Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వరంగల్‌కు కంతనపల్లే దిక్కు

– అక్కడి నుంచే ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్లు – ప్రతిఏటా వస్తా.. సమష్ఠిగా అభివృద్ధి సాధిద్దాం – భూపాలపల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్

KCR-meeting-in-warangal

కరువు కాటకాల నుంచి బయటపడాలంటే వరంగల్ జిల్లాకు కంతనపల్లే దిక్కు. ఎక్కడో ఉన్న ఎస్సారెస్పీ నుంచి డీబీఎం-38 కాలువకు నీళ్లిచ్చుడనేది ఉత్త ముచ్చటే. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత పాలకులు తమ వికృత చేష్టలతో ఈ ప్రాంతాలను పరిహాసం చేశారు. ప్రణాళికలు లేకుండా ప్రాజెక్టులు చేపట్టారు. ఇక మీదట ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోవద్దు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి పనులు జరగాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం భూపాలపల్లిలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వైద్యారోగ్యశాఖ, ఆర్టీసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ కాలువకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. భూపాలపల్లి నియోజవర్గంలో సుమారు 52 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్న ఎస్సారెస్పీ తొలిదశ డీబీఎం-38 కాల్వను పునరుద్ధరించడం అవసరమని భారీనీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఈ కాలువ తవ్వినప్పటి నుంచి ఇప్పటివరకు నీరు వచ్చిన దాఖలాల్లేవని పేర్కొంటూ.. వచ్చినయా? రాలేదా? మీరే చెప్పాలని సమావేశంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను అడిగారు. కాలువ తవ్వి పదిహేనేండ్లయింది కానీ.. నీరు రాలేదని వారు సీఎంకు వివరించారు. దీంతో 2003లో అప్పటి ముఖ్యమంత్రి వచ్చినపుడు ఈ కాలువ ద్వారా వచ్చిన నీళ్లు.. మళ్లీ ఆయనతోనే వెళ్లిపోయాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

350 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మారుమూలలో ఉన్న భూపాలపల్లి నియోజకవర్గానికి సాగునీరు వస్తుందంటే ఎట్లా నమ్ముతామని, ఈ విషయం ఏ అసిస్టెంట్ ఇంజినీర్‌ను అడిగినా చెప్తారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో గత పాలకులు చేసింది పచ్చి దగా, మోసమని మండిపడ్డారు. కంతనపల్లి ప్రాజెక్టులో భాగంగా అవసరమైతే 10 లేదా 15 టీఎంసీల సామర్థ్యంతో రెండు, మూడు కొత్త రిజర్వాయర్లను ప్రతిపాదించాలని సూచించారు. గడిచిన ఆరు నెలలుగా ప్రభుత్వపరంగా సమీక్షలు, సమావేశాలతో రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మించడం కోసం ప్రణాళికలు తయారుచేశాం. ఒకటి రెండు రోజుల్లో ఐఏఎస్‌ల పంపిణీ కూడా పూర్తవుతుంది. పరిపాలన ఇక పట్టాలెక్కుతుంది అని సీఎం పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో 40 వేల మొక్కల పెంపకం ప్రతి గ్రామంలో ఏటా హరితహారం పథకం కింద 40 వేల మొక్కలను నాటే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని, రానున్న ఐదేండ్లలో ఒక్కో గ్రామంలో లక్షా 20 వేల మొక్కలు నాటుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని పునరుద్ధరిస్తే 265 టీఎంసీల నీటిని ఒడిసి పట్టవచ్చని, వారంపాటు వర్షం కురిస్తే మూడేండ్ల దాకా కరువన్నదే మన దరి చేరదని భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భూపాలపల్లికి అధిక ప్రాధాన్యమిస్తూ అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, అజ్మీరా సీతారాంనాయక్, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, జిల్లా కలెక్టర్ కిషన్, జెన్‌కో సీఈ శివకుమార్ పాల్గొన్నారు.

రెవెన్యూ డివిజన్‌గా భూపాలపల్లి – వంద పడకల దవాఖానా మంజూరు.. సీఎం వరాలజల్లు భూపాలపల్లి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాలజల్లు కురిపించారు. వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న ములుగు నుంచి భూపాలపల్లిని వేరు చేసి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లిలో వంద పడకల దవాఖానాను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అన్ని హంగులతో రూ.కోటి 75లక్షల అంచనా వ్యయంతో బస్టాండ్‌ను మంజూరు చేశారు. సింగరేణి, జెన్‌కో సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు, తారురోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఆరు డబుల్ రోడ్లను మంజూరు చేసి.. రూ.35 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు వెయ్యి కిలోమీటర్ల రహదారులను క్రమంగా బీటీ రోడ్లుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

వెలంపల్లి, వెంకట్రావుపల్లిలలో కొత్తగా రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేశారు. చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండేండ్ల తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతామని హామీఇచ్చారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి బాగా అభివృద్ది చెందనున్నదని, ఇక్కడ 200 ఏండ్లకు సరిపడా బొగ్గు గనులున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే మధుసూదనాచారి మాట్లాడుతూ.. భూపాలపల్లికి రైల్వేలైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని, రామగుండం-మణుగూర్ లేదా భూపాలపల్లి-జమ్మికుంట లైన్ మంజూరు చేయించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.