విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చొరవపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ఆవిష్కరణలను, ఆలోచనా విధానాన్ని, అనుసరిస్తున్న మార్గాలను స్వాగతించారు. ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైన ప్రపంచ పునరుత్పాదక ఇంధనరంగ పెట్టుబడిదారుల (రీ-ఇన్వెస్ట్) సదస్సులో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ చొరవను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

-కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలపై ప్రశంసల జల్లు -సంప్రదాయేతర వనరుల ఉపయోగానికి అవార్డ్ -ప్రధాని చేతుల మీదుగా అందుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి -పేదల జీవితాల్లో ఇక సౌర వెలుగులు -సంప్రదాయేతర విద్యుత్‌పై కేంద్రీకరిస్తాం -సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనపై దృష్టి -ఇంధన పొదుపు.. రాబోయే తరానికి ఉపయోగం -రీ-ఇన్వెస్ట్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ -ఐదేండ్లలో 266 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం -సాధించి తీరుతామన్న పలు కంపెనీలు 13వ ఆర్థికసంఘం నిధులతో చేపట్టిన కార్యక్రమాల అమలుతో విద్యుత్‌రంగాన్ని తీర్చిదిద్దడంలో తెలంగాణలోని పది జిల్లాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు. దేశంలో మెరుగైన ఫలితాలు సాధించిన 12 రాష్ర్టాల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఉండటం అభినందనీయమని అన్నారు. గతకొద్ది నెలలుగా సౌర విద్యుత్‌తోపాటు నూతన, సంప్రదాయేతర ఇంధన వనరులను అమలులోకి తెచ్చినందుకుగాను తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక అవార్డును అందించారు. ఈ అవార్డును రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రధాని చేతులమీదుగా అందుకున్నారు.
ఏప్రిల్ 2010 నుంచి మార్చి 2014 వరకు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల (న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) ఉత్పత్తిపై దృష్టి సారించడమే కాకుండా వినియోగంలోకి తీసుకువచ్చి ఉత్తమ ఫలితాలను సాధించినందుకు ఈ అవార్డుకు తెలంగాణను కేంద్రం ఎంపిక చేసింది. సుమారు 900 మెగావాట్ల మేర సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేసి రోజువారి అవసరాలకు వినియోగించింది. ఇదే ఒరవడిని ఇకపైన కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం దేశం మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ పేద ప్రజల జీవితాల్లో సౌరశక్తితో వెలుగులు నింపుతామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పరిశోధనలపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని తెలిపారు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సౌరశక్తిని అందించడానికి 50 దేశాలతో కూడిన బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. మూడురోజుల సదస్సులో భాగంగా తొలిరోజు సమావేశంలో ఎన్టీపీసీ, సుజ్లాన్, రిలయన్స్ పవర్ సంస్థలతోపాటు మొత్తం 293 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి (సౌర, పవన విద్యుత్)లో మెగావాట్ల స్థాయినుంచి గిగావాట్ల స్థాయికి భారత్ చేరుకున్నదని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.
విద్యుత్ లోటును అధిగమించేందుకు సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి తోడ్పాటునందిస్తామన్నారు. దేశంలోని ప్రతి ఇంటికి ఇంధన వనరులు చేరాలని, సగటు పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలని మోదీ ఆకాక్షించారు. తన కుటుంబంకోసం, తనకోసం తాను శ్రమిస్తున్న సామాన్యుడే తన మొదటి ప్రాధాన్యం అని ప్రధాని ప్రకటించారు. కేవలం జీవనాధారంకోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఇంధన వినియోగాన్ని పెద్ద మొత్తంలో పొదుపుచేస్తే.. భావితరాలకు మరింత ఉపయోగంగా ఉంటుందని ప్రధాని తెలిపారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ఇంధన ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఇప్పటివరకు థర్మల్, గ్యాస్, హైడ్రో, న్యూక్లియర్ పవర్‌లాంటి రంగాలపైనే దృష్టిపెట్టామని, ఇకపై సోలార్, విండ్, బయోగ్యాస్ రంగాలపైకి దృష్టి మరలించాల్సిన అవశ్యకత ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. వీటిని ఇంధన రంగంలో సప్త అశ్వాలుగా అభివర్ణించారు. విద్యుత్ సరఫరా, తరలింపునకు మౌలికంగా అయ్యే ఖర్చును తగ్గించేందుకు హైబ్రీడ్ ఎనర్జీ పార్కులను ఏర్పాటు చేస్తామని మోదీ చెప్పారు. సోలార్ ఫొటో-వోల్టాయిక్ సెల్స్ విధానం ద్వారా యూనిట్ విద్యుత్ ధర రూ.20 నుంచి 7.50 రూపాయలకు దిగివచ్చిందని ప్రధాని తెలిపారు.
ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల పరికరాల తయారీకి దేశీయంగా కొత్త కంపెనీలను ప్రారంభిస్తామని, సాంకేతిక పరిశోధనల్ని చేపడుతామని స్పష్టంచేశారు. వ్యవసాయానికి ఉపయోగించే నీటి పంపులకోసం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని, ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. నివాసాల పైకప్పులపై సోలార్ ఫొటో-వోల్టాయిక్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దేశంలో బొగ్గు ఆధారంగా 60 శాతం విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నాం. థర్మల్ ఉత్పత్తి ద్వారా వెలువడే ఉద్గారాలు దేశంలోని పేద ప్రజల జీవనానికి ముప్పుగా మారుతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి అని చెప్పారు. ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి కాకుండా పేద ప్రజల అవసరాలను తీర్చే లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గించుకోకపోతే పర్యావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను ప్రపంచదేశాలు దీటుగా ఎదుర్కొనే అవకాశమే ఉండదని ఇటీవల భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారని ప్రధాని ప్రస్తావించారు. వచ్చే ఐదేండ్లలో 266 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తిని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సదస్సులో పాల్గొన్న పలు కంపెనీలు ప్రకటించాయి. 15 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తికి ఆర్థికసాయం అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ర్టాలకు అవార్డులు లభించాయి.
ఇంధన ఉత్పత్తికి రాజధానిగా భారత్: ప్రపంచ పునరుత్పాదక ఇంధన ఉత్పతిలో భారత్ రాజధానిగా ఎదుగుతున్నదని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రంగంలో 200 బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ వాటా 6 శాతం ఉందని, రానున్న దశాబ్దకాలంలో వాటాను 15 శాతానికి పెంచుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రంగంలో పరికరాలు ఉత్పత్తికి, సాంకేతిక పరిశోధనలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధాని అభినందనపై సీఎం కేసీఆర్ హర్షం విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించడంపై సీఎం కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని ప్రశంస తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు.
వచ్చే రెండేండ్లలో మిగులు సాధిస్తాం – నమస్తే తెలంగాణతో జగదీశ్‌రెడ్డి రానున్న రెండేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో మెరుగైన ఫలితాలను సాధించినందుకు ఉత్తమ అవార్డు అందుకున్న తర్వాత ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉందని, పరిమిత సహజ వనరులు తగ్గిపోవడమే కాకుండా పర్యావరణ పరంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రపంచ దేశాలన్నీ కూడా సంప్రదాయేతర ఇంధనంపై దృష్టి సారించాయని అన్నారు.
పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాలో 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మరో 1500 మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టిందని, త్వరలోనే టెండర్లను కూడా పిలుస్తామని తెలిపారు. పరిమితంగా ఉండే ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవడంతోపాటు అపరిమితంగా, సుదీర్ఘకాలం అందుబాటులో ఉండే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, వినియోగంపై కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్‌ను గృహ అవసరాలకు వాడుకునే విధానాన్ని కూడా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. సౌర, బయోమాస్ విద్యుత్‌పై ప్రభుత్వం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కూడా కల్పించనున్నదని పేర్కొన్నారు. గృహ వినియోగదారులు సౌర విద్యుత్ వాడకానికి ముందుకొస్తే ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు.
సౌర విద్యుత్‌ను కూడా ఇతర రాష్ర్టాల నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.6.45లకు కొనుగోలు చేయడంపై ప్రభు త్వం దృష్టి పెట్టిందని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. కొద్దికాలం క్రితంవరకు రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నదని, ప్రస్తుతం ఆ కొరతను అధిగమించామని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రత్యామ్నాయాల చర్యల వల్ల విద్యుత్ కొరతను గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నందున వచ్చే వేసవిలో పెద్దగా విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉండదన్నారు. రెండేండ్ల తర్వాత మిగులు విద్యుత్ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
మణుగూరు, భూపాలపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు నల్లగొండ జిల్లా దామరచర్లలోని థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ఉత్పత్తి ప్రారంభించినట్లయితే విద్యుత్ కొరతకు ఆస్కారమే ఉండదన్నారు. ఇప్పటికే పలురంగాల్లో ఉత్తమ అవార్డులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగంలో కూడా ఉత్తమ అవార్డు పొందినందుకు ఆనందం వ్యక్తంచేశారు. ఈ అవార్డు స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణలో సంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని అన్నారు. ఆదివారం కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌తో మర్యాదపూర్వకంగా జగదీశ్‌రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం కూడా మరోమారు భేటీ కానున్నారు. తూర్పు గ్రిడ్‌నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులో ఉన్న ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారానే సరఫరా చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే విజ్ఞప్తిచేశారు. ఈ అంశంపై సోమవారం భేటీలో కేంద్రమంత్రితో చర్చించే అవకాశముంది. రానున్న వేసవిలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ భేటీలో ఆయనకు మంత్రి వివరించే అవకాశం ఉంది.