Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉత్పత్తే కాదు ఉత్పాదకత పెరగాలి

దేశంలో రైతుల పంటకు గిట్టుబాటు ధర రావాలంటే విదేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ఆగిపోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ దిశలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం బెమెత్ర జిల్లా కోహడియా గ్రామంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించిన రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. -ఎగుమతులే ఉండాలి దిగుమతులు వద్దు -మూడేండ్ల తర్వాత తెలంగాణలో 24గంటల విద్యుత్ -ఛత్తీస్‌గఢ్ రైతులతో సీఎం కేసిఆర్ మాట ముచ్చట -అద్భుతాలు సృష్టిస్తున్నారని రైతులకు ప్రశంస

KCR interact with farmers in Chattisgarh

ఈ సందర్భంగా మాట్లాడుతూ, చైనావంటి దేశాలు వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు సాధించి, మనలాంటి దేశాలకు ఎగుమతి చేయడంవల్ల ఇక్కడి రైతుల పంటకు సరైన ధర రావడం లేదని చెప్పారు. ఈ పరిస్థితి పోవాలంటే మనదేశంలో పండే ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి ఆగిపోవాలని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారు. కానీ మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మూడేండ్లలో దాదాపు 16,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తరువాత మేం కూడా 24గంటల విద్యుత్ ఇస్తాం అని తెలిపారు.

కష్టకాలంలో ఉన్న మమ్మల్ని ఆదుకోవాలని మీ సీఎం రమణ్‌సింగ్‌ను అభ్యర్థించాను. అండగా ఉంటామని మాటిచ్చారు. మీ దగ్గరి నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయబోతున్నాం. అంతకన్నా ఒక రోజు ముందుగానే మీ రైతులనుంచి ఎంతో నేర్చుకొని వెళ్తున్నాను అని అన్నారు. కరెంట్ ఒక్కటి అందుబాటులో ఉంటే తెలంగాణలో కూడా రైతులు బాగుపడతారు. తెలంగాణలో సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు, భిన్న స్వభావం కలిగిన నేలలు, మంచి వర్షపాతం ఉన్నాయి. దేశంలో ఒకవైపు ఆహార ధాన్యాల కొరత ఉన్నది. మరోవైపు రైతులు పండించిన పంటకు సరైన ధర రావడం లేదు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించి, ఆధునిక పద్ధతులు అవలంబించి ఛత్తీస్‌గఢ్ రైతులు అధిక ఉత్పత్తులు సాధిస్తున్నారని కొనియాడారు. నేనూ రైతు బిడ్డనే. తెలంగాణలోని మెదక్ జిల్లాలో నేను వ్యవసాయం చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో ఆధునిక వ్యవసాయం ద్వారా ఉత్పత్తులను పెంచిన వీఎస్‌ఆర్ సీడ్స్ రిసెర్చ్ గురించి విన్నాను. ఈ కంపెనీ ఎండీ విమల్ చౌదాను స్వయంగా నా వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించాను.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌ వచ్చి అక్కడి వ్యవసాయాన్ని ప్రత్యక్షంగా చూసి, ఆ పద్ధతులను మా తెలంగాణ రైతులకు వివరిస్తానని అప్పుడే చెప్పాను. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది నా సంకల్పం. మా నేలల్లో బంగారు పంటలు పండాలి. అందుకోసం ఇక్కడికి వచ్చి కొన్ని పద్ధతులైనా నేర్చుకొని పోవాలని అనుకున్నాను. అందుకే వచ్చాను అని కేసీఆర్ వివరించారు. ఇక్కడి రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మీతో జరిపిన సంభాషణల్లో ఒకరు ఎకరానికి 80 టన్నుల కాప్సికం, మరో రైతు ఎకరానికి 420క్వింటాళ్ల మిర్చి పండించినట్లు విని ఆశ్చర్యపోయాను. ఇజ్రాయిల్‌లో కూడా ఈ విధంగానే మంచి ఉత్పత్తులు వస్తాయి.

ఎడారి ప్రాంతమైనా.. అక్కడ గొప్పగా వ్యవసాయం సాగవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ ఉన్న కట్‌ఫ్లవర్ 90శాతం అక్కడి నుండే ఎగుమతి అవుతున్నది. చైనా కూడా మెరుగైన ఉత్పత్తులు సాధిస్తున్నది. ఛత్తీస్‌గఢ్ రైతులు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. మా తెలంగాణలో కూడా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితే దేశమంతా రావాలి అని ఆకాంక్షించారు. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రాంత రైతులను అంకాపూర్ పంపించాను. ఇప్పుడు తెలంగాణ రైతులను బృందాలుగా ఛత్తీస్‌గఢ్‌కు పంపిస్తాను.

ఇక్కడి రైతులు అవలంబిస్తున్న పద్ధతులను వారు చూడాలి. దేశంలో మరో హరిత విప్లవం రావాలి అన్నారు. ఉత్పత్తులు పెరుగుతున్నా.. ఉత్పాదకత పెరగడం లేదని, ఈ విషయంలో రైతులు ఆలోచించుకోవాలని అన్నారు. ఎక్కడికక్కడ రైతులు సంఘటితం కావాలి. ఐక్యంగా వ్యవసాయం చేయాలి. అందరికీ సంఘాలు ఉంటాయి. కానీ రైతులకు సంఘాలు ఉండవు. వారు పండించిన పంటకు సరైన ధర వచ్చే నమ్మకమే లేదు. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వంనుంచి కొంత సహకారం అందాలి. రైతుల ధృక్పథంలోనూ మార్పు రావాలి. కేంద్రం ఆహార ధాన్యాల దిగుమతులు నిరోధించాలి.

మన దగ్గర దొరకని ఉత్పత్తుల దిగుమతితో నష్టం లేదు. మన పండించే పంటలనుకూడా దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడి రైతులు నష్టపోతున్నారు. ఛత్తీస్‌గఢ్ రైతులు గ్రీన్ హౌజ్, పాలి హౌజ్ కల్టివేషన్‌ద్వారా బిందు సేద్యంతో ఎంతో ప్రగతి సాధిస్తున్నారు. మీరు మరింత ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అని చెప్పారు. రాయ్‌పూర్‌లో ఇంటర్నేషనల్ ైఫ్లెట్స్, కార్గోలు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అందించాలి. ఆహార ధాన్యాల కొరత, పంటలు సాగుచేసే అవకాశంలేని ప్రాంతాలకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ర్టాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కావాలి. అంతే తప్ప విదేశాల నుంచి దిగుమతి కావద్దు.

చైనానుంచి పెద్ద ఎత్తున పత్తి దిగుమతి కావడంవల్ల ఇక్కడ మన రైతులు నష్టపోతున్నారు. చివరికి వ్యవసాయం దండుగ అని భావించి, ఈ రంగం నుంచే తప్పుకోవాల్సి వస్తున్నది. అలాంటి వారికి మీలాంటి రైతులు స్ఫూర్తి కావాలి అన్నారు. తెలంగాణలోకూడా బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా లక్షా 30వేల ఎకరాల్లో ఈసారి డ్రిప్ ఇరిగేషన్‌ద్వారా పంటలు పండిస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90%, ఇతరులకు 80% సబ్సిడీలిస్తాం. గ్రీన్ హౌజ్ కల్టివేషన్‌ను కూడా ప్రోత్సహిస్తాం.

ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకోవడంవంటి ప్రగతిశీల లక్షణాలు ఛత్తీస్‌గఢ్ రైతులను ఉన్నత స్థానంలో నిలిపాయి. ఈ స్ఫూర్తి దేశమంతా విస్తరించాలి అని కేసీఆర్ అన్నారు. తెలంగాణను భారతదేశ విత్తన భాండాగారంగా మారుస్తాం. వరంగల్, కరీంనగర్‌ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో లక్ష ఎకరాల్లో వరి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోకూడా వరి సాగుకు మా విత్తనాలు వాడుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య కేవలం గోదావరి నది మాత్రమే అడ్డంగా ఉన్నది. సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో రెండూ ఒక్కటే అని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న సాగా ఎమ్మెల్యే లాబ్ చంద్ బఫ్‌నా తెలంగాణ ముఖ్యమంత్రిని రాష్ర్టావతరణ దినోత్సవాల సందర్భంగా వచ్చిన ఆత్మీయ అతిథిగా సంభోదించారు. తెలంగాణ సీఎంకు మా భాష అర్థం కాదనుకున్నాను. హిందీలో మాట్లాడలేరనుకున్నాను. కానీ కేసీఆర్‌కు హిందీలోనూ ఇంత పట్టు ఉన్నదని అనుకోలేదు అని చెప్పారు. మరో ఎమ్మెల్యే సావల్‌రామ్ దేహరేతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, అక్కడి కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు. సీఎంతో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వేణుగోపాలచారి, నర్సింగరావు తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.