-మలి దశలో మరిన్ని పెట్టుబడులు -ముందుకొచ్చిన ఆస్ట్రేలియా కంపెనీ -కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో పెల్లెట్ యూనిట్లు -1000 మందికి ఉపాధి లభించే అవకాశం -ఎంసీహెచ్చార్డీలో సీఎం కేసీఆర్‌తో ప్రతినిధి బృందం చర్చలు

పరాయిపాలన సంకెళ్లను తెంచుకున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల కంపెనీలు ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ కన్సాలిడేటెడ్ కంపెనీ కరీంనగర్ జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఐరన్ ఓర్ సాంద్రత తక్కువగా ఉన్నా.. ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో వినియోగంలోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో బుధవారం కంపెనీ ప్రతినిధులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో సమావేశమై చర్చించారు. తెలంగాణలో ఐరన్ ఓర్ పరిశ్రమ అభివృద్ధిపై మంతనాలు జరిగాయి. ముడి ఇనుము సాంద్రత 25 శాతం నుంచి 30 శాతం వరకే ఉన్నప్పటికీ.. సాంకేతిక పరిజ్ఞానంతో దానిని 65 శాతానికి పెంచవచ్చని ఎన్‌ఎస్‌ఎల్ కన్సాలిడేటెడ్ కంపెనీ డైరెక్టర్ సియాన్ ఫ్రిమాన్ సీఎంకు వివరించారు.
సాంద్రతను పెంచిన తర్వాత ఉక్కు పరిశ్రమల్లో వినియోగించే పెల్లెట్స్‌గా ఐరన్‌ఓర్‌ను మారుస్తామన్నారు. ఇప్పటికే కరీంనగర్, మెదక్ జిల్లాల్లో దాదాపు 200 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్నట్లు సర్వేలో తేలింది. కరీంనగర్ జిల్లా ఆత్మకూర్, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పెల్లెట్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి బృందం తెలిపింది. తొలి దశలోనే రూ 1000 కోట్లు పెట్టుబడి పెడుతామని.. ఇందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని కోరింది. ఈ స్టీలు ప్లాంటుతో కనీసం వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు చోట్ల పెల్లెట్లు తయారీ ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయి ఉక్కు ఉత్పత్తి కర్మాగారాన్ని కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.
పరిశ్రమలకు స్నేహపూర్వక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతుందని కంపెనీ ప్రతినిధులతో సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వనరులను సద్వినియోగం చేసుకోవడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామీకరణపై దృష్టి పెట్టామని చెప్పారు. పారిశ్రామిక విధానం కూడా పూర్తి పారదర్శకంగా ఉంటుందని, సరళంగానూ ఉంటుందన్నారు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలను నెలకొల్పేవారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బొగ్గు మాదిరిగానే ఇనుప ఖనిజం భారీగా ఉందని, ఐరన్ ఓర్ ఆధారిత కంపెనీలు పెట్టడం వల్ల పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగ యువతకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంపై ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర పాల్గొన్నారు.
అనేకచోట్ల ఐరన్‌ఓర్ తెలంగాణలో ఐరన్ ఓర్ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. అవి తక్కువ నిల్వలు ఉన్నాయని.. పరిశ్రమల ఏర్పాటుకు సరిపోవంటూ ఉమ్మడి రాష్ట్రంలో దుష్ప్రచారం జరిగింది. దానికి తోడు సాంద్రత తక్కువగా ఉందని, ఇనుము తయారీకి ఉపయోగపడదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తప్పుడు నివేదికలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్టీలుప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు గతంలో వచ్చిన కంపెనీలు వెనక్కి పోయినట్లు సమాచారం. భారీ నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ప్రబుత్వం స్పష్టం చేయడంతో.. సాంద్రతతో సంబంధం లేకుండానే స్టీలు ప్లాంటుకు విదేశీ కంపెనీ ముందుకు రావడం విశేషం. ఖమ్మం జిల్లా బయ్యారంలోనూ అధికంగా నిక్షేపాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సహాయనిరాకరణ కారణంగా ఇన్నేళ్లుగా స్టీలు ప్లాంటు ఏర్పాటుకాలేదు. స్వీయపాలనలో ఇక్కడ కూడా ప్లాంటు ఏర్పాటుకు ఓ కంపెనీ ముందుకువచ్చింది. దీంతోపాటు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలోనూ ఐరన్ ఓర్ 40 శాతం సాంద్రతతో ఉంది. ఆదిలాబాద్ జిల్లా కల్లెడ, జిన్నారం, వరంగల్ జిల్లా గూడూరు మండలంలోనూ ఐరన్ ఓర్ ఉంది. కానీ, అది అటవీ ప్రాంతమని అధికారులు చెప్తున్నారు. కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. వీటి వినియోగానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఏపీఎండీసీ తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు.