సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శులని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత వారిపైనే ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రథమ విద్యా మహాసభలు శుక్రవారం నిర్వహించారు.
-విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వారిదే -మెరుగైన సమాజం కోసమే కేజీ టు పీజీ విద్య -టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా మహాసభలో హోంమంత్రి నాయిని

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కులమత అంతరాలు లేని, మెరుగైన సమాజ నిర్మాణం కోసమే కేజీ టు పీజీ విద్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి కేజీ టు పీజీ విద్యను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యరంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నదని వివరించారు. సమాజానికి మార్గదర్శులుగా నిలిచే ఉపాధ్యాయుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ను విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, షీ టీం చైర్మన్ పూనం మాలకొండయ్య ఇచ్చిన నివేదికను తప్పకుండా అమలుచేస్తామని నాయిని వివరించారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏ నర్సిరెడ్డి, ఎస్టీఎఫ్‌ఐ రాష్ట్ర మహిళా కన్వీనర్ సంయుక్త, ఫెడరేషన్ నగర సహాధ్యక్షుడు డీ సంజీవరావు, ప్రధాన కార్యదర్శి ఎం దేవదాసు, వీ రాజన్‌బాబు, కే రేణు, ఏఎస్ చలం, చావ రవి, టీఆర్‌ఎస్ నాయకుడు ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు.