-మహాయజ్ఞంలా హరితహారం వనాలుంటేనే వానలు -తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నట్లే హరితహారాన్ని విజయవంతం చేసుకుందాం -నాలుగేండ్లలో ప్రతి గ్రామంలో1.60 లక్షల చెట్లుండాలె -వన సంపదతోనే కోతులు వాపస్ పోతయి -మహిళలందరూ కొంగు నడుముకు చుట్టాలె -ప్రతి విద్యార్థి ఓ హరిత సైనికుడిలా మారాలె -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు -చిలుకూరు బాలాజీ సన్నిధిలో మొక్కలు నాటిన సీఎం -లాంఛనంగా తెలంగాణ హరితహారం ప్రారంభం

వన సంపద, మన సంపద. ఇది ఎవరికో చేసే సేవ కాదు.. మనకోసం మనం చేసుకునే సేవ. చెట్ల విలువ గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. దీనిని మహాయజ్ఞంగా నిర్వహించి.. రెండేండ్ల తర్వాత తెలంగాణల కరువు అనేది కనిపించకుండా తరిమివేద్దాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో లాంఛనంగా ప్రారంభించారు.
చిలుకూరు వేంకటేశ్వరస్వామి సమక్షంలో మూడు మొక్కలు నాటి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయం పార్కింగ్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ నాలుగేండ్లలో ప్రతి గ్రామంలో 1.60 లక్షల చెట్లు ఉండాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ల తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని అప్రతిహతంగా కొనసాగించుకుందామన్నారు. అందరికీ ఆకుపచ్చ వందనాలు అంటూ ప్రసంగం మొదలుపెట్టిన సీఎం.. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజలు, రైతుల కార్యక్రమమని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ప్రతి మనిషి నాలుగు చెట్లు నాటడమే హరితహారం..: హరితహారం ఓ మహాయజ్ఞం. హరితహారం అంటే సంస్కృతంలాగ.. చెట్లు పెట్టడమంటె గొప్పతనంలాగ.. అసలు చెట్లు పెట్టడమనేది సర్కారు ప్రోగ్రాంలెక్క అనుకుంటున్నం. కానీ ఇదట్ల కాదు. హరితహారం అంటే మనిషికి నాలుగు చెట్లు పెట్టుడు.. దాన్ని సాదుడు. దాండ్ల పెద్ద బ్రహ్మ పదార్థం ఏంలేదు.
ఎన్ని కోట్లున్నా దండగనే..: ఇది చాలా చిన్న పని. కానీ మతలబు చాలా పెద్దగుంది. మొక్కలు పెట్టుకోవాలంటె సర్కారొచ్చి మనకు చెప్పాల్నా? చిన్నతనంల మనం పుట్టిందెక్కడ? పెరిగిందెక్కడ? అనంతగిరి దగ్గర ఎంత అద్భుతమైన అడవి ఉండె! హైదరాబాద్ సిటీకి ఏ కరీంనగర్‌నుంచో.. ఆదిలాబాద్‌నుంచో ఎవరైన వచ్చి ఓ నెల రోజులు ఉండి వాపస్ వస్తే.. తెల్లగ, నిగనిగ అయిపోయేటోడు. గండిపేట నీళ్లల్లో ఆ మహత్యం ఉంది.
అనంతగిరి అడవుల్లో ఔషధ మొక్కలు ఉంటయి. దాంట్లో నుంచి పుట్టిన మూసీ నీళ్లు ఆ ఔషధాల వేర్ల మీదకెళ్లి వస్తే.. దాంతోటి వంద ఇంజక్షన్లు తీసుకున్నంత మందు ఉండేది. కానీ అవన్నీ వేరే దేశమోళ్లు వచ్చి ఖరాబ్ చేసిండ్రా? ఎవరూ చేయలె. మనకు తెలివిలేక, గతంలో పనిచేసిన ప్రభుత్వాలకు మనకంటె తెలివి తక్కువ ఉండి.. వాళ్లు మనకు చెప్పక.. మొత్తం మన సంపదను మనమే నాశనం చేసుకున్నం. ఇదీ సూరత్ కథ: గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారులున్నరు. చాలా ధనవంతులు. కానీ వాళ్ల నగరంలో చెత్త పెరిగి.. ప్లేగు వ్యాధి వచ్చింది. వేల మంది చనిపోయినరు. ఈ ధనవంతులు బతుకుజీవుడా అని.. విమానాలను కిరాయికి తెచ్చుకొని భార్యాపిల్లలతో పారిపోయిండ్రు.
కేంద్ర ప్రభుత్వం, మిల్ట్రీ రెండు నెలలపాటు దానిని మంచిగ చేసిన తర్వాత మళ్ల మెల్లగ వాపసు వచ్చిండ్రు. అక్కడ వెంకటేశ్వర్‌రావు అనే ఐఏఎస్ అధికారి.. తెలుగాయన.. అందరితోటి మీటింగు పెట్టిండు. సేఠ్ సాబ్.. నీకు వందల కోట్ల ఆస్తి ఉంది కదా! అయినా పాణం చేతుల పట్టుకొని పారిపోయినవు కదా.. వేలకోట్లు ఏం చేసినయి? నిన్ను కాపాడినయా? అన్నరు. వన సంపద.. మన సంపద..: కొన్ని గ్రామాల మీద ఏనుగులు, పులులు, అడవి పందులు వచ్చి పడుతున్నయి. ఏ గుడికాడికో పోతే తప్ప కోతులు కనబడేవి కావు.
ఊర్లకు కోతులు ఆడించెటోళ్లు వస్తె తమాషగ చూసెటోళ్లం! కానీ ఇప్పుడు మందలకు మందలు కోతులు వచ్చి ఊర్ల మీద పడుతున్నయి. అవి ఉండె జాగను చెడగొడుతున్నం కాబట్టి అవి మన ఊర్ల మీదకొచ్చి కొంప కొల్లారం పెడుతున్నయి. చిన్నపుడు రోహిణీ కార్తె వచ్చిందంటే.. బ్రహ్మాండంగ నాగళ్లు కట్టి, విత్తనాలు వేసేది! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికిపోయినవి వానలు? మనకు బాగ డబ్బు ఉంటె చాలు..
రియల్ ఎస్టేట్‌ల కోటి రూపాయలకు ఎకరం పోతే చాలనుకుంటున్నం. ఏం అక్కరలేదనుకుంటున్నం. కానీ వెయ్యి కోట్లు ఉన్నా.. లాభం లేదు! చెట్లు ఉంటెనే.. వన సంపద ఉంటెనే మనకు సంపద ఉన్నట్లు! మన జీవితాన్ని ఎవరో అమెరికానుంచి వచ్చి, పాకిస్థాన్‌నుంచి వచ్చి బాగు చేయరు. మన ఇంట్ల చెత్త పక్కింటోడు వచ్చి ఊడుస్తడా? ఏనాటికైనా సరే.. మన బతుకులు మనమే బాగు చేసుకోవాలె! ఊరి మీదికొచ్చిన మబ్బు కచ్చితంగ కురవాలె..: అందుకే రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన దీక్షతోటి తెలంగాణకు ఆకుపచ్చ చెట్ల దండ వేయాలనే కార్యక్రమాన్ని తీసుకున్నం.
హరితహారం అంటె అదె! అందుకే సంవత్సరానికి 40కోట్ల మొక్కలు.. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 40లక్షల మొక్కలు తయారు చేసి, గవర్నమెంటు సిద్ధంగ ఉంచుతది. మూడు సంవత్సరాలు అనుకున్నం. కానీ నాలుగు సంవత్సరాలు.. ఎలక్షన్ల తర్వాత మళ్ల కూడా చేసుకుందాం. ప్రతి వర్షాకాలంల, ప్రతి గ్రామంల 40వేల మొక్కలు నాటితే.. నాలుగేండ్లకు 1.60 లక్షల మొక్కలయితయి. ఎక్కడ ఖాళీ జాగ కనబడితె అక్కడ చెట్లు పెట్టాలె. మనం పట్టుబట్టి ఒక్క ఊర్ల 1.60 లక్షల చెట్లు ఉంటె.. మన ఊరుకు వచ్చిన వాన మబ్బు కురవకుండ పోనేపోదు.
చెట్ల పెంపకంతోనే కోతులు వాపస్..: నేనూ రైతునే. ఒకరోజు నేను పొలం దగ్గరున్న. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఒకాయన నా దగ్గరికొచ్చిండు. ఏం వస్తివి? అన్న. ఏం లేదు.. మీరు వ్యవసాయం బాగ చేస్తరంట, అందుకె చూద్దామని వచ్చిన.. అన్నడు. ఒక వ్యక్తిని ఇచ్చి, మొత్తం తిప్పుక రమ్మని చెప్పిన. ఆయన తిరిగి వచ్చిన తర్వాత.. ఇద్దరం కలిసి అన్నం తింటున్నం. అప్పుడు ఏమయా.. మీ జిల్లా, ఊరు ఎట్ల ఉంది? వ్యవసాయం మంచిగుందా? వర్షాలు పడుతున్నయా? అని అడిగిన. ఆయన వెంటనే ఒక మాట అన్నడు. వర్షాలు పడకపోవడమేం సార్! మా దగ్గర కచ్చితంగ వర్షాలు పడుతయన్నడు. ఇదేందయ్యా.. దేశమంత కరువు పడతది, మీ దగ్గర వర్షాలు పడ్డయా! అని అన్న. మా ఊరు చుట్టూ జంగల్ ఉంది.
అందుకే కచ్చితంగ మాకు వర్షాలు పడతయి.. ప్రతి సంవత్సరం చెరువులు నిండుతయి.. అన్నడు. ఇందులో నీతేంది? కచ్చితంగ వర్షాలు కురిపించేవి చెట్లే! రాళ్ల వర్షాలు పడకుండ చేసేవి చెట్లే! ఊరుకు పక్కన అడవులల్ల మొత్తం చెట్లను నరుకుతున్నం. ఆ అడవి మనది.. ఎవరిదో కాదు! చిన్నప్పుడు ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉండె! మనం తినే పండ్లు వేరే ఉంటయి.. కోతులుగానీ, ఇతర పక్షులుగానీ తినేవి వేరేవి ఉంటయి! ఒక మేడిపండో… తునిక పండో, ఈత పండో.. చిన్నపుడు ఎన్నో రకాల పండ్లు దొరికేవి. వర్షాకాలమొస్తె సీతాఫల్ పండ్లు ఉండేవి. కోతులు ఆన్నే తినేవి.. ఏర్ల నీళ్లు తాగి మంచిగ ఆడనే ఉండేవి. అవన్నీ మనం కట్ చేసినం. అవి వచ్చి మన పంటల్ని కట్ చేస్తున్నయి. అందుకే ఎంతమంది కోతులను పట్టుకునేటోళ్లు వచ్చినా వాపస్ పోవు!
మహిళలూ కొంగు బిగించాలి..: ఇట్లనె మనం తెలివి తక్కువగ ఉండి, కోతులతో బాధపడుతూ.. పంటల్ని కరాబు చేసుకుందామా? ఏదైనా ఉపాయం ఆలోచిద్దామా? ఇది ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రోగ్రాం కానే కాదు! గవర్నమెంటు పోగ్రాం అంతకంటే కాదు. ఇది మనం ప్రోగ్రాం. ప్రజల ప్రోగ్రాం. రైతుల ప్రోగ్రాం! కచ్చితంగ ఏ ఊరుకు ఆ ఊర్ల పెద్ద మనుషులు మీటింగు పెట్టుకోవాలె. గ్రామంలో వీఆర్వో, వీఆర్‌ఏ ఉన్నరు. ఇంతకుముందు మస్కూరోళ్లు ఉండేది. వీళ్లంత మంచిగ పని చేస్తలేరు. రేపట్నుంచి వీళ్లందరూ ఎట్టి పరిస్థితుల్లో ఈ మొక్కలు నాటించే కార్యక్రమంల నిమగ్నం కావాలని జిల్లా కలెక్టర్లను కోరుతున్న. మన అక్కాచెల్లెళ్లు అందరూ కొంగు నడుంకు చుట్టాలి.
మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే, కరువు బాధ పోవాలంటే.. కచ్చితంగ వర్షాకాలం చెరువులు నిండాలంటే చెట్లు పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు! మీ ఊరికే మొక్కలొస్తయి. టేకు, మామిడి.. చాలారకాల చెట్లు ఉన్నయి. వచ్చే సంవత్సరం ప్రతి గ్రామంలో ఏయే మొక్కలు కావాల్నో రాయించినట్లయితే మీరు ఎన్ని రకాల మొక్కలు కోరినరో, ఎన్ని కోరినరో.. అన్ని సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వానిది. హరితహారం అంటే తమాషాకు పోయి, షేక్‌హ్యాండ్ ఇచ్చేదికాదు! ప్రతి గ్రామంలో రైతులు ఏ చెట్లు కోరుతున్నారో వివరాలు సేకరించాలి.
అటవీశాఖ అధికారులు ఆ మొక్కలను నర్సరీల్లో పెంపొందింపజేయాలి. ముందే ఇండెంట్లు ఇస్తే మంచిగ మొక్కల్ని పెంచి, నాలుగు, ఐదు ఫీట్లు ఉండె మొక్కల్ని ప్రభుత్వం సప్లయి చేస్తది. యువకులు, మహిళా సంఘాలు అందరూ ముందుకు రావాలి. నేను తెలంగాణకోసం బయలుదేరిననాడు ఏమన్నరు? ఎగతాళి చేసిండ్రు! ఇదయితదా అన్నరు! తెలంగాణ రాలేదా? మనం పట్టుబట్టి, జట్టు కడితే కాని పని ఉండనే ఉండదు. అందుకు తెలంగాణ రాష్ట్రం చక్కటి నిదర్శనం.
ఎంత వ్యవసాయం చేసినా… కరెంటు ఇచ్చే బాధ్యత నాది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం.చరిత్రలో ఊహించని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నం. మన దళితులు, గిరిజనులు, అందరూ మంచిగ ఉండాలె! దానికి ప్రభుత్వం పేదల సంక్షేమానికి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడాచేయని మంచి పనులు చేస్తున్నది. వేయి రూపాయల పింఛను ఇచ్చుకుంటున్నం. వికలాంగులకు దేశంలో ఎక్కడా రూ.1500 పింఛను ఇస్తున్న రాష్ట్రం లేదు. హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం పెట్టే సర్కారు దేశంలో లేదు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటున్నం.
కరెంటు బాధలు గతంలో చాలా ఉండె! పోయిన ఎండాకాలం కరెంటు పోలే. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నం. పచ్చదనం పెంచితేనే బంగారు తెలంగాణ రాష్ట్రం సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవని నేను హామీ ఇస్తున్న. బ్రహ్మాండంగ, సంతోషంగ ఎంత వ్యవసాయం చేస్తరో.. చేయండి. మీకు కరెంటు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది! రెండు సంవత్సరాల తర్వాత 24 గంటలు కరెంటు సప్లయి ఇచ్చే బాధ్యత నాది. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నం. అందరూ కలిసి దీనిని విజయవంతం చేసుకోవాలె. ఎట్లయితె తెలంగాణ తెచ్చుకున్నమో అట్ల ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవాలె.
మూడు చోట్ల మొక్కలు నాటిన ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రాంగణంలో సంపంగి మొక్కనాటి ప్రారంభించారు. తొలుత వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన హరితహారం ప్రారంభోత్సవం సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, సంజీవరావు,
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, కే జనార్దన్‌రెడ్డి, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, కేఎస్ రత్నం, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్‌బీఎల్ మిశ్రా, అడిషనల్ పిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభ, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీలు రజిత్‌కుమార్‌సైనీ, ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ పాల్గొన్నారు.