బీజేపీ వైఫల్యాల జాబితా పెద్దదే. మొదటిది అంతర్జాతీయ ప్రయాణాలను అరికట్టే విషయంలో విఫలం, రెండవది ఢిల్లీ నడిబొడ్టున వేల మందితో తబ్లిగీ జమాత్ సమావేశం జరుగుతుంటే సమాచారం ఉండి కూడా నిర్లక్ష్యం చేయడం, మూడవది దేశవ్యాప్తంగా వలస కార్మికుల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం. తద్వారా కేంద్రం దేశాన్ని గందరగోళంలో పడేసింది. వలసల విషయంలో ముందుచూపుతో ప్రవర్తించి ఉంటే కరోనా వ్యాప్తి కన్నా ముందే వలస కార్మికులు తమ ఊర్లకు చేరే విధంగా చేసి ఉంటే కేసుల సంఖ్య తగి ్గ ఉండేది. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెంది, ఇప్పుడు తాను మోయాల్సిన అపఖ్యాతిని రాష్ర్టాలపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది.
చైనా వస్తువులను బహిష్కరించాలి. ఆ దేశం చేస్తున్న ఆగడాలను అరికట్టేవిధంగా భారత్ చర్యలు తీసుకోవాలి.. చైనా అక్రమ చొరబాటును ప్రతిఘటించి ఆ పోరులో అసువులు బాసిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి అన్నమాటలివి. ఒక్క సంతోషి మాత్రమే కాదు, గల్వాన్ లోయలో జరిగిన పోరులో 20 మంది వీరజవానుల మరణాల అనంతరం దేశంలోని అనేక సైనిక కుటుంబాలే కాకుండా పౌర సమాజం నుంచి వస్తున్న డిమాండ్ ఇది.
ప్రజల మనోభావాలు ఇలా ఉంటే.. మన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సైనిక వీరమరణాలను అవమానపరిచేవిధంగా ఉన్నాయి. నరేంద్రమోదీ.. ‘అసలు భారతదేశంలోకి చొరబాట్లే లేవు, మన దేశపు సరిహద్దు రక్షణ పోస్టులు ఎవరి ఆధీనంలో లేవు, కాని మన దేశంవైపు చూసిన చైనా సైనికులతో తలపడి 20మంది అమరత్వం పొందారు’ అని మాట్లాడటం సైనికుల త్యాగాలను అవమానించడమే కాదు, ఏకంగా 130 కోట్ల ప్రజల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడమే.
కేంద్ర ప్రభుత్వ వైఖరితో మన దేశానికి జరుగుతున్న నష్టాలను, కష్టాలను ఇక్కడ తప్పక గుర్తుచేసుకోవాలి. అపరిపక్వ విధానాలతో పెద్ద నోట్ల రద్దు, మతాల పేరుతో సమాజాన్ని విడదీయడానికి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఏ లాంటి నిర్ణయాలు, ఎలాంటి ముందుచూపు లేకుండా కరోనా కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించటం లాంటివన్నీ వైఫల్యాలే. కరోనా కష్టాలను తీర్చేందుకని కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏ సామాన్యుడికి అందకపోవటమేకాదు, చివరికి ఆ లెక్కలు ఏ ఆర్థిక నిపుణుడికీ అర్థం కాని పరిస్థితి. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలను అపఖ్యాతి పాలుచేసే పనిపెట్టుకున్నది.
ప్రపంచవ్యాప్తంగా కరోనాబాధితుల సంఖ్య కోటి దాటిపోయింది. దేశంలో సుమారుగా నాలుగున్నర లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 14 వేల మంది మరణించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉన్నది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 29 వేలు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో 19 వేలు, మధ్యప్రదేశ్‌లో 12 వేలు దాటాయి. కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమైనట్టు విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు, మరి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎవరి నిర్లక్ష్యం వల్ల కేసులు పెరిగినాయో వివరించాలి. గురివింద సామెత మరిచిపోయిన బీజేపీ నేతలు వారి ఏలుబడిలోని ప్రభుత్వాల సంగతి మరిచినట్లున్నారు.
దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది కరోనా బాధితులు ఉండటానికి కారణాలు అనేకం. బీజేపీ నేతలు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మార్చి 22న ప్రధాని మోదీ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు, జాగ్రత్తలు లేకుండానే లాక్‌డౌన్ ప్రకటిస్తే, వ్యాధి తీవ్రతను గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి ప్రజలను అప్రమత్తం చేసింది. అప్పటికి నడుస్తున్న ఉభయసభలను వాయిదా వేసింది. తబ్లిగీ జమాత్ సభలకు వెళ్లి వచ్చినవారి పట్ల దేశం మొత్తాన్ని అప్రమత్తం చేయాలని కేంద్రానికి సూచించింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. అంతెందుకు, వలస కార్మికుల విషయంలో కూడా నిర్దిష్ట నిర్ణయం తీసుకోకపోవడం, ఆ తర్వాత విదేశీ విమానాల రాకపోకలు అరికట్టడంలో అలసత్వం, వెరసి ఈరోజు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా కరోనా వ్యాపించింది.
కేంద్రం అనేక విషయాల్లో వైఫల్యం చెంది, వాటిని కప్పిపుచ్చుకోవడానికి హేతుబద్ధం కాని విమర్శలకు దిగుతున్నది. కేంద్ర బీజేపీ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న రాష్ట్ర బీజేపీ శాఖ తీరు ‘దొంగే.. దొంగ దొంగ’ అని అరిచినట్లు ఉన్నది.
(వ్యాసకర్త: ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు శ్రీ కర్నె ప్రభాకర్ )