వివిధ శాఖల ఇంజినీర్లతో సీఎం సమావేశం
ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్ ఏర్పాటులో వివిధ శాఖల ఇంజినీర్లందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రిడ్ పనులను నిర్వహించే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖతో ఇప్పటికే పలుదఫాలుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. గ్రిడ్‌ను పట్టణాలు, మున్సిపాల్టీలు, నగరాలు, గ్రామాలకు అనుసంధానం చేస్తున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఇంజినీర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం సచివాలయంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూపొందించిన అంచనా వ్యయాలపై చర్చిస్తారు. గ్రిడ్ నిర్మాణంపై తుదినిర్ణయం జరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గ్రిడ్ విస్తీర్ణం, అంచనా వ్యయం, సర్వే ఎలా నిర్వహించాలి? ఎన్ని రోజులు నిర్వహించాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.