-వ్యవసాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పోచారం

తెలంగాణ రాష్ర్టాన్ని విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఆయన వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని అంతకుముందు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన విత్తనాల్లో 60శాతం సరఫరా చేయగలిగిన వనరులు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాదినాటికల్లా సోయాబీన్ వంటి విత్తనాలను ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయకుండా రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడినంతగా ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని జూన్ 10వరకు అన్ని గ్రామాల్లోనూ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వివిధ రకాల విత్తనాలు 1.92లక్షల క్వింటాళ్లు మండలస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఎరువుల విషయంలోనూ ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 6.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. ఇవి కాక.. మార్క్‌ఫెడ్‌లో మరో 1.53లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉంచామని వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్. బీ జనార్దన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ సుధాకర్, మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్‌బాబు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మరాజు పాల్గొన్నారు.