Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వరంగల్‌కు 25 కోట్లు

-వరద బాధిత నగరానికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా
-నెల రోజుల్లో నాలాలపై ఆక్రమణల తొలిగింపు
-రహదారులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ
-నష్టాన్ని అంచనా వేసిన తరువాత మరిన్ని నిధులు
-కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
-వరంగల్‌లో అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం
-ముంపు ప్రాంతాల్లో మంత్రులతో కలిసి పర్యటన
-ఎంజీఎంలో కొవిడ్‌ బాధితులకు పరామర్శ

‘నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి.. వాటిని తక్షణం తొలిగించాలి. ఈ విషయంలో రాజీపడేది లేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. పెద్ద నిర్మాణాల తొలిగింపునకు భారీ యంత్రాలు తెప్పించండి. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలిగింపు వెంటనే ప్రారంభం కావాలి’‘వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉన్నది. వరంగల్‌లో భారీ వరదలు రావడం సీఎంకు ఆందోళన కలిగించింది. హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌ దెబ్బతినకూడదని, ప్రాణనష్టం కలుగకుండా సహాయ చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు’
– మంత్రి కే తారకరామారావు

వరంగల్‌ నగరంలో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. నగరంలో వరద ముంపునకు కారణమైన నాలాల ఆక్రమణలను వచ్చే దసరా నాటికి తొలిగిస్తామని చెప్పారు. నెలరోజులపాటు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలిగించేందుకు అర్బన్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. నష్టంపై అధికారులు పూర్తి అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరుచేస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్‌ మంగళవారం వరంగల్‌లో పర్యటించారు. అనంతరం నిట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాలాలపై ఆక్రమణల వల్లే వరదనీరు రోడ్లపైకి వచ్చిందని అన్ని ప్రాంతాల ప్రజలు చెప్పారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. నగరంలో అనేకచోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటిని తక్షణం తొలిగించాలి. ఈ విషయంలో రాజీపడేది లేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. పెద్దపెద్ద నిర్మాణాలు తొలిగించడానికి భారీ యంత్రాలు తెప్పించండి. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలిగింపు పని వెంటనే ప్రారంభం కావాలి. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలిగించేందుకు కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమిస్తున్నాం’ అని చెప్పారు. ‘నెలరోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలిగించాలి. అవి అక్రమ నిర్మాణాలైతే నిర్దాక్షిణ్యంగా తొలిగించాలి. పేదల ఇండ్లయితే వారికి ప్రభుత్వం తరఫున డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ ఉన్నవైతే నష్టపరిహారం చెల్లించాలి.

ఏదేమైనా మొత్తం నాలాలపై ఆక్రమణలు తొలిగించాలి. భవిష్యత్‌లో మళ్లీ ఆక్రమణలు జరుగకుండా వాటికి ప్రహారీలు (రిటైనింగ్‌ వాల్స్‌) నిర్మించాలి’ అని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఎస్సారెస్పీ కాల్వ, అక్విడక్ట్‌ వద్ద కూడా పూడిక తీయాలని కేటీఆర్‌ అధికారులకు సూచించారు.‘పద్ధతి ప్రకారం నగరాభివృద్ధి జరుగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చాం. దానికితోడు వరంగల్‌కు కొత్త మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. సీఎం ఆమోదంతో త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం. కొత్తగా టీఎస్‌ బీపాస్‌ కూడా వచ్చింది. ఈ చట్టాలు, విధానాలు, ప్రణాళికలకనుగుణంగా వరంగల్‌లో ఇకపై నిర్మాణాలుండాలి’ అని కేటీఆర్‌ చెప్పారు.

వరంగల్‌పై సీఎం ప్రత్యేక శ్రద్ధ
‘వరంగల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయి. నగరంలో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సీఎంకు ఎంతో ఆందోళన కలిగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మార్గనిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు వరంగల్‌లో 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి ముంపు ప్రాంతాలకు చెందిన 4,500 మందికి ఆశ్రయం కల్పించాం. ముఖ్యమంత్రి సోమవారం స్వయంగా వరంగల్‌ రావాలనుకున్నారు. కానీ, సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందని మానుకున్నారు. మమ్మల్ని ప్రత్యేకంగా పంపించారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సీఎంకు నివేదించాం. తక్షణ అవసరాలకు రూ.25 కోట్లు మంజూరు చేసిన సీఎం.. అధికారులు పూర్తిస్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పారు’ అని కేటీఆర్‌ చెప్పారు.

ముంపు బాధితులకు ప్రభుత్వ అండ
‘ప్రస్తుతం కురిసిన వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపునకు గురైన వారికి అవసరమైన సాయం అం దించడం తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలి. ముంపునకు గురైన వారికి ప్రభు త్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలి. రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్షసూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రుల బృందం ముంపు ప్రాంతాలనుహెలికాప్టర్‌ నుంచి వీక్షించింది. అనంతరం ప్రత్యేక బస్సులో నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వరంగల్‌లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఐదారురోజులుగా కురిసిన భారీవర్షాలకు వరంగల్‌ మహానగరం వరద ముంపునకు గురైంది. అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్‌ రాజయ్యతో కలిసి కేటీఆర్‌ వరంగల్‌లో పర్యటించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి దాదాపు మూడు గంటలపాటు పలు ప్రాంతాల్లో పరిస్థితుల్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అక్కడి నుంచి ఎంజీఎంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులతో సంభాషించారు. అనంతరం నిట్‌లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు
వరంగల్‌లో నాలాలపై ఆక్రమణలు తొలిగించేందుకు అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్‌ కమిషనర్‌ కోచైర్మన్‌గా, గ్రేట ర్‌వరంగల్‌ కమిషనర్‌, జలవనరులశాఖ ఎస్‌ ఈ, వరంగల్‌ అర్బన్‌ ఆర్డీవో, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఎస్‌ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తూ మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

మా పాపకూడా ఎనిమిదే చిన్నారి రీతూతో మంత్రి కేటీఆర్‌
కేటీఆర్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటి స్తూ సంతోషిమాతకాలనీ వద్ద ఓ చిన్నారిని ‘నీ పేరేమిటి? అని అడిగారు. ‘రీతూ సార్‌’ అని ఆపాప చెప్పింది. ‘ఏం చదువుతున్నా వ్‌?’ అని అడగ్గానే ‘ఎయిత్‌ అయిపోయిం ది సార్‌’ అని చెప్పింది. కేటీఆర్‌ కూడా ‘మా పాప కూడా ఎయితే’ అని నవ్వుతూ అన్నారు. ‘క్లాస్‌లు అవుతున్నాయా’ అనడిగితే.. ‘ఆన్‌లైన్‌లో అవుతున్నాయ్‌ సార్‌’ అన్నది. ‘మీ ఇంట్లోకి నీళ్లు వచ్చాయా?’ అంటే ‘ఔనుసార్‌’ అని బదులిచ్చింది. ‘మరేం చేద్దాం?’ అనగానే ‘నీళ్లు పోవాలి సార్‌’ అని చెప్పింది. నీళ్లు పోవడమేకాదు మళ్లీ రాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం అంటూ మంత్రి ముందుకుసాగారు.

కొవిడ్‌ వార్డులో 45 నిమిషాలు
మంత్రి కేటీఆర్‌ ఎంజీఎం కొవిడ్‌ వార్డులో దాదాపు 45 నిమిషాలు గడిపారు. మంత్రులు కేటీఆర్‌, ఈటల, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్‌ హన్మంతు పీపీఈ కిట్లు ధరించి కొవిడ్‌ విభాగంలోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రతిఒక్కరినీ కేటీఆర్‌ పలుకరించారు. ‘ఎవరూ అధైర్యపడొద్దు’ అని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన కరోనా బాధితుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజమల్లుతో మాట్లాడి, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మరో బాధితుడికి పల్స్‌ ఆక్సీమీటర్‌ను పరిశీలించారు. ఆక్సీమీటర్‌ 96గా చూపించడంతో బాధితుడి వెన్నుతట్టి ‘త్వరలో ఇంటికి వెళ్లిపోవచ్చు’ అంటూ ధైర్యాన్ని నింపారు. బాధితుల్లో కొందరు మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కొవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఎంజీఎంలో అందుతున్న సేవలపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. త్వరలోనే ఎంజీఎంలో మరో 150 పడకలను అదనంగా ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయని వివరించారు. పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కొవిడ్‌ సేవలను త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, మంత్రి కొవిడ్‌ విభాగంలోకి వెళ్లకపోవచ్చని భావించిన అధికారులకు కేటీఆర్‌ షాకిచ్చారు. గంటసేపు ఎంజీఎంలో ఉన్న ఆయన 45 నిమిషాలు కొవిడ్‌ వార్డులోనే ఉండడం విశేషం. కొవిడ్‌ బాధితుల పరామర్శకు రక్తసంబంధీకులే జంకుతుంటే.. కేటీఆర్‌ ఏకంగా కొవిడ్‌వార్డుకు రావడం, అక్కడి రోగులతో మాట్లాడి, భరోసా ఇవ్వటంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పడంతో తాము ఫిదా అయ్యామని పలువురు డాక్టర్లు చెప్పారు.

‘గాంధీ’ తరహాలో ఎంజీఎం అభివృద్ధి
-వరంగల్‌కు మొబైల్‌ ల్యాబ్స్‌
-వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల
కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన తరహాలో వరంగల్‌ ఎంజీఎంను తీర్చిదిద్దనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఎంజీఎంను సందర్శించిన అనంతరం ఆయన వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఎక్కడికక్కడే ప్రభుత్వపక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా సోకినవారి కోసం ఎంజీఎంలో ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన 340 బెడ్లు ఉన్నాయ ని, కొద్దిరోజుల్లోనే వాటిని 750కు పెం చుతామని చెప్పారు. అవసరమైన టెస్ట్‌ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, డాక్టర్లు, వైద్యసిబ్బం ది ఉన్నారని తెలిపారు. వరంగల్‌కు ప్రత్యేకంగా మొబైల్‌ల్యాబ్స్‌ పంపించనున్నట్టు ఈటల ప్రకటించారు. దవాఖానల్లో బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ మెరుగ్గా ఉండాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.