దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేనివిధంగా మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల కాపరులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నామని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులోని కిసాన్‌సాగర్ చెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతితో కలిసి చెరువు పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మిషన్ కాకతీయతోనే బంగారు తెలంగాణ సాధ్యమని గ్రహించిన ఎస్పీ సుమతి, సీఎం కేసీఆర్ పిలుపుతో అందరికంటే ముందుగా చెరువును దత్తత తీసుకుని పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వంతో కలిసిరా వడం అభినందనీయమని కొనియాడారు. పోలీసులు రక్షణలోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటామని ఎస్పీ రుజువు చేశారన్నారు. -పనుల్లో పోలీసుశాఖ భాగస్వామ్యం అభినందనీయం -పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతాం -కబ్జా చేస్తే కఠిన చర్యలు: మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక గతంలో పోలీసులే పని చేప్పేవారని, ప్రస్తుతం పనిచేసే పోలీసులని ఎస్పీ చూపించారన్నారు. ఈ విషయంలో డీజీపీని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, ఇతర జిల్లాల్లో కూడా పోలీసు అధికారులు మిషన్‌కాకతీయలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. కిసాన్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.మిషన్‌కాకతీయకు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపి రూ.32.18 కోట్లు విరాళాలు ఇచ్చాయని, ఎన్‌ఆర్‌ఐ, ఇతరుల నుంచి ఇప్పటివరకు రూ.41.16 కోట్లు విరాళంగా అందాయని తెలిపారు.
చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 25 శాతం వరకు పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. తర్వాత ఎస్పీ సుమతి మాట్లాడుతూ చెరువును దత్తత తీసుకుని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ తిరుపతన్న, ఆర్డీవో మధుకర్‌రెడ్డి, జెడ్పీటీసి మనోహర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు. మిర్‌దొడ్డి, దౌల్తాబాద్ మండలాల్లో అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హత్నూర మండలం చందాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పనులను ప్రారంభించారు.
-చెరువులతోనే భూగర్భ జలాలు పెంపు చెరువుల పునరుద్ధరణతోనే భూగర్భ జలాలు పెంపొందుతాయని నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. జుక్కల్ మండలం ఖండేబల్లూర్ పెద్దచెరువు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. వర్ని , బాన్సువాడ మండలాల్లో చెరువు పనులను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు పోచారం సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం బాలపెల్లి జల్లకుంట పనులను జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే టీ జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సుజాతనగర్ చెలిమలకుంటలో పనులను జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం ప్రారంభించారు. కొత్తగూడెం పోలీస్‌సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు గ్రామస్తులు మిషన్ కాకతీయలో పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి రంగనాయకులు చెరువు పనులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి పరిశీలించారు. ఉప్పునుంతల మహాసముద్రం చెరువు, లకా్ష్మపూర్‌లోని వెంకటేశ్వర చెరువు పనులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం దొనబండ ఊర చెరువు పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావు, వేమనపల్లి మండలం లింగాలలోని ఎర్రకుంట పనులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురంలోని తుంగకుంట, బాబాసాహెబ్‌గూడెం, తుర్కపల్లి, రామచంద్రాపురంలోని నల్లచెరువు పనులను టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, కోదాడ నియోజకవర్గం లో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, బీబీనగర్ మండలం పడమటి సోమారంలోని చెరువు పనులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందన్‌పల్లి, సూర్యతండా, కొత్త రాయపర్తి, మైలారం ఊర చెరువుల్లో పనులను టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకంతో రైతాంగానికి మేలు చేకూరుతుందన్నారు. చెరువుల పనుల్లో ప్రజలు రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు కావాలని కోరారు.