Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉద్యోగులకు హెల్త్‌కార్డులు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం హెల్త్‌కార్డులు జారీచేయనున్నట్లు స్పష్టంచేశారు. బుధవారం నుంచే కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు ప్రతి కార్పొరేట్ దవాఖానలో అత్యాధునిక వైద్యసదుపాయాలు అందించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు.

-కేసీఆర్ దీపావళి కానుక -నేటి నుంచే కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం -నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదు -ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది -అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం: కేసీఆర్ -ఖజానాపై ఏడాదికి రూ.297 కోట్ల భారం -ఆరులక్షల మంది ఉద్యోగులకు ఆరోగ్య భద్రత -సీఎం చరిత్రాత్మక నిర్ణయాలు -ఉద్యోగసంఘాల నేతల హర్షం

KCR with Employees JAC

వైద్య ఖర్చులపై సీలింగ్ ఉండదని, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబసభ్యులని.. వారి ఆరోగ్య భద్రత కుటుంబపెద్దగా తనపై ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. మంగళవారం సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో హెల్త్‌కార్డులపై విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత లభించినట్లయింది.

దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.297 కోట్ల భారంపడే అవకాశం ఉందని ఈ సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆరేండ్లుగా ఎన్నో సమావేశాలు నిర్వహించినా సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులెవరూ పరిష్కరించలేకపోయిన సమస్యను సీఎం కేసీఆర్ నిమిషాల్లోనే పరిష్కరించి పరిపాలనాదక్షతను, మానవీయకోణాన్ని చాటిచెప్పారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొనియాడారు. తాము ఊహించినదానికన్నా ఎక్కువగా సీఎం వరాలు కురిపించడంపై వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు హెల్త్‌కార్డుల కోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. గత సమావేశాల్లో ఎన్జీవోలు రూ.90, గెజిటెడ్ అధికారులు రూ.120 ప్రీమియం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని.. అంతకన్నా ఎక్కువ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ సీఎంకు వివరించారు. అయితే నగదురహితంగా, సీలింగ్ లేకుండా కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించారని వాళ్లు కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఆయన ప్రతిపాదనను విన్న సీఎం.. ఉద్యోగుల నుంచి ప్రీమియం వసూలు చేస్తే ఎంత సొమ్ము వస్తుందని అధికారులను ప్రశ్నించగా.. రూ.86 కోట్ల వరకు ఉంటుందని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి తెలిపారు. ఉద్యోగులపై నయాపైసా భారం మోపవద్దని, ప్రీమియం పద్ధతులు వద్దేవద్దని సీఎం అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ పద్ధతిలోనే ఉద్యోగుల హెల్త్‌కార్డుల నియమనిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.

అటు ప్రభుత్వ దవాఖానాలన్నింటిలో కార్పొరేట్‌స్థాయి వైద్య సదుపాయాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సమావేశంలో సీఎం పేర్కొన్నారు. అందులోభాగంగానే ఉస్మానియా, గాంధీ దవాఖానాలను ఆధునికీకరించేందుకు రూ. 100 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శి శివశంకర్, కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ \రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సెక్రటరీ స్మితాసబర్వాల్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సతీశ్‌చందా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ధనంజయరెడ్డి,ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు,శాసనసభ్యులు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, టీఎస్‌పీఆర్టీయూ అధ్యక్షులు వెంకటరెడ్డి, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రతినిధులు రేచల్, ముజీబ్, కస్తూరి వెంకటేశ్వర్లు, రంగరాజు, తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ నరేందర్‌రావు, జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం, టీఎన్జీవో సెక్రటేరియట్ విభాగం అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణయాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీముద్దీన్, నాలుగోతరగతి ఉద్యోగులసంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, టీయూటీఎఫ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జహంగీర్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.