ఆ మురికివాడలు పులకించిపోయాయి. గడప గడప తన్మయత్వం చెందింది. కార్పొరేటర్‌స్థాయి నేతలుకూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు ఓట్లకోసం వెళతారు తప్పించి.. ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితే ఉండదు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి.. కనీసం కాలిబాటలు కూడా లేని తమ కాలనీల్లోకి రావడమేకాక.. ఇరుకు ఇల్లిల్లూ తిరిగి.. ఇంటిపెద్దగా సాదకబాధకాలు తెలుసుకోవడంతో పేదల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. -మూడుగంటలపాటు ఇల్లిల్లూ తిరిగిన కేసీఆర్ -పేదల కాలనీల్లోని పరిస్థితులపై విస్మయం.. -పేదలందరికీ ఇండ్లు.. అర్హులందరికీ ఆసరా -పట్టణాల్లో పేదల కోసం జీ ప్లస్ వన్ నిర్మాణాలు -మురికివాడల ప్రజలకు సీఎం భరోసా -నేడు, రేపు కూడా వరంగల్‌లోనే కేసీఆర్

ఆయన పర్యటించిన కాలనీలు వరంగల్ నగరంలోనివి. వరంగల్‌పై తనకు అమితమైన అభిమానం ఉందని, తనకు ఈ ప్రాంతంతో చారిత్రక బంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిరూపించారు. నిజానికి ఆయన పర్యటన శుక్రవారం ఉంటుందని, అదీకూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉందని జిల్లా యంత్రాంగం అంతా భావించింది. కానీ.. కేసీఆర్ అనూహ్యంగా గురువారం సాయంత్రమే వరంగల్‌కు చేరుకున్నారు. నాలుగున్నర గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీలో హెలికాప్టర్ నుంచి దిగి.. నేరుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడలకు వెళ్లారు.
అక్కడ లక్ష్మిపురం, సాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్ మురికివాడల్లో పర్యటించారు. నేను పాత ముఖ్యమంత్రుల్లాంటి వాడిని కాదు. మాట తప్పని ముఖ్యమంత్రిని అని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. పలువురు పేదల ఇండ్లలోకి వెళ్లిన కేసీఆర్.. ఫించన్ వచ్చిందా? పిల్లలు ఏం చేస్తున్నారు? అంటూ యోగక్షేమాలు అడిగారు. మురికివాడల్లో తిరిగే సమయంలో అక్కడి పరిస్థితులు చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. మీ సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటా అని భరోసా ఇచ్చారు.
తెల్లవారే సరికల్లా అధికారులంతా మీ గడప ముందట ఉంటారు. మీ సమస్యలను తీరుస్తారు అంటూ అభయమిచ్చారు. ఆ మేరకు అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. వివిధ మురికివాడల్లో పేదలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. మురికివాడల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారందరికి జీప్లస్1 గృహాలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 400 నుంచి 460చదరపు అడుగుల స్థలంలో డబుల్ బెడ్‌రూం (అటాచ్డ్‌బాత్‌రూం, టెట్రిన్), హాల్, కిచెన్‌ను నిర్మిస్తామని, ఒక ఇంటికి రూ.3.75లక్షల వ్యయమైనా భర్తిస్తామని తెలిపారు.
ఎలాంటి రుసుము తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అప్పగిస్తామని చెప్పారు. కాలనీలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, కమ్యూనిటీహాల్, రోడ్ల నిర్మాణం చేస్తామని, పేదల బస్తీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గత ముఖ్యమంత్రుల్లా మాటలు చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. పది రోజుల్లో ఈ కాలనీవాసులందరికి జీప్లస్1 గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగు నెలల్లో స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తానని తెలిపారు.
నేడు అధికారుల బస్తీబాట అధికారులంతా బస్తీబాట పట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మురికివాడల్లోని చాలా మంది పేదలకు పింఛన్లు రాలేదు. ఇది బాధాకరం. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిని చూసి బాధ కలిగింది. ఎవరు కూడా ఇక దరఖాస్తులు చేసుకోకండి. అధికారులే మీ గడపకు వస్తారు అని పేదలనుద్దేశించి సీఎం అన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌కాకపోవడం వల్లే కొందరికి పింఛన్లురాలేదని అధికారులు సమాధానం ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది వారి తప్పెలా అవుతుందని నిలదీశారు. శుక్రవారం ఉదయమే జాయింట్ కలెక్టర్, ఆర్‌డీవో, ఇతర ఉన్నతాధికారులంతా మురికివాడలకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. అవసరమైతే జిల్లాలోని అధికారులను కూడా మురికివాడల్లో సర్వేకు పంపిస్తానని అన్నారు. మురికివాడల ప్రజలంతా ఇండ్ల వద్దే ఉండాలి. అధికారులకు సహకరించాలి. అధికారులు ఇంటికి వస్తే అన్ని వివరాలు అందజేయాలి. అర్హులందరినీ గుర్తించి, అక్కడికక్కడే పింఛన్లు, ఆహార భద్రతకార్డులు మంజూరు చేస్తారు అని సీఎం చెప్పారు.
రేపు కూడా ఇక్కడే ఇక్కడ అధికారుల తీరు సరిగా లేదు. మీ సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటా. అవసరమైతే శనివారం సాయంత్రం వరకు ఇక్కడే ఉండి, పరిష్కరించి పోతాను. 50 అడుగులు వేయలేదు.. 10మంది పింఛన్లు రాలేదని చెప్పారు. ఇది చాలా బాధాకరం. అధికారులు ఏం సర్వే చేశారో అర్థం కావడం లేదు. కలెక్టర్ సంగతి, నా సంగతి ఇక తేల్చుకుంటాం. మీ సమస్యలు పరిష్కరించే వెళతా అని ముఖ్యమంత్రి చెప్పడంతో ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు వరంగల్ జిల్లానుంచి బతుకుదెరువుకోసం సూరత్, భీవండి, షోలాపూర్ ప్రాంతాలకు వెళ్లిన వారందరినీ జిల్లాకు రప్పిస్తామని కేసీఆర్ అన్నారు. జిల్లాలో నాలుగు లక్షల పవర్‌లూమ్స్‌తో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వరంగల్ చుట్టూ ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇటీవలే ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానని, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసి లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు.
సీఎం కేసీఆర్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీల సీతారాంనాయక్, జిల్లా ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేష్, బానోతు శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ జీ కిషన్, కమిషనర్ సువర్ణపాండాదాస్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవుడు వచ్చినైట్టెంది.. సీఎం అసుంటి మనిషి మా దగ్గరికి వత్తడని మేం కలలో సుత అనుకోలేదు. మమ్ములను ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. మా వాడకట్టుకు వచ్చి మా బతుకుల్ని చూసిండు. తండ్రి లెక్క మంచిచెడ్డలు అడిగిండు అని వరంగల్ మురికివాడల వాసులు ఆనంద భరితులవుతున్నారు. ఇన్నాళ్లకు తమకు దిక్కుదొరికిందని ఆనంద బాష్పాలు రాలుస్తున్నరు. సీఎం వస్తే మీకు ఎట్లుందమ్మా అని గెండెకారి ఇందిరను టీ మీడియా అడిగితే.. ఎట్లుంటదని చెప్పాలె. దేవునికోసం మొక్కుతం. దేవున్ని చూసేతందుకు గుడికిపోతం. కని ఆయన దేవుని లెక్క వచ్చిండు. మా మొర విన్నడు. ఇప్పుడైనా మా బతుకులు మారుతయని అనుకుంటున్నం అని ఆమె చెప్పారు. సీఎం తిరిగిన మురికివాడల వాసులు అనేకమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు, రేపు వరంగల్‌లోనే సీఎం సీఎం కేసీఆర్ శుక్ర, శనివారాల్లో కూడా వరంగల్‌లో పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని మురికివాడల్లో పర్యటిస్తారు. ఆ తరువాత బ్రాహ్మణ సమాఖ్య, అర్చక సమాఖ్య నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి భూపాలపల్లి నియోజకర్గంలో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత తిరిగి వరంగల్‌కు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు వర్ధన్నపేట నియోజకర్గం పరిధిలోని విలీన గ్రామాల్లో పర్యటిస్తారు.