Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

విభజన పూర్తిచేయండి

-ప్రధాని మోదీకి టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పాటు రాష్ట్రస్థాయి క్యాడర్ విభజన ఇంకా పూర్తికాకపోవడం వలన ఎదురవుతున్న పరిపాలనాపరమైన సమస్యలను కూడా ప్రధానికి వివరించారు.

TRS MP's with PM Narendra Modi 01

ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీతో టీఆర్‌ఎస్ ఎంపీల బృందం భేటీ అయింది. ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, జీ నగేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పాటిల్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఈ బృందంలో ఉన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నా ఎంపీలు విజ్ఞప్తి చేయగానే ప్రధాని మోదీ వారిని తన చాంబర్‌కు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యలను, తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులను వివరించడంతోపాటు విద్యుత్ సంక్షోభాన్ని కూడా ప్రధాని దృష్టికి వారు తీసుకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రభుత్వం ఈ ఆరునెలల కాలంలో చేసిన పనులను, భవిష్యత్తులో చేయాల్సిన పనులను, ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ వ్యూహాన్ని ప్రధానికి వివరించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక రాయితీలు, ప్యాకేజీలు, ఇతర సహకారం వేగిరమే అందించాలని అర్థించారు.

కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణినే కొనసాగించాలనుకుంటున్న విషయాన్ని వీరు నొక్కి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను, రానున్న మూడేళ్ళ కాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించారు. కేంద్రం తెలంగాణ రాష్ర్టానికి మంజూరు చేసిన 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్ల శంకుస్థాపనకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం తలెత్తుతున్న వివిధ సమస్యలను కూడా ఎంపీలు ప్రధానికి విశదపరిచారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వెంటనే విభజించాలని ప్రధానికి వారు విజ్ఞప్తి చేశారు. విభజన జరుగకపోవడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను వివరించారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడిన వెంటనే హైకోర్టు విభజన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పాటు రాష్ట్రస్థాయి కేడర్ విభజన ఇంకా పూర్తి కాకపోవడం వలన ఎదురవుతున్న పరిపాలనాపరమైన సమస్యలను కూడా ప్రధానికి వివరించారు.

ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంపూర్ణ సహకార ధోరణినే కొనసాగించాలనుకుంటున్నదని ఎంపీలు ప్రధానికి తెలియచేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. గుజరాత్ తరహా వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, గుజరాత్‌లో పర్యటించి వచ్చిన అనుభవాలను వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తీసుకున్న నిర్ణయం, తదనంతర పరిణామాలను వారు వివరించారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించే తీరు, ప్రజలను రెచ్చగొట్టే తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం తదితరాలను కూడా ప్రధానికి వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కనీసం ముఖ్యమంత్రికి సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం గురించి కూడా వివరించారు.

సహకారం అర్థించాం…కే కేశవరావు ప్రధాని భేటీ గురించిన వివరాలను టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మీడియాకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందచేయాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారధోరణితో ఉండాలని కోరుకుంటోందని, వివిధ అంశాల్లో కేంద్రంనుంచి ఇతోధికంగా ఆర్థిక సహాయం అర్థిస్తున్నదని వివరించామన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ర్టానికి కేంద్రం హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక రాయితీలు వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఒక్కో ఐఏఎస్ అధికారి గరిష్టంగా ఎనిమిది శాఖలను పర్యవేక్షించాల్సి వస్తుందని తెలిపామన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానికి వివరించామన్నారు. గుజరాత్ వాటర్ గ్రిడ్ తరహాలో రానున్న నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా తాగునీటిని అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిపామన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని రానున్న మూడేళ్ళ కాలంలో అధిగమించడంతో పాటు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించామని తెలిపారు.

సార్క్ సహా విదేశీ పర్యటనల్లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినందుకు ప్రధానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపామని కేకే వివరించారు. ప్రధాని మాట్లాడుతూ గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సరిగ్గా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసునని చెప్పారన్నారు. భద్రాచలం పట్టణంలోని రామాలయం తెలంగాణ రాష్ట్రంలోనూ దాని చుట్టూ ఉన్న నాలుగు గ్రామ పంచాయితీలు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై మరో సమావేశంలో ప్రధానికి లోతుగా వివరిస్తామని కేకే తెలిపారు.

ఈ నాలుగు పంచాయితీల్లోని ప్రజలు నిత్యం భద్రాచలంకు రాకపోకలు సాగిస్తూ ఉంటారని, అయితే సరిహద్దులో రాష్ర్టాల చెక్‌పోస్టుల దగ్గర కొత్త రకమైన సమస్యలు తలెత్తుతాయని, దీని వల్ల అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. మ్యాప్‌తో సహా ప్రధానికి వివరించి ఒక పరిష్కారాన్ని కనుగొనేలా చూస్తామని తెలిపారు.

రెండు రాష్ర్టాలూ సఖ్యతతో ఉండాలన్న ప్రధాని.. వినోద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు అభివృద్ధిలో పోటీ పడుతూ సఖ్యతగా వుండాలని ప్రధాని కోరారని ఎంపీ బీ వినోద్ కుమార్ చెప్పారు. రెండు రాష్ర్టాల్లోనూ చంద్రులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి చంద్రుడు ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడో అదే తీరులో ఇద్దరు సీఎంలు ప్రశాంత వాతావరణానికి బాటలు వేయాలని ఆకాంక్షించారని తెలిపారు. రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరెంటు కష్టాల గురించీ, అందుకు దారితీసిన కారణాల గురించీ ప్రధానికి తెలిపామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రధానికి వివరించామన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను ప్రధానికి తెలిపామన్నారు.

28 అంశాలు వివరించాం.. జితేందర్‌రెడ్డి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఆచరణకు నోచని 28 అంశాల గురించి ప్రధానికి వివరించామని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని చాలా బిజీగా ఉన్నప్పటికీ తమ విజ్ఞప్తికి వెంటనే సానుకూలంగా స్పందించి తన చాంబర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారని, తాము వివరించిన అన్ని అంశాలను ఓపిగ్గా వినడమే కాకుండా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఎయిమ్స్ ఆసుపత్రి, కాంపా నిధుల విడుదల, సీఎస్టీకి పరిహారంగా కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, హైకోర్టు విభజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు.. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇలా అనేక అంశాలపై చాలా లోతుగా వివరించామని తెలిపారు. గడచిన ఆరు నెలల్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోని ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతల నిర్వహణ, రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ప్రధానికి వివరించగా ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.