Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

విద్యుత్తు చట్టం ఎవరికి చుట్టం?

విద్యుత్తు బల్బ్‌ను చౌకగా తయారు చేసిన థామస్‌ అల్వా ఎడిసన్‌ ఆదర్శాన్ని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ప్రజలను మళ్లీ గుడ్డి దీపాల వెలుగుల్లో బతికేలా చేసేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ రంగంలోని డిస్కమ్‌లను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా విద్యుత్తు చట్టం-2003కు కేంద్రం సవరణలు చేస్తున్నది. రైతులు, పేదలకు అందుతున్న ఉచిత, రాయితీ విద్యుత్తును దూరం చేయాలని చూస్తోంది. నియంతృత్వ ధోరణితో కేంద్రం తీసుకురావాలనుకుంటున్న ఈ సవరణలను దేశ ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.

బిల్లు (క్లాజ్‌ 5) ప్రకారం రెడీమేడ్‌గా ఉన్న డిస్కమ్‌ల నెట్‌వర్క్‌ ఉపయోగించుకుని ఎంపిక చేసిన ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులను విద్యుత్‌ సరఫరా చేయడానికి అనుమతించడం ఆశ్చర్యంగా ఉంది. నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి స్థాపించిన డిస్కమ్‌ల నెట్‌వర్క్‌ను ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు ఉచితంగా ఉపయోగించుకుంటాయి. పైగా అదే ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్‌లతో ఆ సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు రైతులు, పేదలకు కాకుండా పట్టణ, పారిశ్రామిక ప్రాంతాలకు విద్యుత్‌ పంపిణీ చేయడానికే ఇష్టపడతాయి. మరి పేదలకు, రైతులకు విద్యుత్తు సరఫరా చేసేదెవరు?

ఈ బిల్లును ఆమోదించినట్లయితే ప్రస్తుతం ముంబైలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న విధంగా యూనిట్‌కు రూ.12-14 వరకు విద్యుత్తును సరఫరా చేసే పరిస్థితులు వస్తాయి. విద్యుత్‌ సరఫరా చేసే సంస్థను ఎంచుకునే అవకాశం వినియోగదారునికి లభిస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకే సరఫరా వ్యవస్థలు పోతాయి.

బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్‌ మీటర్లను తగులబెట్టారు. యూపీ సహా దేశంలోని అనేక చోట్ల ఇదే జరిగింది. ఈ పరిణామాలను పరిశీలించి చట్ట సవరణ చేయాల్సిన కేంద్రం, రైతాంగానికి భయపడి అతి తెలివిగా, దొంగచాటుగా ఈ బిల్లును తీసుకొచ్చింది.

భారత దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా రాజ్యాంగంలో పేర్కొన్నారు. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు కలిగినప్పటికీ ప్రజలంతా కలిసి మెలిసి జీవిస్తుండటం వల్ల సమాఖ్య భావన ఇప్పటికీ దేశంలో వర్ధిల్లుతోంది. దేశంలోని ఈ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలపై ఆయా ప్రభుత్వాలకు అధికారమిచ్చి, ఉమ్మడి జాబితాలో కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలను కల్పించింది. అయితే కేంద్రం మాత్రం ఉమ్మడి జాబితాలోనే కాదు, రాష్ట్ర జాబితాలోనూ వేలు పెట్టి రాష్ర్టాల అధికారాలను కాలరాస్తూ, గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నది. రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, రాష్ర్టాల అభిప్రాయాలు పట్టించుకోకుండా చట్టాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లు ఒకటి. ఇందులో అనేక లోపాలు ఉన్నాయి.

1.వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించడానికి దోహదం చేస్తుంది.

2.పేదలు, రైతులకు రాయితీతో అందించే విద్యుత్తు పరిమాణాన్ని తగ్గిస్తుంది.

3.ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్‌ల ద్వారా విద్యుత్తు సరఫరా చేయడానికి ప్రైవేట్‌ వ్యక్తులను అనుమతిస్తుంది.

4.ప్రైవేట్‌ పంపిణీ సంస్థలకు సార్వత్రిక విద్యుత్‌ సరఫరా బాధ్యత ఉండదు. ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కములపైనే ఈ బాధ్యత ఉంటుంది.

5. మీటర్లు బిగిస్త్తేనే రాష్ట్రాలు 0.5% అదనంగా ఆదాయం పొందేందుకు అనుమతిస్తామని షరతు విధించడం.

6.ఈ బిల్లు చట్టంగా మారితే ప్రభుత్వ విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటం.

విద్యుత్తు చట్టం-2003కు చేస్తున్న ఈ సవరణలు సమగ్రమైనవని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి చెబుతున్నారు. కానీ వాస్తవానికి అవి అన్యాయంగా ఉన్నాయి. దీని గురించి మీకు ఒక ఉదాహరణ చెబుతాను. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న కేంద్రం ప్రతిపాదన గురించి ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. మీటర్‌ లేకుండా ఎలాంటి కనెక్షన్‌ ఇవ్వకూడదని, అలాంటి మీటర్‌ స్మార్ట్‌ ప్రీ -పెయిడ్‌ మీటర్‌ అని సవరణలు చెబుతున్నాయి. అంటే, ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్‌ బిగించకుండా విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వకూడదని అర్థం. ఇవ్వాళ తెలంగాణ సహా, దేశంలోని అనేక రాష్ట్రాలు రైతుల పెట్టుబడుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాయి. ఇది తప్పా? కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం దురుద్దేశంతో మీటర్లను బిగించి రైతులు, నిరు పేదల నుండి విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటోంది. తెలంగాణపై కక్ష గట్టిన కేంద్రం అనేక అభ్యర్థనలు, అభ్యంతరాలను కాదని 2014లో సీలేరు జల విద్యుత్‌ ప్రాజెక్టును ఏపీకి ఇచ్చింది.

బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్‌ మీటర్లను తగులబెట్టారు. యూపీ సహా దేశంలోని అనేక చోట్ల ఇదే జరిగింది. ఈ పరిణామాలను పరిశీలించి చట్ట సవరణ చేయాల్సిన కేంద్రం, రైతాంగానికి భయపడి అతి తెలివిగా, దొంగచాటుగా ఈ బిల్లును తీసుకొచ్చింది. విద్యుత్‌ (వినియోగదారుల హక్కులు) నియమాలు, 2020 ప్రకారం ఆహార భద్రతకు వెన్నెముకగా ఉన్న రైతులకు ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్‌ అవసరం లేదని చెబుతోంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు కేవలం రూ.1.2 లక్షల కోట్ల మేర ఉచిత విద్యుత్‌ను అందించడం పెద్ద ఔదార్యం అనిపించుకుంటుందా? వ్యవసాయాధారిత దేశంలో రైతులకు, పేదలకు ఈ మాత్రం మినహాయింపుని కూడా నిరాకరించడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? అందుకే తెలంగాణ సహా, అనేక రాష్ర్టాలు రైతుల ప్రయోజనాల కోసం ఈ విషయంలో రాజీ పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాయి.

దేశంలో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 4,04,178 మెగావాట్లు. ఇందులో రెండు రకాలున్నాయి. బేస్‌ లోడ్‌ అంటే దృఢమైన శక్తి (అంతరాయం లేని శక్తి). మరొకటి వేరియబుల్‌ పవర్‌. బేస్‌ లోడ్‌ 2,42,890 మెగావాట్లు మరియు అత్యధిక పీక్‌ లోడ్‌ 2,10,793 మెగావాట్లుగా జూన్‌, 2022లో నమోదైంది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు దేశం ఒక రోజులో ఉపయోగించిన గరిష్ఠ విద్యుత్తు. ఇది బేస్‌ లోడ్‌ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి, మనకు 1.6 లక్షల మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉంది. ఇంకా ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉంది. మనకు ఇంత మిగులు ఉన్నప్పుడు రైతులు, చిన్నపాటి దుకాణదారులు మొదలైన వారికి విద్యుత్తును ఉచితంగా లేదా రాయితీ ధరకు ఇవ్వడంలో తప్పేమిటి? అతి చిన్న వయసు ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలు సంక్షేమ, అభివృద్ధి పథంలో సాగుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డు పడుతోంది?

బిల్లు (క్లాజ్‌ 5) ప్రకారం రెడీమేడ్‌గా ఉన్న డిస్కమ్‌ల నెట్‌వర్క్‌ ఉపయోగించుకుని ఎంపిక చేసిన ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులను విద్యుత్‌ సరఫరా చేయడానికి అనుమతించడం ఆశ్చర్యంగా ఉంది. విద్యుత్‌ సరఫరా, ఛార్జీల విషయంలో ఎలాంటి నియంత్రణ, అజమాయిషీ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌లకు లేకపోవడం అభ్యంతరకరం. నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి స్థాపించిన డిస్కమ్‌ల నెట్వర్క్‌ను ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు ఉచితంగా ఉపయోగించుకుంటాయి. పైగా అదే ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్‌లతో ఆ సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు రైతులు, పేదలకు కాకుండా పట్టణ, పారిశ్రామిక ప్రాంతాలకు విద్యుత్‌ పంపిణీ చేయడానికే ఇష్టపడతాయి. మరి పేదలకు, రైతులకు విద్యుత్తు సరఫరా చేసేదెవరు?

వాస్తవానికి ప్రభుత్వ సంస్థలకు సార్వత్రిక విద్యుత్‌ సరఫరా బాధ్యత ఉంటుందని బిల్లులో ఒక నిబంధన ఉంది. అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిస్కమ్‌లు మాత్రమే అన్ని వర్గాల వినియోగదారులకు విద్యుత్తును అందిస్తాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో తప్పనిసరిగా, బలవంతంగా ప్రభుత్వ డిస్కమ్‌లే విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లును ఆమోదించినట్లయితే ప్రస్తుతం ముంబైలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న విధంగా అత్యధిక ధరలకు (యూనిట్‌కు రూ.12-14 వరకు) విద్యుత్తును సరఫరా చేసే పరిస్థితులు వస్తాయి. విద్యుత్‌ సరఫరా చేసే సంస్థను ఎంచుకునే అవకాశం వినియోగదారునికి లభిస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకే సరఫరా వ్యవస్థలు పోతాయి.

విద్యుత్‌ బిల్లులో పునరుత్పాదక ఇంధన బాధ్యత గురించి కొన్ని నిబంధనలు (23, 29) ఉన్నాయి. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సంభావ్యతలో ప్రతి రాష్ట్ర సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది. కానీ, కేంద్రం రాష్ర్టాలకు ఏకరీతి పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యతను విధిస్తోంది! ’అందరికీ ఒకే పరిమాణం’ ఎలా పని చేస్తుంది? తెలంగాణ దీనిని అనుసరిస్తే, పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యత మొత్తం వినియోగంలో 8.5% నుండి 21%కి పెరుగుతుంది, దీనివల్ల వినియోగదారులపై భారం పడి, టీఎస్‌జెన్‌కో ఉత్పత్తిని తగ్గిస్తుంది! ఇక 10% దిగుమతి చేసుకున్న బొగ్గును దేశీయ బొగ్గుతో కలపడం తప్పనిసరి. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి 350 బిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ. తెలంగాణలో దాదాపు 9,000 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కాబట్టి చౌకగా లభించే బొగ్గు నిల్వలను తవ్వుకోవడమా లేదా తప్పనిసరి బొగ్గు దిగుమతుల కోసం వెళ్లడమా అనేది ఆలోచించుకోవాలి. దేశీయ బొగ్గుకు 10% దిగుమతి చేసుకున్న బొగ్గును జోడిస్తే, విద్యుత్‌ ధర యూనిట్‌కు 60-70 పైసలు పెరుగుతుంది! దీన్ని ఎవరు చెల్లిస్తారు? ప్రధాని మోదీ లేదా కేంద్ర విద్యుత్తు మంత్రి చెల్లిస్తారా?

బిల్లు ఏదైనా ముందుగా సమాచారమిచ్చి, సంప్రదింపులు, చర్చకు ఆస్కారమిచ్చి మెరుగైన చట్టాన్ని తేవడానికి ప్రయత్నించాలి. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువలా వచ్చింది. చివరకు వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. విద్యుత్‌ చట్టం-2003ని సవరించాలనుకోవడం కూడా ఇలాంటి ఫలితాలనే ఇవ్వవచ్చు. ఎలాంటి చర్చకు ఆస్కారం లేకుండా జాతీయ ప్రయోజనాల సాకుతో ఏదైనా చేయచ్చనుకోవడం కేంద్రం అహంకారానికి నిదర్శనం. రాష్ట్రాల అధికారాలను లాక్కోవడం అవివేకం. కేంద్రం నిరంకుశ వైఖరిని మానుకోవాలి. ప్రజాస్వామ్య సమాఖ్య చెట్టుకు ఇప్పుడు ఫ్యూడల్‌ పూలు పూస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశానికి ఇది మంచిది కాదు.

కేంద్రం, రాష్ట్రం వేరు కాదు. అభివృద్ధి బీజాలు కింది నుంచే పడాలి. రాష్ట్రాల అభివృద్ధికి భూమికలు కావాలి. కేంద్రం రాష్ట్రం కలిసి కట్టుగా గ్రోత్‌ ఇంజిన్లలా పని చేయాలి. ఉమ్మడి కృషి సమాఖ్యకు బలం. పరస్పర సహకారంతోనే ఈ సమాఖ్య స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుంది. భారత ప్రభుత్వం ఇప్పుడు చేయవలసిందల్లా రాష్ర్టాలు, భాగస్వామ్యపక్షాలు, నిపుణులను విశ్వాసంలోకి తీసుకోవడం, బిల్లును పార్లమెంటులో చర్చించడం. ఆ తర్వాత అందరి ఆమోదంతోనే చట్టం చేయడం. కేంద్రం ఈ పని చేయకపోతే విద్యుత్తు రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతాయి. కేంద్రం మొండిగా ముందుకువెళ్తే దేశ ప్రజలు, ప్రభుత్వ విద్యుత్‌ రంగంలోని ఉద్యోగులు వ్యతిరేకించాలి.

-(వ్యాసకర్త: చేవెళ్ల ఎంపీ)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.