Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

విచక్షణతో ఓటేయండి

-ప్రజలు గెలిచే రాజకీయంతోనే మేలు
-ఎవరి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో ఊళ్లకు వెళ్లిన తర్వాత చర్చ చేయాలి
-పోడు సమస్యకు ఆరునెలల్లో పరిష్కారం
-రాష్ట్రంలో 3,500 గ్రామాల్లో గిరిజనులదే అధికారం
-ఖానాపూర్ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-అమరావతి, ఢిల్లీకి గులాంలు కావద్దని పిలుపు

ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది చాలా చెప్తరు. టీఆర్‌ఎస్ వాళ్లు కూడ చెప్తరు. మీరు ఇక్కడ విని ఇక్కడే విడిచి పెట్టవద్దు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ఈ రాష్ట్రం బాగుపడాలన్న తపనతోనే ఈ మాట మనవి చేస్తున్నను. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలువడం ఇంపార్టెంట్ కాదు. ప్రజలు గెలువాలి. ప్రజలు గెలిచే రాజకీయం వస్తేనే ప్రజలు బాగుపడతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎలక్షన్ అనగనే ఒక ఫ్యాషన్ మోపుజేసిండ్రు. దేశం మొత్తంమీద నోట్ల కట్టలు దించాలి.. మందుగుండు సామగ్రి లారీలకొద్దీ దించాలి, పంచాలి! ఒక్కొక్కరు మందుతాగి ఓటుకే రారు! అటువంటి దుర్మార్గమైన పద్ధతులు తెచ్చారు. మీరు ఊర్లకుపోయిన తరువాత కేసీఆర్ ఇట్ల అన్నడు.. నిజమా అబద్ధమా అని చర్చ చేయాలి. ఆ చర్చ సారాంశంగా.. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరిని గెలిపిస్తే కరెక్టో వారినే గెలిపించాలి అని కోరారు. గురువారం ఖానాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

ఇద్దరు పెట్టిన పెండ కడగాలి..
14 ఏండ్లు ఉద్యమాలు చేసి, నేను చావు నోట్ల తలకాయపెట్టి రాష్ట్రం తెచ్చుకున్నం. 58 ఏండ్లు ఇద్దరు పెట్టిన పెండ కడగాలి కదా! ఒక్క రోజుతో అయితదా? వేరుబడ్డ సంసారం ఎట్ల ఉంటది? కొత్త కుండల ఈగ సొచ్చినట్లు.. ఒక్కొక్కటి చేసుకుంట వస్తున్నం. కడెం పూర్తిస్థాయి ఆయకట్టు కింద రెండు పంటలు పండించడానికి కుఫ్టి ప్రాజెక్టు కడుతున్నం. సదర్మాట్ డెవలప్‌చేస్తున్నం. 58 ఏండ్లలో ఎవ్వరు ముట్టలే. ఇప్పుడు వాడొకడు వీడొకడు వచ్చి మేం బాగా చేస్తం.. బాగా ముడుతం అంటున్నరు. 58 ఏండ్లలో సదర్‌మట్‌ను కనీసం గెలికిర్రా? తట్టెడు మన్ను పోసిర్రా? సదర్‌మట్‌ను రూ.500 కోట్లతో బ్రహ్మాండంగా చేస్తున్నం. డైరెక్ట్ కాల్వ ఖానాపూర్‌కు తెచ్చే బాధ్యత నాది.

చంద్రబాబును భుజాల మీద ఎత్తుకొస్తున్నరు..
కొత్తగా వచ్చిన రాష్ట్రం.. పొదరిల్లు అల్లుకుంటున్నం. ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ తెలంగాణను నిలబెట్టడానికి ముందుకుపోతున్నం. కాంగ్రెస్ నాయకులకు శాతకాదట బక్కపేద కేసీఆర్‌ను కొట్టడానికి! ఆంధ్రకుపోయి చంద్రబాబును భూజాల మీద ఎత్తుకవస్తున్నరు. మళ్లా తెలంగాణ మీద చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా? రేపు చంద్రబాబుకు తెలంగాణ మీద పెత్తనం వస్తే దరఖాస్తులు పట్టుకొని మనం విజయవాడకు పోవాలి. ఆ గతి కావాల్నా? కొందరు అమరావతి బానిసలు. చంద్రబాబుకు గులాంలు! మిగిలినవాళ్లు ఢిల్లీలో గులాంలు! ఈ గులాం పాలన మనకు కావాల్నా?

ఏపీలో 24 గంటల కరంటు లేదు..
ఉమ్మడి రాష్ట్రంలో కాలిపోయే కరంటు మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు! కరంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే ఎరుక! ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటి అయితది.. పరిశ్రమలన్నీ తరలిపోతాయని ఇష్టంవచ్చిన కథ చెప్పిండు. ఏమైంది మరి? పెద్దపెద్ద మాటలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల కరంటు లేదు. ఈ రోజు దేశం మొత్తంలో రైతాంగానికి రెప్పపాటు కూడ కరంటు పోకుండా ఉచితంగా ఇచ్చే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ. ఒక్కమాట ఖాయంగా చెప్తున్న.. తప్పిపోయి గిట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ల వస్తే, గ్యారంటీగా కరంటు కిందమీద అయితది.

నీటి తీరువా రద్దుచేశాం
నీటి తీరువా రద్దుచేశాం. గీత కార్మికులకు చెట్ల మీద పన్ను రద్దుచేశాం. మంగలిషాపులవారు పాపం గడ్డాలు గీసుకొని బతుకుతరు. మాకు కమర్షియల్ చార్జీ వేస్తున్నరు. మాకు అంత ఆదాయం లేదు. దయచేసి డొమెస్టిక్ చార్జీ వేయండి.. అని అరవైఏండ్లు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను బతిమలాడిండ్రు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ వచ్చినంకనే పట్టించుకున్నం.

3,444 మందికి రైతుబీమా అందింది
రైతుబీమా బ్రహ్మాండంగా అమలవుతున్నది. రైతుబంధు, రైతుబీమా వస్తయని కలగన్నమా? ఇప్పటివరకు 3,444 మందికి ఈ పథకం కింద రూ.5 లక్షలు చొప్పున ఇచ్చినం. అందులో 90% చిన్న, సన్నకారు రైతులే. గతంలో ఎవడన్న రైతుల గురించి పట్టించుకున్నడా? ఇంక కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్నది. రైతులకు గిట్టుబాటు ధర రావటానికి, కల్తీ లేని సరుకులు ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేస్తం.

రెండు లక్షల రుణమాఫీ వట్టి డంబాచారం
కొంతమంది వచ్చి రెండు లక్షలు మాఫీ చేస్తమని అంటున్నరు. రెండు లక్షలోల్లు ఉన్నరా అసలు! వట్టి డంబాచారం! రెండు లక్షల లోపు రుణాలున్న వారు రెండు, మూడు శాతం.. చాలా డబ్బున్న రైతులుంటరు. వాళ్లకు అవసరం లేదు. మనం గతంలో లక్ష రుణమాఫీ చేసినం. ఇప్పుడు కూడ మరో లక్ష రుణమాఫీ చేస్తం. పీసీ భూములు.. గీసీ భూములు అని కథలు

అటవీభూముల గురించి ఇవ్వాల కాంగ్రెస్ జోరుగ మాట్లాడుతున్నది. 40 ఏండ్లు కాంగ్రెస్, 18 ఏండ్లు టీడీపీనేగద రాజ్యమేలింది? ఎందుకివ్వలేదు? ఇప్పుడు పీసీ భూములు, గీపీ భూములని కథలు చెప్తున్నరు. గతంలో ఈ సిపాయిలు ఎందుకు తోవ చూపించలే? 58 ఏం డ్లలో వాళ్లు చేయలేదు. ఇప్పుడొచ్చి డంబాచారం చెప్తున్నరు. మళ్ల వస్తే కిరీటం పెడుతమంటున్నరు. కిరీటం పెట్టరు.. మన్ను పెట్టరు. ఆయి ంత కింద పడగొడ్తరు. వాళ్లకు తెలివిలేదు.. నేను గ్యారంటీగా చెప్తున్న.

చంద్రబాబు అంటేనే పెద్ద పంచాయితీ
ఇది మంచి అటవీ ప్రాంతం. మంచిగా నీళ్లు ఉన్నయి. గోదావరిలో మన హక్కులున్నయి. రాష్ట్రం వచ్చిన తరువాత చాలా సమస్యలు! ఆంధ్రోల్ల పంచాయితీ! చంద్రబాబు చిన్న మనిషా? పెద్ద పంచాయితీ! కోర్టు విభజన కానియ్యడు. ప్రాజెక్టులు కట్టనియ్యడు. నరేంద్రమోదీ కూడా ఏడాదిపాటు మనకు కిలాఫే ఉండే. మన ఏడు మండలాలు గుంజి ఆంధ్రకు ఇచ్చేసిండు. కేంద్రం, ఆంధ్ర ప్రభుత్వం నానా బాధలు పెట్టాయి. వాటన్నంటినీ తట్టుకొని, ఎదుర్కొని, మన ఆర్థిక పరిస్థితి తెలుసుకొని, అధికారులను నియమించుకొని ముందుకుపోతున్నం.

ఒకరోజు రాష్ట్ర అధికారులంతా నియోజకవర్గాల్లో
ఎన్నికలయ్యాక ఒక్కొక్కరోజు ఒక్కో నియోజకవర్గానికి సీనియర్ అధికారులను తెచ్చి, ఏమేం అవసరం ఉన్నది? భూమి ఎంత ఉన్నది? ఎంత అడవి ఉన్నది? నీళ్లు ఎంత ఉన్నయి? ఎక్కడి నుంచి రావాలి? అన్నీ పరిశీలించి.. మొత్తం ఇక్కడే పరిష్కారమయ్యేలా చూస్తం. ఏజెన్సీలో గిరిజనేతరుల భూములున్నయి. వారికీ రైతుబంధు రావాలి. ఖమ్మం, ములుగు, నిజామాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఉంది. మేం ఏ రోటికాడ ఆ పాట పాడి జనాల్ని గోల్‌మాల్‌చేసే రకంకాదు. సమస్య అంతటా తీరాలి. సంక్షేమం అందరికీ జరుగుతది. రేఖానాయక్ చదువుకున్న, పట్టుదల ఉన్న వ్యక్తి. సిన్సియర్‌గా పనిచేస్తరు. దీవించండి.. కారు గుర్తుకు ఓటువేయండి. మీ సమస్యల పరిష్కారానికి నాది బాధ్యత. టీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. మంచి భవిష్యత్ ఉంటది.

గెలిపిస్తే గట్టిగ పనిచేస్తం
టీఆర్‌ఎస్ ఓడిపోయిందనుకో నాకువచ్చే నష్టం పెద్దగలేదు. గెలిపిస్తే గట్టిగ పనిచేస్తం. లేకపోతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాం. ఎద్దో వ్యవసాయమో చేసుకుంటాం. నష్టపోయేది తెలంగాణ.. ప్రజలు. చంద్రబాబు ఇప్పటికే మన ప్రాజెక్టులను ఆపాలంటూ 35 ఉత్తరాలు రాసిండు. ఆయన చేతులకు అధికారం పోనిస్తే ప్రాజెక్టులు కట్టనిస్తడా? ఆయన మనసు ఆంధ్రకు గుంజుతదా? తెలంగాణకు గుంజుతదా?

కలిపిందే కాంగ్రెస్ కదా
ఒకనాడు నిజాంనుంచి విముక్తి అయి హైదరాబాద్ రాష్ట్రంగా మిగులు బడ్జెట్‌తో ఉన్నం. ఆనాడు అన్యాయంగా.. తెలంగాణ ప్రజలు మొత్తుకుంటుండగా.. సిటీకాలేజీలో ఏడుగురు విద్యార్థులను కాల్చేసి.. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే ఈ కాంగ్రెస్‌పార్టీ. తెలంగాణ ఇవ్వాలని అడిగితే 1969లో 400 మందిని కాల్చిచంపింది సీఎం బ్రహ్మానందరెడ్డి.. ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? 2004లో తెలంగాణ పేరు చెప్పి కాంగ్రెస్‌వాళ్లు గెలిచారు. 2005లో తెలంగాణ ఇస్తే అయిపోవుగా! 14 ఏండ్లు సోనియాగాంధీ ఎగబెట్టే ప్రయత్నం చేశారు. 14 ఏండ్లు ఏడిపిచ్చి.. అప్పటికీ ఇయ్యకపోతే చివరికి చావు నోట్ల తలకాయ పెడితే.. దేశమంతా గత్తర గత్తర, పార్లమెంట్‌లో లొల్లి అయితే.. దిక్కులేక ఇచ్చిండ్రు. అది కూడా దేశమంత నెగిటివ్ అయింది.. కొంప మునుగుతది అని సర్వేలు చేసుకొని ఇక్కడన్న నాలుగు సీట్లు వస్తయని ఇచ్చారు. కానీ ప్రజలు గమనించారు. వాస్తవం ఏందో చూశారు. 2014 వాళ్లకు అధికారం ఇయ్యలే.

కూటమిలో పార్టీకో మ్యానిఫెస్టోనా?
కూటమిలో ఎవరి మ్యానిఫెస్టో వారికే ఉంటదా? టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు.. ఇంకో పార్టీది ఇంకో మ్యానిఫెస్టో! ఏది అమలుచేస్తరు? ఎవరిని నమ్మాలి? చెప్పెటోడు సీఎం అయితాడా? ఢిల్లీకెళ్లి లిఫాపల ఎవరి పేరు వస్తదో? ఇప్పుడు చూస్తలేమా టికెట్ల బాగోతం! ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నరని వాళ్ల పార్టీవాళ్లే చెప్తున్నరు. ఈ వ్యక్తులు రాష్ట్రం నడుపుతారా? వీళ్లతోని అయితదా? దయచేసి ఆలోచన చేయాలి. మేం మ్యానిఫెస్టోలో తక్కువ పెట్టినం.. కార్యక్రమాలు ఎక్కువ చేసినం. తెలంగాణలో ఎవ్వరు బాధపడొద్దు. ఎవ్వరూ ఆగంకావద్దు. అందరం సంతోషంగా ఉండాలి. సంపద పంచుకోవాలి.

నేనుపోయి మహారాష్ట్రల రాజకీయం చేస్తనంటే ఊరుకుంటరా?
మేం ఉద్యమం చేస్తుంటే కాంగ్రెసోళ్లు ఒక్కరన్న మంత్రి పదవికి రాజీనామా చేసిండ్రా? కిరణ్‌కుమార్‌రెడ్డికి జోక్కుంటా కూర్చున్నరు. ఒకరోజు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి.. రాసి పెట్టుకో.. తెలంగాణకు రూపాయి కూడా ఇయ్య. ఏం చేస్తవో చేసుకో అన్నడు. ఇదే టీఆర్‌ఎస్‌వాళ్లు కొట్లాడారు కానీ కాంగ్రెసోళ్లు రాజీనామా చేయలే. పౌరుషం లేని దద్దమ్మలు. చీము, నెత్తురులేనోళ్లు. రాజకీయ లబ్ధికోసం మళ్లా చంద్రబాబును తోలుకవచ్చి మన నెత్తిమీద రుద్దే ప్రయత్నం చేస్తున్నరు. అది చాలా ప్రమాద ం. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చాలా బాధపడి చెప్తున్న. కొట్లాడితే మీరు కొట్లాడనుంటిరి? సరే ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్లు పనిచేయాలి. చంద్రబాబును ఎందుకు తోలుకొచ్చుకోవాలి? బాబు మనకెందుకు? నేనుపోయి మహారాష్ట్రల రాజకీయంచేస్తే ఊరుకుంటరా వాళ్లు? బాబును నేనోసారి తరిమేశాను. ఇప్పు డు తరిమేసే బాధ్యత మీదే. తెలంగాణకు కిరికిరి రాజకీయం అవసరంలేదు. మా బతుకు తెరువు మేం చూసుకుంటామని చెప్పాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.