప్రతి రోడ్డుకు డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, మధ్యలో ఐలాండ్స్ నిర్మించాలన్నారు. సమీపం లోని 11 ఎకరాల్లో 3 అతిథిగృహాలు నిర్మించాలని సూచించారు.
ఆధ్మాత్మికత తొణకిసలాడాలి.. యాదగిరిగుట్ట ప్రాంతమంతా ఆధ్యాత్మికత తొణకిసలాడాలని సీఎం చెప్పారు. ఈ ప్రాంతమంతా అందమైన చెట్లతో నిండాలి.. భక్తి భావన పెంపొందే విధంగా ఈ ప్రాంతమంతా మారుమోగేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న వివిధ దేవాలయాల ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు పాత యాదగిరినికూడా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు.
ఈ సమీక్షలో మంత్రి జగదీశరెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్స్ జగన్, ఆనంద్‌సాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.