-నేటి విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి -విద్యార్థులకు స్టీవ్‌జాబ్స్ ఆదర్శం -కేసీఆర్‌లో ఉత్తమ నాయకత్వ లక్షణాలు: మంత్రి కేటీఆర్ -హార్వర్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ఇండియా 2014లో ప్రసంగం

విద్యార్థులు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన హార్వర్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ ఇండియా 2014 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఒకప్పటి విద్యాభ్యాసానికి నేటికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏ ఫర్ యాపిల్ అంటే ఒక పండు మాత్రమే స్ఫురించేది. ఇప్పుడు యాపిల్ అంటే ఐఫోన్లు, ఐపాడ్లు గుర్తుకొస్తున్నాయి అని చెప్పారు. నాయకత్వ లక్షణాలు అలవడాలంటే విద్యార్థులు తాము నమ్మిన వాటిని ఆచరించాలని, ఇతరుల అభిప్రాయాలు, వాటి ప్రభావం తమ మీద పడకుండా చూసుకోవాలన్నారు. లక్ష్యసాధన దిశగా ఎదగాలనుకునే ప్రతి విద్యార్థికి స్టీవ్ జాబ్స్ ఆదర్శమని పేర్కొన్నారు. తన తండ్రి కేసీఆర్ ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, విమర్శలు చేసినా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ 14 ఏండ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్నారని, 29వ రాష్ట్రంగా తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులంతా ఇలాంటి సదస్సులో పాల్గొనడం అభినందనీయమన్నారు. దీనివల్ల వివిధ దేశాల గురించేకాక, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల పనితీరు, విధివిధానాల గురించి తెలుస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఈ సదస్సును నిర్వహించినందుకు హార్వర్డ్ స్కూల్ యాజమాన్యాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. దీనిద్వారా ప్రపంచదేశాల విద్యార్థులకు భారత రాజకీయాలతోపాటు హైదరాబాద్ ఖ్యాతి గురించి తెలుస్తుందని చెప్పారు. ఈ సదస్సులో ప్రముఖ నృత్యకారిణి కిరణ్మయి చేసిన భరతనాట్యం అందరినీ అలరించింది. కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ మిచెల్ ములిన్స్, ఫౌండేషన్ ఫర్ లిబరల్ అధ్యక్షురాలు ఇందిరా పరేఖ్, నేషనల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ బిందు హరి, సదస్సు నిర్వాహకులు హిమాన్షు చరణ్, శృతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 14 దేశాల్లోని 130 పాఠశాలలకు చెందిన 1250 మంది విద్యార్థులతోపాటు 150 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. మరో మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.