-ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు -పారిశ్రామిక విధానంపై అధ్యయనం -వెంట వెళ్లనున్న పరిశ్రమలశాఖ అధికారులు, మంత్రులు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చేవారం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలని సంకల్పించిన ఆయన ఈ పర్యటనలో అక్కడి ఇండస్ట్రియల్ పాలసీని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో సింగపూర్‌లో జరుగనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే.. ఈ కార్యక్రమంలో సింగపూర్ ప్రధాని లీ హజైన్‌లూంగ్, ఐఐఎం అధ్యక్షుడు ఎస్‌ఆర్ నాథన్ కూడా పాల్గొంటారు. సింగిల్ విండో పాలసీ ద్వారా అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలుచేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఇందులో భాగంగా ప్రపంచంలోనే మేలైన ఇండస్ట్రియల్ పాలసీలపై అధికారులు అధ్యయనం చేసి ముసాయిదా కూడా సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలోనూ పారిశ్రామిక విధానాల అమలుతీరుతెన్నులను పరిశీలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక విధానం అమలు తీరుతెన్నులను నేరుగా పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్‌రంజన్ ఈ నెల 20న సింగపూర్ పర్యటనకు వెళ్తుండగా.. ఆ మరునాడు 21న సీఎం వెళ్లే అవకాశముందని తెలుస్తున్నది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు మరో మంత్రి కూడా ఆయనతోపాటు వెళ్తారని సమాచారం.
ప్రధానంగా ఈ పర్యటనలో సింగపూర్‌లోని సింగిల్‌విండో విధానంపై దృష్టి పెట్టనున్నారని తెలిసింది. మూడు నాలుగు రోజులపాటు సింగపూర్‌లోనే ఉండి అధ్యయనం చేయనున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర గురువారం టీ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ప్రాథమికంగా రూపొందించిన పారిశ్రామిక విధానానికి తుది మెరుగులు దిద్ది క్యాబినెట్ ముందుంచే అవకాశముంది. రాయితీలు, సబ్సిడీలు, పన్నులు, సదుపాయాల కల్పన, భూ కేటాయింపులు వంటి అనేక ప్రాధాన్యాంశాల్లో పలుమార్లు మార్పులు చేయకుండా పక్కాగా పాలసీని రూపొందించాలన్న లక్ష్యంతోనే అధ్యయనం చేస్తున్నట్లు ప్రదీప్‌చంద్ర చెప్పారు. ఒక్కసారి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత సవరణల ప్రతిపాదనలు రాకుండా ఉండేటట్లుగా అన్ని వర్గాలకు సౌకర్యవంతంగా విధానాన్ని రూపొందిస్తామన్నారు.