-దవాఖానల బలోపేతమే లక్ష్యం -ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌లు సమర్థంగా నిర్వహిస్తాం -జూడాల సమ్మెపై చట్టం తనపని తాను చేసుకుపోతుంది -డిప్యూటీ సీఎం టీ రాజయ్య..దవాఖానల సూపరింటెండెంట్లతో భేటీ

ఆరోగ్యశ్రీతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నదని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్యోశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు కార్యాలయంలో అన్ని బోధన, ఏరియా, ముఖ్య దవాఖానాల సూపరింటెండెంట్లతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్యోశ్రీ, ఈహెచ్‌ఎస్ అమలు, ప్రభుత్వ దవాఖానాల బలోపేతం, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు-వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలు, సూచనలు, ఆదేశాలు అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా దవాఖానాలవారీగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయనిన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో పారిశుద్ధ్యం, భద్రతపైనే దృష్టి: ప్రభుత్వ దవాఖానల్లో మౌలికవసతుల పెంపుతోపాటు పారిశుద్ధ్యం, భద్రత పై ప్రధానంగా దృష్టి పెట్టామని మంత్రి రాజయ్య తెలిపారు. కార్పొరేట్ వైద్యాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఆరోగ్య సేవ ల వికేంద్రీకరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. పీహెచ్‌సీల స్థాయిని పెంచేందుకు రూ.44 కోట్లు, వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా, సీహెచ్‌సీల బలోపేతానికి రూ.74 కోట్లు, ఒక్క హైదరాబాద్‌కే రూ.570కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ దవాఖానలకు రూ.100 కోట్ల చొప్పున, నిమ్స్‌కు రూ.200 కోట్లు కేటాయించటం గొప్ప విషయమన్నారు. ఏ దవాఖానకు కూడా రూ.10 కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించాని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ పథకాలను 230 దవాఖానల్లో అమలు చేస్తున్నామని, ఇందులో 12 దవాఖానలు మాత్రమే ఉద్యోగుల హెల్త్‌కార్డుల పథకం అమలుకు నిరాకరించాయన్నారు. ఈ నెల ఒకటోతేదీ నుంచే ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం అందించాల్సి ఉండగా కొన్ని దవాఖానలు ముందుకు రాకపోవటతో 30వ తేదీవరకు క్యాష్‌లెస్, రీయింబర్స్‌మెంట్ రెండింటినీ అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వ విధానాలను ఒప్పుకోకుండా ఈహెచ్‌ఎస్ పథకం విషయంలో మొండిగా ఉన్న కార్పొరేట్ దవాఖానల్లో ఆరోగ్య శ్రీ సేవలు కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నామని, ఫైల్‌పై తాను సంతకం చేశానని.. సీఎం కేసీఆర్ సంతకం కాగానే కార్డులిస్తామన్నారు. ఇందుకు రూ.3 కోట్లు కేటాయించామని, విధి విధానాలపై జర్నలిస్టు ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈహెచ్‌ఎస్‌కు రూ.230కోట్ల నిధులు, రీయింబర్స్‌మెంట్‌కు రూ.15 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.325 కోట్లు, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.180 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
జూడాల ఐదు డిమాండ్లలో ప్రతినెలా రూ.8 కోట్లతో ప్రత్యేక రక్షణ దళం, అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమాన వేతనాలు, హౌస్ సర్జన్లకు గౌరవ వేతనం 15 శాతం పెంపు, ప్రతి నెలా రెగ్యులర్‌గా చెల్లింపులకు ఒప్పుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు తప్పనిసరి సేవల విషయంలో సమస్య ఏర్పడిందని, ఎంసీఐ నిబంధనల ప్రకారమే ఎంబీబీఎస్ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలు, పీజీ విద్యార్థులకు బోధన దవాఖానల్లో ఏడాది సర్వీసుకు పోస్టింగులు ఇస్తున్నామని తెలిపారు. జూడాల సమ్మె విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం వచ్చినా అమలు చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ సీఈవో ధనుంజయరెడ్డి, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, టీవీవీ కమిషనర్ వీణాకుమారి పాల్గొన్నారు.