Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దీటుగా బదులిద్దాం!

-విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం.. మంత్రులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష -అసెంబ్లీ సమావేశాలపై వ్యూహరచన -ప్రధాన సమస్యలు, తక్షణ చర్యలపై చర్చ -అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ భర్తీలు -మంత్రులకు ముఖ్యమంత్రి హామీ? -నేడు రాష్ట్ర క్యాబినెట్ కీలక సమావేశం -పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి -రాష్ట్రం తీవ్ర కరువునుంచి బయటపడినట్లే.. -ఖరీఫ్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి

KCRరైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులకు సూచించారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై పూర్తి గణాంకాలు, వివరాలతో మంత్రులు సంసిద్ధులై రావాలని సూచించారు. పది రోజులపాటు చైనాలో విజయవంతంగా జరిగిన తన పర్యటనతోపాటు.. త్వరలో ప్రారంభం కానున్న అ సెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి పలువురు సీనియర్ మంత్రులతో గురువారం సమావేశమయ్యారు.

మెదక్ జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో తక్షణం దృష్టిసారించాల్సిన సమస్యలను ఆయన ఈ సందర్భంగా మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టాలనే ప్రస్తావనకూడా ఈ భేటీలో వచ్చినట్టు సమాచారం. దానికి సీఎం సానుకూలంగా స్పందించి, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆ ప్రక్రియను మొదలుపెడతానని చెప్పినట్టు తెలిసింది. రైతుల ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీ డిజైన్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనే అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తంచేయగా.. వీటికి అసెంబ్లీ వేదికగా సమర్థంగా సమాధానాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని, అవసరమైన గణాంకాలు, వివరాలను సేకరించుకుని ముందస్తు కసరత్తుతో రావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ఉద్బోధించినట్టు తెలుస్తున్నది.

గురువారం సాయంత్రం 3గంటలకు మొదలైన సమావేశం రాత్రి 9.30 గంటల వరకు జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారని సమాచారం. కాగా.. శుక్రవారం వ్యవసాయం, వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్ పరిస్థితిపై సమీక్షించారు.

అసెంబ్లీ తరువాత నామినేటెడ్ పదవులు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల తరువాత నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని వ్యవసాయక్షేత్రంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతోపాటు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్, కార్యవర్గాలకు సంబంధించి నామినెటెడ్ పదవులను భర్తీచేయడంపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. చాలాకాలంనుంచి నామినెటెడ్ పదవుల భర్తీకోసం పార్టీ నేతలు, క్రియాశీల సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మార్కెట్ కమిటీలు, దేవాలయాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే చాలా కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ పదవులు, పాలకవర్గాల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో ఆలయాలు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవులలో పార్టీ నేతలు, చురుకైనవారిని నియమించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.

నేడు క్యాబినెట్ కీలక భేటీ ముఖ్యమంత్రి బృందం చైనా పర్యటన అనుభవాలను వివరించడంతోపాటు.. రాష్ట్రంలో తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలను చర్చించడానికి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ కీలక భేటీ జరుగనుంది. దీంట్లోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైకూడా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు ముసాయిదాలు, చర్చించాల్సిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు. అలాగే పలు అంశాలకు సంబంధించిన నిర్ణయాలుకూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక కసరత్తుకోసం శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈనెల 22న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

ఖరీఫ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జులై, ఆగస్టు మాసాల్లో వర్షపాతం అనుకున్న విధంగా లేకపోయినప్పటికీ.. సెప్టెంబర్‌లో మంచి వర్షాలు పడుతున్నాయని, ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వ్యవసాయం, వర్షాలపై అధికారులతో ఆయన చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, రెవెన్యూ శాఖ కార్యదర్శి బీఆర్ మీనా, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు. మహబూబ్‌నగర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షాలు పడుతుండటం శుభ సూచకమని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం తీవ్ర కరువు నుంచి బయటపడినట్లేనని, రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ మంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని, దీని ఫలితంగా రబీ సీజన్‌కు, మంచినీటికి ఢోకాలేదని అన్నారు. జూన్‌లో వేసిన పంటలకు నష్టం కలిగిందని, జులైలో వేసిన పంటలు బతికే అవకాశం ఉందని చెప్పారు. ఏదిఏమైనా అధికారులు మండలాల వారీగా సర్వేలు జరిపి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని ఆదేశించారు. నష్టం జరిగిన రైతులకు సాయం చేసే విషయంలో ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. సెప్టెంబర్ 30 వరకు వాతావరణ పరిస్థితిని అంచనావేసి తరువాత చర్యలకు ఉపక్రమించాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.