– మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం: మంత్రి ఈటెల – విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం: ఎంపీ వినోద్‌కుమార్
రాష్ట్రంలో కరెంటు కోతలను 2017 వరకు అధిగమిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించనున్నట్లు చెప్పారు. 21వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మూడేండ్లలో దేశంలోనే మిగులు విద్యుత్‌ను సాధిస్తామన్నారు. రాష్ట్రంలో 7,985 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, 13 వందల మెగావాట్ల విద్యుత్ కోనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ మన బొగ్గు, నీళ్లు తరలించుకుపోయి ఆంధ్రాప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, అక్కడ ఉత్పత్తయిన విద్యుత్‌నే ఇప్పు డు తెలంగాణకు విక్రయిస్తున్నారని చెప్పారు.
కృష్ణా జలాలను కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి బొగ్గును కడప జిల్లాలోని సింహాద్రి విద్యుత్‌ప్లాంట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలంటే మరిన్ని విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్‌ప్లాంట్లను నెలకొల్పేందుకు జపాన్, కొరియా దేశాలతోపాటు కేంద్ర ప్రభు త్వం నుంచి నిధులు తెచ్చేందుకు ఎంపీలు కృషి చేస్తున్నట్లు చెప్పా రు. 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను రామగుండంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.