Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వీళ్లా చెప్పేది?

ఉమ్మడి రాష్ట్రంలో 58ఏండ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని ఇన్నేండ్లలో నాశనం చేసినవారు 15 నెలల్లో మీరేమీ చేయలేదని అడిగితే ఎట్లాగని నిలదీశారు. వాళ్లు నాశనం చేసిన రాష్ర్టాన్ని బాగుచేసేందుకు తాము కొత్త చరిత్ర ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే నీటిపారుదల రంగంలో విప్లవాన్ని చూడబోతున్నామని అన్నారు. పనికిరాని గత పాలకులు, వారి అసమర్థత, అవివేకమైన పాలన రైతుల ఆత్మహత్యలకు కారణమని సీఎం చెప్పారు.

KCR addressing in Assembly

ప్రస్తుతం రాష్ర్టానికి పునాది వేస్తున్నామన్న సీఎం.. పునాది దశలో తప్పు జరిగితే రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలే తీసుకుంటామని స్పష్టంచేశారు. అంతేకానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ నిర్ణయాల్లో తప్పు జరుగబోదని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించారు. రూ.33,982 కోట్లు కేటాయించి దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్‌వన్ అని ఆయన సగర్వంగా చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడానికి అహోరాత్రులు కష్టపడుతున్నామని కేసీఆర్ చెప్పారు.

-58 ఏండ్లు నాశనం చేశారు -మేము కొత్త చరిత్ర ప్రారంభించాం -ఇరిగేషన్‌లో విప్లవం చూడబోతున్నం.. -నా కంఠంలో ప్రాణం ఉండగా తప్పు జరగదు -గత పాలకుల అసమర్థ, అవివేక పాలనతోనే రైతు ఆత్మహత్యలు -అసెంబ్లీలో సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ పాలకుల వ్యవహారశైలిపై నిప్పులు

సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం నం.1 – సంక్షేమానికి 34వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం – కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తెచ్చాం – రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి కాలేజీ విద్యార్థులకూ సన్న బియ్యం – ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ -బీడీకార్మికులకు భృతి ఇవ్వడం చరిత్రలోనే లేదు – ప్రతీ నియోజకవర్గానికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు -జలవ్యూహంపై 15 లేదా 16న అఖిలపక్షం! అసెంబ్లీలో బుధవారం సంక్షేమరంగంపై జరిగిన చర్చలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, టీఆర్‌ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లెవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణాలను విశ్లేషించడంతోపాటు.. పదిహేను నెలల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సీఎం ప్రస్తావించారు. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. 58 ఏండ్ల అరాచక పాలనకు బాధ్యులెవరు? మేం అడగాల్సిన ప్రశ్న. కానీ 15 నెలల్లో మీరేమీ చేయలేదని వాళ్లడిగితె ఎట్ల? ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య రీతిలో నిరసన తెలుపుకోవచ్చు. కానీ సభ జరగనియ్యమంటె! ముందుగా ఎజెండా అనుకున్నం. అది జరిగేలా ప్రజాస్వామికంగా నడిపించుకుంటం.

రాష్ర్టాన్ని కాంగ్రెస్, టీడీపీలు పాలు పొంగేట్లు చేస్తే.. రైతులందరి ఇండ్లకు బంగారువాసాలు పెట్టి రైతులందరినీ కోటీశ్వరుల్ని చేస్తే మేం వచ్చి చెడగొట్టామా? ప్రతిపక్షాలు ఎదురు దాడి చేస్తున్నాయి. ఏం పొరపాటు జరిగింది? మూడు రకాల విధానాలతో ప్రయాణిస్తున్నాం. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నం. మమ్మల్ని గెంటేసిండ్రు అంటె! వాళ్లను గెంటివేయలేదు. వాళ్లే గెంటేయించుకున్నరు. చర్చల్లో వాళ్ల బండారం బయటపడుద్దని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వాళ్ల చేతగానితనం బయటపడతదని వాళ్లే గెంటేయించుకున్నరు.

దేశంలో ఎక్కడైనా ఎనిమిదిన్నర వేల కోట్లు (రుణమాఫీ) ఇచ్చిన ఘనత ఉందా? ప్రతిపక్షాలు అలవికాని కోరికలు పెట్టి అడ్డుపడ్డాయి. ఈ రోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారణంగా వీరి 58 ఏండ్ల పనికిరాని అసమర్థత, అవివేకమైన పాలనే కారణం. నేను అప్పీలు చేసినా (విపక్షాలు) వినిపించుకోలేదు. వినే బుద్ధిలేదు. ఇష్యూను పక్కదారి పట్టించాలని చూశారు. 30 ఏండ్లలో సభలో నేనున్న.. (స్పీకర్‌నుద్దేశించి) మీరున్నరు. ఎప్పుడు సమావేశాలు జరిగినా ఎండిన సజ్జ, జొన్న కంకులు, కందీళ్లు తెచ్చెటోళ్లు. బడ్జెట్ సమావేశాలొస్తె కరెంటు లొల్లి. ఆరు నెలల్లనె ఇంటర్నల్ ఎఫీషియెన్సీ పెంచుకున్నం. 370 మెగావాట్ల ఉత్పత్తి పెంచినం. ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న. రాబోయే రోజుల్లో ఇరిగేషన్‌లో విప్లవం రాబోతున్నది. ఆలస్యం జరిగినా సరే.. అర్థం చేసుకొని నిర్ణయం తీసుకుంటం.

ప్రతి నీటి బొట్టుగురించి చర్చిస్తున్నం ఇరిగేషన్ ప్రాజెక్టులంటే 15-19 ఏండ్లు కొనసాగకుండా త్వరితగతిన పూర్తిచేసేందుకు అహోరాత్రులు ఇరిగేషన్ మం త్రి, మేం కష్టపడుతున్నం. తెల్లవారుఝామున మూడు, మూడున్నర గంటల వరకు కూర్చుని సమీక్షలు చేస్తున్నం.. ప్రతీ అంగుళం, ప్రతీ బొట్టు వృథాగాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో అధికారులు, మేము మునిగిపోతున్నం. గతంలో తెలంగాణకు దగా జరిగింది. న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నం. తెలంగాణ అభివృద్ధిపై మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోయి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌తో లైడార్ సర్వే చేయిస్తున్నం.

త్వరలో ఆ వివరాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటం. సభలో వినే ఓపిక లేకుంటె ఎట్ల? ఘోరంగా మాట్లాడుతున్నరు. అందుకే నాకు బాధ కలుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏం చేస్తున్నం? ఏం చేయబోతున్నం అనే దానిపై ఎలక్ట్రానిక్ ప్రదర్శన ఇయ్యాలనుకున్నం. ఒక మహిళా సభ్యురాలు సీఎం సినిమా చూపెట్టాలనుకుంటున్నరు అని దుర్మార్గంగా మాట్లాడినరు. ఇది సినిమానా? ఏ ప్రాజెక్టులను ఎట్ల చేపట్టాలి? ఏ నది నుంచి ఎట్ల నీళ్లు తేవాలి? మన హక్కులేంది? రైతుల బాధలెట్ల తీర్చాలని ఆలోచన చేస్తున్నం. ఒక సీఎంగా, సభా నాయకుడిగా ప్రజలకు వాస్తవాల్ని చెప్పాలనుకున్న. కానీ ఇంత తేలిగ్గా మాట్లాడితె ఎట్ల? అది వారి సంస్కారానికే వదిలేస్తున్న.

మా పాలన ప్రజలే చూశారు 15నెలల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు చూసినరు. తెలంగాణకు ఏం కావాలో అది పకడ్బందీగ చేస్తం. నీళ్లు వంద శాతం తెస్తం. ప్రజలు ప్రతిపక్షాల మాటలతో గందరగోళానికి గురికావద్దు. వాస్తవంగ సభలనె ఎలక్ట్రానిక్ ప్రదర్శన ఇవ్వాలనుకున్న. కానీ అన్ని పక్షాలు లేకుండ ఇవ్వడం నాకు కూడా ఇష్టం లేదు. ఈనెల 15 లేదా 16 తేదీల్లో అఖిలపక్షం ఏర్పాటు చేసుకుందాం. అన్ని పార్టీల అధ్యక్షులు, ఫ్లోర్‌లీడర్లు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రజాసంఘాలను పిలిచి తెలంగాణ జల వ్యూహాన్ని చెప్తం.

సంక్షేమానికి వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమంకోసం వేల కోట్లు ఖర్చుచేశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.13,572 కోట్లు కేటాయిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.33,982 కోట్లు కేటాయించింది. ఈ సంఖ్య కాంగ్రెస్ కేటాయింపులతో పోలిస్తే రూ.20,410 కోట్లు ఎక్కువ. ఇదేదో నా స్వంత కవిత్వం కాదు. బడ్జెట్ లెక్కలు.

నిస్సందేహంగా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్. గత ప్రభుత్వాలు, పాలకులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నది. దళితులకోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.3605 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.8089 కోట్లు కేటాయించింది. ఎస్టీల విషయానికివస్తే 2013-14లో రూ.5144కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.5035 కోట్లు కేటాయించింది. మైనారిటీల సంక్షేమానికి 2013-14లో రూ.431 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1105 కోట్లు కేటాయించింది.

పేదలకు సబ్సిడీ బియ్యంకోసం అందించే పౌరసరఫరాలశాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4860 కోట్లు కేటాయిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.7380 కోట్లు కేటాయించాం. కార్మికశాఖకు చెందిన 10లక్షల మంది కార్మికులకోసం రూ.24 కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాం. పెన్షన్ల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 964 కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 3,943 కోట్లు కేటాయించింది. మహిళా శిశు సంక్షేమానికికూడా 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.432 కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం రూ.2037 కోట్లు కేటాయించింది. గృహ నిర్మాణానికి కూడా భారీ నిధులు కేటాయించాం.

గత ప్రభుత్వాలు ఇల్లు ఇరకటం, ఆలి మర్కటం అన్న చందంగా ఇండ్లు నిర్మించాయి. ఎంత భారమైనా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పాం. 60వేల డబుల్ ఇండ్ల నిర్మాణంకోసం ఈ ఆర్థికసంవత్సరంలో రూ.4057 కోట్లు కేటాయించాం. ప్రతీ నియోజకవర్గానికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మిస్తాం. సమస్యలు తీర్చండని శాసనసభవద్దకు వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర ఉంది. అంగన్‌వాడీల సమస్యలను తెలుసుకుని.. పక్కన కూర్చుండబెట్టుకుని కలిసి అన్నం తిని వారి సమస్యలు పరిష్కరించాను. ప్రభుత్వంమీద భారం పడ్డప్పటికీ అంగన్‌వాడీల గౌరవ వేతనాలు పెంచాం. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.4200 నుంచి రూ.7000కు, సహాయకులకు రూ.2200నుంచి రూ.4500కు పెంచాం. గర్భవతులకు పౌష్టికాహారం ఇస్తున్నాం.

ఆదాయ పరిమితి, రాయితీలు పెంచాం సంవత్సరాలు గడిచినా గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ప్రజల ఆదాయ పరిమితిని పట్టించుకోలేదు. దానిని సవరించాం. గ్రామస్థాయిలో పేదల ఆదాయ పరిమితిని రూ.60 వేలనుంచి రూ.1,50,000గా, పట్టణ ప్రాంతంలో రూ.75 వేలుగా ఉన్న ఆదాయాన్ని రూ.2లక్షలకు పెంచాం. అదేవిధంగా యూనిట్ కాస్ట్ పెంచాం. సబ్సిడీలు కనిష్ఠంగా రూ.80వేలనుంచి గరిష్ఠంగా రూ.2.5లక్షలకు పెంచాం. గతంలో ఇది లక్షకు రూ.30 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం లక్ష రూపాయల రుణం తీసుకుంటే రూ.80 వేలు, రూ.2లక్షలైతే రూ. 1,20,000, రూ.5లక్షల రుణానికి రూ.2.5 లక్షల సబ్సిడీ అందిస్తున్నాం. దీనివల్ల పేద నిరుద్యోగ యువకులు లబ్ధిపొందుతున్నారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఏసీబీ డీజీ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లింల సమస్యలపై కమిటీ వేశాం. రిపోర్టు వచ్చాక ముస్లిం, మైనారిటీలతో సమావేశం ఏర్పాటుచేస్తాం. టీఆర్‌ఎస్ సర్కారు మైనారిటీలను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను. మైనారిటీల పిల్లలకోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్నాం. వారంలో రిపోర్టు ఇస్తారు. నివేదిక చూసిన తర్వాత దీనిమీద ఆలోచిస్తాం.

ముస్లిం, మైనారిటీల పిల్లల స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఆలోచిస్తున్నాం. న్యాక్‌లో అవకాశం ఉంది. నా దృష్టిలో అటువంటి ఆలోచన ఉంది. కబ్రస్థాన్ (శ్మశానవాటిక)ల కోసం సర్కారీ జాగా కేటాయిస్తాం. జాగా లేకుంటే సేకరించయినా ఇస్తాం. ముస్లిం, మైనార్టీలకే కాదు. అన్ని వర్గాలవారి శ్మశానవాటికలకు భూములు కేటాయిస్తాం. అంతేకాదు వక్ఫ్‌బోర్డులో రిక్రూట్‌మెంట్ చేపడుతాం. దీనికోసం పోస్టులు మంజూరు చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు నిర్లక్ష్యానికి గురయ్యారు. 12శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుఉంటాం. ముస్లింలు ఆందోళన పడాల్సిందేమీ లేదు. విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని వినియోగించుకోవాలె. ఇప్పటివరకు 210 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సెక్రటరీతో మాట్లాడుతా.. అని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రాధాన్య అంశాలు ఎంచుకున్నాం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్య అంశాలను ఎంచుకుని పనులు చేపడ్తున్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేదలందరు కలిసి 85 శాతానికి పైగా ఉన్నారని ప్రభుత్వానికి తెలుసు. వీరిని అభివృద్ధి బాటలో నడిపించడానికి పటిష్టమైన వ్యూహం అమలు చేస్తున్నం. ఎన్నికల ప్రణాళికలో లేని, చెప్పని అంశాలను అమలు చేస్తున్నం. గతంలో ఎవరూ, ఎప్పుడూ ఊహించని విధంగా సంక్షేమంకోసం పథకాలు చేపట్టి, నిధులు ఖర్చు చేస్తున్నం.

సంక్షేమం అంటే రేషన్ కార్డులు, పింఛన్లు కాదు. అనేక అంశాలు కూడుకుని ఉంటాయి. గతంలో ఎవ్వరూ పట్టించుకోని వర్గాల సంక్షేమానికికూడా తెలంగాణ ప్రభుత్వం ప్రాముఖ్యం ఇచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద యువతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుని వారి వివాహాల కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలు తీసుకున్నం. హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు పురుగుల భోజనం తింటున్నారని పేపర్లో అనేకసార్లు చదివాం. అటువంటి పరిస్థితి తెలంగాణ విద్యార్థులకు వద్దనుకున్నాం. అన్నా.. నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను.

హాస్టల్ బాధలు నాకు కూడా తెలుసు అని ఈటల రాజేందర్ కూడా నాతో చెప్పిండు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. సన్నబియ్యంతో అన్నం పెడుతున్నం. ఈ పథకంతో 35 లక్షలమంది విద్యార్థులు లాభం పొందుతున్నారు. ఈ పథకాన్ని రాబోయే విద్యా సంవత్సరంనుంచి కాలేజీ విద్యార్థులకూ అందిస్తాం. రాష్ట్రం ఆర్థిక స్థితి, గతి అర్థం కావాలంటే మార్చినుంచి మార్చివరకు సమీక్షించాలి. గతంలో మధ్యలో వచ్చినం. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్, రాష్ట్రపతి పాలన, అధికారులు లేకపోవడం, ఒక్కో సెక్రటరీ 4 శాఖలు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత బడ్జెట్ 6 నెలలు గడిచింది. ట్రెండ్స్ బాగున్నయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 4లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. ఆదివాసీలు, గిరిజనులు, లంబాడీ తండాలపై గత పాలకులు పెత్తనం చెలాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే పంచాయతీ ఎన్నికలు తండాల్లో కాదు.. గ్రామ పంచాయతీల్లో జరగుతయి. అదేవిధంగా ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. శాశ్వత పరిష్కారాలు కనుక్కోవడం జరిగింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.