– పిడమర్తి నాగరాజుకు మంత్రి కేటీఆర్ సాయం – లక్ష రూపాయల అందజేత – ప్రభుత్వ ఉద్యోగ కల్పనకు తక్షణ ఆదేశాలు

ఉద్యమవీరుని త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం మరచిపోలేదు. ఆపదలో ఆదుకుని తన కర్తవ్యాన్ని నిర్వహించి ప్రశంసాపాత్రమైంది. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పిడమర్తి నాగరాజు కుటుంబాన్ని అన్నివిధాలా అండదండగా ఉంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 2011లో ఉద్యమం సందర్భంగా నడిచే రైలుకు అడ్డంగా వెళ్లి వికలాంగుడైన నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, రాయినిగూడెంకు చెందిన నాగరాజు బుధవారం సచివాలయానికి వచ్చాడు. అటుగా వెళ్తున్నకేటీఆర్ డి-బ్లాక్ వద్ద నాగరాజును గుర్తించి దగ్గరకు వెళ్లి పలకరించారు. నాగరాజు దీనస్థితిని తెలుసుకుని వెంటనే వ్యక్తిగతంగా లక్షరూపాయలు సహాయం చేశారు. అంతేకాదు నాగరాజుకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ కమిటీలో క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనడమే కాదు అప్పటికప్పుడే మార్కెట్ కమిటీ కార్యదర్శితో మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. నాగరాజు కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన మంత్రి పద్మారావు సైతం నాగరాజును చూసి మాట్లాడారు.
నమ్మినజెండా కాపాడింది.. తనపట్ల మంత్రి కేటీఆర్ ఉదారత చూసి నాగరాజు ఉద్వేగానికి గురై ఆనంద బాష్పాలు రాల్చాడు. తనలాంటి ఉద్యమకారుల పట్ల మంత్రి చూపిన మమకారం, ఆప్యాయతను జీవితమంతా గుర్తుంచుకుంటాన్నాడు. పేదరికంలో ఉన్న తన కుటుంబానికి మంత్రి చేస్తున్న సహాయం చాలా గొప్పదన్నాడు. కేటిఆర్‌ను కలువడం తనకు తృప్తినిచ్చిందన్నాడు. ఉద్యమంలో తాను చేసిన త్యాగం ఫలించి తెలంగాణ వచ్చిందని, తన త్యాగానికి కూడా గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగమేగాకుండా ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సాయం కూడా అందేవిధంగా చూస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారని తెలిపాడు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న నాగరాజు నిరుపేద దళిత కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులు కూలిపనులు చేస్తున్నారు.
సోదరులు ఇద్దరు నిరుద్యోగులుగానే ఉన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు ఆగస్టు 15, 2011న మిర్యాలగూడెం రైల్వేపట్టాలపై పడుకున్నాడు. ఇది గమనించిన రైలు డ్రైవర్ వెంటనే బండిఆపి అతనిని కాపాడాడు. అప్పటికే రైలుఢీకొని నాగరాజు రెండుకాళ్లు, ఒక చెయ్యి పోయాయి. దవాఖానకు తరలించినా వైద్యం చేయించుకోవడానికి మొదట నిరాకరించాడు. తరువాత అందరి బలవంతంమీద చికిత్సకు ఒప్పుకుని బతికాడు. అతనిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవితాన్నిచ్చింది.