దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.
అంతర్జాతీయంగా తలవంపులకు గురవుతున్న ప్రస్తుత సందర్భంలోనైనా మేల్కొనకపొతే జరిగేది మహోత్పాతం. వారితో పాటు మనమూ చరిత్రహీనులం అవుతాం! ఇక మీ ఇష్టం!!
మహ్మద్ ప్రవక్తపై అవమానకరంగా మాట్లాడిన భారత ప్రభుత్వం పై ఖతార్, కువైట్, ఇరాన్ తదితర దేశాలు తీవ్ర నిరసన తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్ ఒక మత రాజ్యంగా, మధ్యయుగాల అవశేషంగా మిగిలిపోయింది. ఇది చేదు వాస్తవం. ఎనిమిదేండ్లలో మనందరినీ వేల ఏండ్ల లోతున పాతిపెట్టింది బీజేపీ. దీనికి ప్రత్యక్ష, పరోక్ష మద్దతుదారులు అందరూ దోషులే. మన పిల్లల పిల్లల బతుకును నర కం చేసిన పాపం బీజేపీదే. ‘భారత ప్రభుత్వం’ అని అనడం తీవ్రంగా అనిపించినా అదే పచ్చి నిజం. దేశాన్ని ఏలే పార్టీ అధికార ప్రతినిధులు వ్యక్తులు కాదు. వారి మాటే పార్టీ మాట, దేశం మాటగా భావిస్తరు.
ఈ వ్యాసంలో మీరు చూస్తున్న ఫొటో కువైట్‌లో చెత్త కుండీలపై మొహం మీద చెప్పు ముద్రతో ఉన్న మన ప్రధాని నరేంద్రమోదీ బొమ్మ! ఎంత విషాదం కదా. మనకెంత తలవంపు కదా? ఈస్టిండియా కంపెనీ పాలనలో సైతం, విదేశీ గడ్డ మీద మన్ననలందుకున్న దేశ నాయకుల చరిత్ర చదివి పెరిగిన మనం ఇపుడు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశపు ప్రధానికి ఇంతటి అవమానం జరగడాన్ని చూసే దుస్థితికి చేరుకున్నం. ఇది మోదీకో, బీజేపీకో సంబంధించినదిగా, వారి అంతర్గత వ్యవహారంగా మనం తీసిపారేయలేం. మన ప్రత్యర్థికి బాగా జరిగిందని సంబురపడలేం. ఎందుకంటే ఈ దేశం మనందరిదీ. విద్వేషానికి నిలయం భారతదేశం అని మరక అంటుకున్నంక విదేశాల్లో ఉండే భారతీయులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతయి. గల్ఫ్‌లో భారతీయుల అవస్థల గురించి మీడియాలో ఇప్పటికే ఆందోళన కలిగించే వార్తలు చూస్తున్నాం. బీజేపీ మత విద్వేషం మనల్ని బజారుకీడ్చింది. ఇంట్లో ఈగల మోత ఇప్పటికే చవిచూస్తున్న మనం బయట రోతకూ బలవుతున్నం.
‘నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను సస్పెండ్ చేసినం, వారు క్షమాపణలు కూడా చెప్పిన్రు, వారి వ్యాఖ్యలు వ్యక్తిగతం’ అంటూ బీజేపీ బుకాయిస్తున్నది. ఇది వాస్తవం కాదు. వారిని చేయి పట్టుకొని నడిపించిన మత విద్వేష భావజాలం లేకుండా వారు లేరు. ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధైర్యం లేకుండా వారిట్లా మాట్లాడరు. ‘అపరిచితుడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది: ‘ఇంత చిన్న తప్పుకు కూడా శిక్ష వేస్తరా’ అంటే హీరో అంటాడు- ‘ఎంత పెద్ద తప్పు చేసినా శిక్ష వేయరనే కదరా మీ ధైర్యం’ అని! ఏ ధైర్యం లేకపోతే, ఏ అండా లేకపోతే వీరిట్లా పేట్రేగిపోగలరు?
బీజేపీ అధిష్ఠానం ఎవరిపైనైనా పబ్లిక్‌గా కన్నెర్ర చేసిందంటే వారి భవిష్యత్ భద్రమని అర్థం. ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను, సాధ్వి రితంబరను, ప్రగ్యా ఠాకూర్‌ను ఎన్నోసారు ్లహెచ్చరించింది బీజేపీ. తర్వాత వారికి ఎంతటి ఉన్నత పదవులు దక్కినయో మనందరికీ తెలుసు. మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, ఆయన సహచర ఎంపీ, వారి పార్టీ ఎమ్మెల్యే ప్రతిరోజూ వైషమ్యాలు రాజేస్తూ ఉన్నా- ‘మీరు ఇట్లాగే దూసుకుపొండి’ అని రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారీ మోదీ-షా భుజం తట్టడం వెనుక ఉన్నది మారణహోమం కాంక్షయే!
కాబట్టి వీరి క్షమాపణలు దేశంలోనే ఎవరూ నమ్మడం లేదు. ఖతార్, కువైట్, ఇరాన్ నమ్ముతయా? కాబట్టే చెప్పుల సత్కారం. అక్కడితో ఆగని విషాదం అది. ఈ దుర్మార్గులు చేస్తున్న పనికి శిక్ష ఆయా దేశాల్లో ఉండే మన బిడ్డలు అనుభవిస్తరు. ఆ వలసజీవులలో ముస్లింలే కాదు, హిందువులూ ఉంటరు. అందరి శత్రువుగా బీజే పీ మారి చాలాకాలమైంది. ఇంకా మత్తులో జోగుతున్న కొందరు గమనించడం లేదంతే. అలాంటి వారికి గల్ఫ్ పరిణామాలు ఒక ఫైనల్ కాల్!
‘మన రాష్ట్రంలో, దేశంలో బీజేపీ నాయకులు మసీదులు కూల్చే స్తాం, ఉర్దూను నిషేధిస్తాం. గుడుల దగ్గర ముస్లింలు వ్యాపారాలు చేయొద్దు, ముస్లింల దగ్గర హిందువులు వస్తువులు కొనొద్దు అం టూ ఉంటే రేపు రేపు ఇస్లామిక్ దేశాలు కూడా ఇదేబాట పడితే మన బిడ్డల గతేం కావాలె? వారందరనీ ఆయా దేశాలు తరిమేస్తే ఎక్కడికి పోవాలె? ఇక్కడున్నోళ్లకే భవిష్యత్ లేదు, తిరిగి వచ్చినవాళ్లను ఈ బీజేపీ ఆదుకుంటదా? ఈ మతపిచ్చి మంచిదా?’- అంటూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో బాధతో చెప్తున్నరు. అందులోని ఆవేదనను గమనించక, గ్రహించక, ఆయనకేదో మోదీతో పొలంగట్టు తగాదా ఉన్నట్టు, అర్జెంటుగా మోదీని దింపేసి తాను ప్రధాని కావాలనే అజెండా ఉన్నట్టు బీజేపీ నాయకులు దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నరు. కానీ, కేసీఆర్ అన్నది నిజమైంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ఖతార్, కువైట్, ఇరాన్ మన రాయబారులకు సమన్లు పంపినయి. మనవారిని ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నరు. మన వస్తువులు, సినిమాలను బహిష్కరిస్తున్నరు. ఇది ఇంకెన్ని దేశాలకు పాకుతదో తలచుకుంటే భయమైతున్నది. ప్రభుత్వాలన్నీ అధికారికంగా చెప్పవు. ప్రభుత్వాల మూడ్‌ను ప్రజలు గమనిస్తరు. భావోద్వేగాలు తీవ్రమైనపుడు ప్రభుత్వాలను మించి స్పందిస్తరు. ఆ తీవ్రతకు వంతపాడుతూ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తది. గల్ఫ్‌లో ఇదే జరుగుతున్నది. ఇపుడు మన పరువే కాదు, భవిష్యత్తూ ప్రమాదంలో పడింది. ఎవరు చెల్లిస్తరు మూల్యం?
నాకు మన సమాజంపైనా నిష్ఠూరం ఉన్నది. ‘తోటకూర దొంగతనం చేసిననాడే చెప్పి ఉండవచ్చు కదమ్మా’ అని మనం చిన్నపుడు చదువుకున్న కథలో దొంగ తన తల్లిని నిలదీసినట్టు- 1984లో ఇద్దరు ఎంపీలున్న పార్టీ మతరథంపై స్వారీ చేస్తూ మన భవిష్యత్‌ను ముంచబోతున్నదని గ్రహింపకలిగినపుడే జాగరూకత ఉండవలసింది. గాంధీని అవమానించి, గాడ్సేను తలకెత్తుకున్నపుడే ఉలిక్కిపడి ఉండవలసింది. కట్టే బట్ట, తినే తిండి, మాట్లాడే భాషపై ఆధిపత్యం చెలాయిస్తున్నపుడైనా మేలుకొనవలసింది. మన అంబేద్కర్ చెప్పిన ‘రాజ్యాంగ రక్షణ’ కల్ల అవుతున్న సందర్భాల్లోనైనా స్పందించవలసింది. బుద్ధభగవానుడి సర్వసమతను పాతర వేస్తున్నపుడైనా నోరు విప్పవలసింది. పోనీ, ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని మార్క్స్ చెప్పిన మాటలకు, మన లౌక్యాన్ని మేళవించుకొని అయినా… దేశ సంపదను నలుగురు గుజరాతీలు కొల్లగొడుతున్నపుడు భయపడి ఉండవలసింది. అర్ధరాత్రి నిర్ణయాలతో పండు ముసలివారిని కూడా ఏటీఎంల చుట్టూ పరుగులు పెట్టించి, వలస కార్మికులను రక్తమోడుతూ రహదారులపై నడిపించినపుడైనా కొంచెం కదలిక ఉండవలసింది. కనీసం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగి మూడుపూటలా తిండి దొరుకని సందర్భంలోనైనా ‘దేశం కోసం, ధర్మం కోసం’ అని వల్లెవేయడం ఆపివేయవలసింది. అంతర్జాతీయంగా తలవంపులకు గురవుతున్న ప్రస్తుత సందర్భంలోనైనా మేల్కొనకపొతే జరిగేది మహోత్పాతం. వారితో పాటు మనమూ చరిత్రహీనులమవుతాం! ఇక మీ ఇష్టం!!