Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వేగం పెంచాలి

తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శప్రాయం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును యావత్ దేశం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నదని ఆయన చెప్పారు.

CM-KCR-review-on-water-grid-project

-వాటర్‌గ్రిడ్ పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దు: సీఎం కేసీఆర్ -మన గ్రిడ్ మీద దేశమంతా ఆసక్తి -ఇది ప్రతిష్ఠాత్మకం, ఆదర్శప్రాయం -నల్లగొండ, పాలమూరుకే ముందుగా నీరు -15 రోజుల్లో టెండర్లు పూర్తి చేయండి -హడ్కో, నాబార్డ్ పెట్టుబడి 13వేల కోట్లు -రైలు మార్గాలున్నచోట్ల బ్లాంకెట్ అనుమతులు పొందాలి -వాటర్ గ్రిడ్ పథకం పురోగతి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు, కరువు పీడిత పాలమూరు జిల్లాకు మొదట నీరు అందించాలని సంకల్పించినట్టు సీఎం తెలిపారు. సచివాలయంలో సోమవారం వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందించే బృహత్ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని అధికారులకు గుర్తు చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, టెండర్ల ప్రక్రియను వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్లలో దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు పాల్గొనే విధంగా విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పథకానికి ఇప్పటికే అనేక సంస్థలు నిధులు సమకూర్చుతున్నాయని, అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

వేగం..పారదర్శకత..: వాటర్ గ్రిడ్ పనులు వేగంగా, పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. పనుల నాణ్యతలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాల్‌గా తీసుకొని వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపడుతున్నందున అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి అంశంలోనూ పారదర్శకత పాటించాలని ఆదేశించారు. నల్లగొండ , మహబూబ్‌నగర్ జిల్లాలకు మొదటగా తాగునీరు అందించి, ఆ తర్వాత ప్రాజెక్టు పురోగతిని బట్టి మంచినీటి సరఫరా చేస్తూ పోవాలని అధికారులకు సూచించారు.

హడ్కో, నాబార్డు నుంచి రూ.13 వేల కోట్లు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే పలు సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు. హడ్కో, నాబార్డు నుంచి రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, ఈ సంస్థలే మరో రూ.7 వేల కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేర నిధులు అందుతాయన్నారు. ఇవే కాకుండా ఎప్పుడు, ఎక్కడ, ఎంత అవసరం పడ్డా నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

పనుల విభజనతో పర్యవేక్షణ సులభం.. సమావేశంలో గ్రిడ్ ప్రగతిని వివరిస్తూ మొత్తం 26 ప్యాకేజీలలో 17 ప్యాకేజీలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మరొక వారం రోజుల్లో వందశాతం టెండర్లు పూర్తి అవుతాయని పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం 15 రోజుల్లో టెండర్ల పక్రియ మొత్తం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్లకు విస్తృత ప్రచారమిచ్చి దేశంలోని ప్రముఖ కంపెనీలు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 26 ప్యాకేజీలను నాలుగైదు విభాగాలుగా విభజించుకొని పనులను సమీక్షించుకుంటే సులువుగా ఉంటుందని అన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ అనేదే ఉండరాదని, అలాగే సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(సీడీఆర్) రూపొందిన తరువాత దాన్ని ఎక్స్‌పర్ట్ కమిటీకి కూడా పరిశీలన కోసం పంపి సూచనలు తీసుకోవాలన్నారు.

రైల్వే అధికారులకు సీఎం ఫోన్.. వివిధ స్థాయిల్లో వాటర్‌గ్రిడ్ పైపు లైన్లకు 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవకు ఫోన్ చేసి ఈ విషయమై మాట్లాడారు. పైపులైన్లు రైల్వేలైన్లను క్రాస్ చేయడానికి వీలుగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని శ్రీవాత్సవను సీఎం కోరారు. రెండు మూడు రోజుల్లోనే రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశం కావాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలోనే అన్ని క్రాసింగ్‌లకు బ్లాంకెట్ అనుమతి పొందాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్టు కన్సర్వేటర్ మిశ్రా, వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ శాలిని మిశ్రా, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.