తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని, ఆప్షన్లను అంగీకరించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలన్నింటిపైనా టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నదని, ప్రతీ అంశాన్ని సునిశితంగా పరిశీలించి ఉద్యోగులకు అన్యాయం జరుగుకుండా బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు.

-విభజనలోఆప్షన్లు అంగీకరించే ప్రసక్తే లేదు -తెలంగాణలో ఇక్కడి ఉద్యోగులే పనిచేయాలి -ఉద్యోగుల డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుంది -టీ ఎన్జీవో నేతలతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ -ఆరు దశాబ్దాల అన్యాయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి -టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్
ఆప్షన్ల విషయంపై చర్చించేందుకు మంగళవారం టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి నేతృత్వంలో టీఎన్జీవో నేతలు కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. సోమవారం జరిగిన టీఎన్జీవో కార్యవర్గ సమావేశ తీర్మానాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకొంటామని టీ ఎన్జీవో నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రొవిజినల్ జాబితాలో కూడా స్థానికతే ఆధారంగా ఉండాలన్న ఉద్యోగుల విజ్ఞప్తికి టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఉద్యోగుల కోరికలన్నింటికీ రేపటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఆప్షన్లపై కేసీఆర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు మాత్రమే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఉద్యోగుల విభజనకు ఇప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయకపోవటం వెనుక కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. విభజన సందర్భంలో తెలంగాణలో జరిగిన ఆరు దశాబ్దాల ఉల్లంఘనలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోనల్, మల్టీజోనల్ స్థానాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరినీ తెలంగాణలోనే కొనసాగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్‌కు వివరించారు.
ప్రొవిజనల్ జాబితాకు తుదిరూపం ఇచ్చే సందర్భంలో విధిగా ఉద్యోగంఘాల జేఏసీ నేతలను సంప్రదించాలన్న డిమాండ్‌పై విభజన కమిటీలు స్పందించటం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల విభజనకు ఆంటిసిడెంట్, సర్వీస్‌బుక్‌లో నమోదు చేసిన స్థానికతే ప్రాతిపదిక కావాలని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరుపాలని, ఆ విచారణ ఆధారంగానే ఉద్యోగుల విభజన జరుగాలని డిమాండ్ చేశారు. కమల్‌నాథన్ కమిటీకి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి, గవర్నర్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పక్షాన వినతిపత్రాలు అందచేశామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు, హెచ్‌వోడీల సంఖ్య పెంపుదల, 20:10 శాతం కోటా లో వచ్చిన ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలన్నింటినీ తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. టీఎన్జీవో నేతల డిమాండ్లపై కేసీఆర్ స్పందిస్తూ తాత్కాలిక సర్దుబాటు కోసం కేంద్రం కొన్ని చర్యలు తీసుకొంటుందని, అవే ఫైనల్ కాదని సర్దిచెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతలను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు జరుగవని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేసేలా టీఆర్‌ఎస్ బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు చెప్పే అభ్యంతరాలన్నింటికీ టీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. గిర్‌గ్లానీ సిఫారసులు, జైభారత్‌రెడ్డి కమిషన్ తేల్చిన 58 వేల మంది ఉద్యోగుల వివరాలపై, ప్రొవిజినల్ జాబితాలో ఉండాల్సిన అంశాలపైన తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉన్నదని, ఉద్యోగులు చెప్పే అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసినవారిలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, ప్రధానకార్యదర్శి ప్రభాకర్, మహిళా విభాగం నేతలు బండారు రేచల్, విజయలక్ష్మి, శైలజ, కార్యవర్గ సభ్యులు రామినేని శ్రీనివాసరావు, ప్రతాప్, కస్తూరి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, రాంమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, సచివాలయం టీన్జీవో విభాగం అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ప్రవీణ్ తదితరులున్నారు.