-జన తెలంగాణ తయారుచేద్దాం రూ.2.75లక్షలతో మంచి ఇండ్లు కట్టించి ఇస్తాం ఆ ఏడు మండలాలకోసం న్యాయపోరాటం ఎమ్మెల్యే, ఎంపీ.. రెండు ఓట్లూ టీఆర్‌ఎస్‌కే -టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు -టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా దంపతులు -మాజీ డీజీపీ జయచంద్రారెడ్డి కూడా -మానుకోట ఘటన దురదృష్టకరం ఇక టీఆర్‌ఎస్‌లో సైనికుల్లా పనిచేస్తాం -టీఆర్‌ఎస్‌లో చేరుతూ సురేఖ వ్యాఖ్యలు -వరంగల్‌లో క్లీన్ స్వీప్ చేస్తామన్న కేటీఆర్ హైదరాబాద్: కొత్త రాష్ట్రం, కొత్త నాయకులు, కొత్త పాలన ఉంటుంది. రాబోయే రోజుల్లో జన తెలంగాణను తయారుచేసుకుందాం. అందరం సమానంగా బతుకుదాం. సమానంగా బతికే తెలంగాణను తయారు చేసుకుందాం. ఇలా తయారుచేస్తామనే సంపూర్ణ విశ్వాసం నాకుంది అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణ తెస్తా అన్నా. ఉద్యమం నుంచి పక్కదారి పడితే రాళ్లతో కొట్టిచంపమన్నా. తెలంగాణ తెస్తానని చెప్పిన.. తెచ్చుకున్నం. అవినీతిరహిత తెలంగాణను టీఆర్‌ఎస్ తయారుచేస్తుంది. అందుకు మీరంతా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాలి అని కేసీఆర్ కోరారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, ఆమె భర్త మురళితోపాటు మాజీ డీజీపీ జయచంద్రారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు జగదీశ్వర్‌రెడ్డి, కోదండరాంరెడ్డి, బుచ్చిరెడ్డి, సర్దార్‌ఖాన్ తదితరులు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు తిరిగిన. అనేక వర్గాలతో చర్చించిన. తెలంగాణ ప్రజల గుండెల్లో ఏముందో టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తెలిసినంతగా ప్రపంచంలోని మరెవ్వరికీ తెల్వదు.
ఇప్పటివరకు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించినట్లుగా ఎవరూ పనిచేయలేదు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కోల్పోయే పరిస్థితికి మనం నెట్టివేయబడ్డం. మనోళ్లు కూడా ఆంధ్రభాష, యాసనే మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ టీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి మన భాష, యాస, సంస్కృతి వెల్లివిరుస్తోంది. తెలంగాణలో 85 శాతం బడుగు, బలహీనవర్గాల వారుంటారు. మిగిలిన 15 శాతం మంది అగ్రవర్ణాలున్నా… వారిలోకూడా పేదలే ఎక్కువ. అంటే మొత్తంగా కూడా తెలంగాణలో పేదలే ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన తెలంగాణ ధనవంతుల కోసం, దొరల పెత్తనం కోసం కాదు.
తెలంగాణలో సిరులు కురువాలి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలహీనవర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఒక్క రూమ్ కట్టించి ఇచ్చాయి. ఈ ఇళ్లలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటరా? ఒక్కరూంలో ఎవరైనా సంసారం చేస్తారా? వీరికి ఆత్మగౌరవం అక్కర్లేదా? టీఆర్‌ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2.75 లక్షలతో రెండు బెడ్‌రూంలు, హాల్, కిచెన్‌తో ఇల్లు కట్టించి ఇస్తాం. దీనికి ఎలాంటి లోన్ ఉండదు. పూర్తిగా ఉచితంగా కట్టిస్తాం. కట్టిన కాలనీలకు కరెంటు, తాగునీరు, రోడ్లు ఇలా అన్ని సౌకర్యాలూ కల్పించి ఇస్తాం. ఇక విద్య అనేది నాకున్న పెద్ద కల. నేడున్న ముఖ్యమంత్రులు పెద్దపెద్ద ప్రసంగాలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు మంజూరు అంటూ సంతకాలు పెడుతున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాలలే ఉంటాయి. అందరికీ ఒకే విద్య, ఒకే రకమైన ఆహారం, ఒకే యూనిఫాం, ఒకే మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ అమలుచేస్తాం.
ప్రతి మండలంలో నాలుగైదు స్కూల్స్‌ను 15 ఎకరాల్లో ఒక్కటి చొప్పున ఏర్పాటుచేస్తాం. కలెక్టర్ నెలకోసారి స్కూల్లో పండుకునేలా చేస్తాం. మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించేలా ఏర్పాటు చేస్తాం. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. ప్రతి మండలంలో పోలీస్‌స్టేషన్ ఉంది. ఊళ్లో ఉన్న పిల్లలను గుర్తించి వారిని స్కూల్‌కు పట్టిచ్చే బాధ్యత ఎస్సైదే. లేకుంటే వాళ్ల ఉద్యోగాలు పోతయి. దీని వల్ల పోలీసులకు కూడా సామాజిక బాధ్యత తెలిసొస్తుంది. ఎస్సారెస్పీ ఫేజ్2కు 20ఏళ్ల క్రితం కాలువలు తవ్వారు. కానీ ఇప్పటికీ నీళ్లు రాలేదు. చెరువులు నిండలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. మహబూబ్‌నగర్‌లో వలసలు ఎందుకున్నాయి? ఈ జిల్లాలో రెండు జీవనదులు పారుతున్నా వలసలు వెళ్తున్నారు. మంచి భూములు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. కానీ నీళ్లులేవు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో 14 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. అధికార వికేంద్రీకరణలో భాగంగానే తెలంగాణ ఏర్పడింది. రేపు తెలంగాణలో ఇప్పుడున్నవి కాకుండా మరో 14 జిల్లాలు ఏర్పాటైతయి. వనపర్తి కూడా జిల్లా కేంద్రంగా మారుతుంది. ఎన్నికల కమిటీ ఇప్పటికే వనపర్తి స్థానానికి నిరంజన్‌రెడ్డి పేరును క్లియర్ చేసింది. ఆయన్ను గెలిపించుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి ఏమేం చేయబోతున్నామో త్వరలోనే ప్రకటిస్తాం. మీరంతా టీవీలో చూసుకోండి. దేశంలో మోడీకి ఓట్లేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ మన రాతను మనమే రాసుకుందాం. ఆంధ్రకు 25 ఎంపీ స్థానాలుంటే, తెలంగాణకు 17 మాత్రమే ఉన్నాయి.
ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతున్నరు. దీనిపై కోర్టుకు పోత అని చెప్పిన. పోత. మనం ఢిల్లీని శాసించి మనకేం కావల్నో తెచ్చుకుందాం. ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలే. గెలుపు మనదే. అని అన్నారు. ఇదే కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్తుకు చెందిన నేతలు కేసీఆర్‌ను ఆశీర్వదించారు. వారి పరిషత్తు భేటీలో బ్రాహ్మణులంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భం కేసీఆర్ వారికి పాదాభివందనం చేశారు.