Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వానకాలం వడ్లూ కొంటాం

-రైతులకు సీఎం కేసీఆర్‌ అభయం
-తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ
-గతంలో మాదిరి గ్రామాల్లోనే సేకరణ
-135 లక్షల టన్నుల సేకరణ అంచనా
-నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు
-డిఫాల్ట్‌ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దు
-కొనుగోళ్ల పరిశీలనకు మానిటరింగ్‌ సెల్‌
-పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాలు
-1800-42500333, 1967 టోల్‌ఫ్రీ

ఈ వానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు వడ్లు కొనరంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో.. రైతుల్లో ఆందోళనను తొలగిస్తూ సీఎం కేసీఆర్‌ నేనున్నానంటూ అభయమిచ్చారు. గత వానకాలంలో, యాసంగిలో మాదిరిగానే ఈసారి కూడా రైతుల నుంచి ప్రతి గింజనూ సేకరించాలని నిర్ణయించింది. పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

గత వానకాలం, యాసంగిలో సేకరించినట్టుగానే ఈ వానకాలంలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ శనివారం మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నది. రికార్డుస్థాయిలో ఈ సీజన్‌లో 135 లక్షల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గత వానకాలంలో ప్రభుత్వం 48.85 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఈ సీజన్‌లోనూ ఉప్పుడు బియ్యం తీసుకోరని, కేవలం రా రైస్‌ (పచ్చి బియ్యం) మాత్రమే తీసుకుంటారని వార్తలు రావడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వానకాలం సీజన్‌లో మెజార్టీగా రా రైస్‌ ధాన్యమే వస్తుందని, ఇబ్బందేమీ లేదని అధికారులు తెలిపారు. వచ్చే యాసంగిలో మాత్రం బాయిల్డ్‌ రైస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని ఢిల్లీ సర్కారు ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు..
-ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. రైతులు ఒకే చోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.
-ధాన్యం తీసుకొచ్చే రైతు పేరుపై గల బ్యాంక్‌ ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమచేయాలి. ఒకవేళ రైతుకు బ్యాంకు ఖాతా లేనిపక్షంలో కచ్చితంగా కొత్త ఖాతా ప్రారంభించాలి. ఒక రైతు ధాన్యం డబ్బులు మరొకరి ఖాతాలో జమచేయరు. ఆధార్‌ నంబర్‌తో చెక్‌ చేసి ధాన్యం కొనుగోలు చేస్తారు.
-కొనుగోలు కేంద్రంలో అవసరమైన సౌకర్యాలను మార్కెటింగ్‌శాఖ, జిల్లా కలెక్టర్‌ ఏర్పాటుచేయాలి.
-మద్దతు ధరకే కొనుగోలు చేస్తారు. మద్దతు ధర గ్రేడ్‌ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 నిర్ణయించారు.
-దళారులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఆయా గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలు సేకరించి.. దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఒక రైతు 50 క్వింటాళ్లకు పైగా ధాన్యం తీసుకొస్తే తప్పనిసిగా ఏఈవో లేదా ఏవోతో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి.
-మిల్లర్లు సీఎంఆర్‌తోపాటు నిర్ణీత క్వాంటిటీలో పోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వాలి.
-ధాన్యం నాణ్యత పరిశీలన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకే అప్పగిస్తూ కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం నాణ్యతలో ఏమైనా ఇబ్బందులుంటే అందుకు వారు పూర్తి బాధ్యత వహించాలి. కాబట్టి ధాన్యం కొనుగోలు సమయంలోనే సరైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
-ట్రాక్‌ షీట్‌లో అవకతవకలకు పాల్పడితే అలాంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. -గతంలో నిర్ణీత సమయంలో సీఎంఆర్‌ ఇవ్వని డిఫాల్ట్‌ మిల్లర్లు, ఇతర కేసులున్న మిల్లర్లకు ఈ సీజన్‌లో ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించారు.
-వానకాలం సీఎంఆర్‌ గడువును 2022 జూలై 31గా నిర్ణయించారు.
-ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పరిశీలించేందుకు రాష్ట్ర సివిల్‌ సైప్లెస్‌ భవన్‌లో సెంట్రల్‌ మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటుచేశారు.
-కొనుగోలులో ఇబ్బందులు ఎదురైతే 1800-42500333, 1967 టోల్‌ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.