Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

-నెలాఖరుకల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి
-ఎవ్వర్నీ ఇడిసిపెట్టం.. బరాబర్‌ జవాబు చెప్తం
-పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది చిల్లర రాజకీయాలు
-ప్రజాశీర్వాదం ఉన్న టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేరు
-జీహెచ్‌ఎంసీలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా, టీఆర్‌ఎస్‌ పైనా ఎవరు మాట్లాడినా ఊరుకొనేది లేదని.. ఎవరినీ ఇడిసిపెట్టేది లేదని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని శక్తి అని నిర్వచించారు. మంగళవారం జలవిహార్‌లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్‌ ప్రణాళికను ఆవిష్కరించారు. కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అజేయమైన శక్తిగా టీఆర్‌ఎస్‌
టీఆర్‌ఎస్‌ ప్రారంభించిననాడు కేసీఆర్‌ వెనుక ఏమీ లేదు. గమ్యం ఎరుగని ప్రయాణంలో.. ‘లోగ్‌ జాతే రహే.. కార్వాన్‌ బన్‌తా గయా’ అన్నట్టు.. ఒక్కడుగా బయలుదేరి.. ఒక్కొక్కరుగా.. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. ఒక మహాసముద్రంలో వచ్చిన ఉప్పెన మాదిరిగా.. ఈరోజు టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. భారతదేశంలో మొత్తం మనవైపు చూసేలా మన పార్టీని సీఎం కేసీఆర్‌ అజేయమైన శక్తిగా తయారుచేశారు.


పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది సిల్లీ పాలిటిక్స్‌
ఇవ్వాళ చిల్లర నాయకులు మాట్లాడితే మనమెందుకు ఊరుకోవాలె? కొన్నికొన్నిసార్లు ఆవేశం వస్తది. ఎంత లేకి మాటలు! కేసీఆర్‌ కాలిగోటికి సరిపోని నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రి అనే జ్ఞానం లేదు. 2001 నుంచి 2014 వరకు ఎత్తిన జెండా దించకుండా ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు. తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలచిన మహా నేత. హనుమంతుడి ముందు కుప్పిగంతులేసినట్టు.. నిన్నమొన్న పుట్టిన చిల్లరగాళ్లు.. గింతున్నోళ్లు.. ఎగిరెగిరిపడుతున్నరు. పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది సిల్లీ పాలిటిక్స్‌.

పార్టీని పటిష్ఠం చేసుకొందాం
మన పార్టీ ఈ రోజు 60 లక్షల పైచిలుకు సభ్యులతో దేశంలో క్యాడర్‌బేస్డ్‌ పార్టీగా అత్యధిక సంఖ్య కలిగిన ప్రాంతీయ పార్టీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నం. ఒక్క హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలున్నాయి. మొన్ననే ఢిల్లీలో కూడా సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. ఇప్పుడు మనకేం ఎన్నికలు లేవు. హుజూరాబాద్‌ ఎన్నిక చాలా చిన్నది. దాన్ని మన లోకల్‌ నాయకులు చూసుకుంటారు. ఇబ్బందేంలేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఒకటుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సెప్టెంబర్‌ 20లోగా పూర్తిచేయాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశించారు. బస్తీ కమిటీలు, కాలనీ కమిటీలను పటిష్ఠం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

సీఎం కేసీఆర్‌కే ప్రజల ఆశీర్వాదం
70-75 ఏండ్లలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టును ఎందుకు కట్టలేదు? మహాకవి దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటే మన సీఎం కేసీఆర్‌ మూడున్నరేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును కట్టి ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’గా మార్చిన మహానేత. ఇవ్వాళ 3కోట్ల టన్నుల వరిధాన్యంతో భారతదేశానికి తెలంగాణ ధాన్యభాండాగారమైంది. మన పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంచేసిన పనుల్ని ఎక్కడికక్కడ మనం చెప్పుకోవాలె. పేద ప్రజల దీవెనలు. వారి ఆశీర్వాదాలు ఉన్నంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఏ పార్టీ ఏమీ చేయలేదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

పార్టీని నడిపించేది కార్యకర్తలే: కే కేశవరావు
పార్టీకి బలం.. బలగం కార్యకర్తలేనని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు చెప్పారు. సంస్థాగత నిర్మాణంలో స్థానిక నాయకత్వాలు కష్టపడ్డ ప్రతి ఒక్కరినీ గుర్తించి అవకాశాలు కల్పించాలని సూచించారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

ఇక ఇడిసిపెట్టేది లేదు
ఏడేండ్లు మాట్లాడుతుంటే ఓపిక పట్టినం..ఇగ ఓపిక పట్టం. బరాబర్‌ కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు సమాధానం చెప్పుడే.. వెనక్కిపోయేదే లేదు.. ఇక నుంచి మన నాయకుడు కేసీఆర్‌ మీద ఎవడైనా అడ్డం పొడుగు మాట్లాడితే.. వాడు ఒక్కమాటంటే మనం పది అనాలె. ఈట్‌ కా జవాబ్‌ పత్తర్‌ సే దేంగే.. ఇక నుంచి ఇడిసిపెట్టేదే లేదు. మొదట్లో ఊకున్నం.. కొత్త రాష్ట్రం వ్యవహారం చక్కబెట్టుకోవాలె కదా! అని చాలా ఓపికగా.. పద్ధతిగా.. సంయమనంతోని విపక్షమైనా.. ఏ పక్షమైనా అందరూ మనోళ్లే కదా అని ఊకున్నం. ఊకున్నకొద్దీ డైలాగులు ఎక్కువైపోతున్నవి. మాట్లాడే చిల్లరగాళ్లు కూడా ఎక్కువైపోతున్నరు. ఇకనుంచి మనం చేయాల్సినపని చేసుకుందాం. తెలంగాణలోని పేద ప్రజలు.. రైతులు అందరూ సంతోషంగా ఉన్నరు కాబట్టే మనల్ని కడుపునిండా ఆశీర్వదిస్తున్నరు. ఇవ్వాళ ఏ ఎలక్షన్‌ వచ్చినా.. గులాబి జెండాకు జై కొడుతున్నరు. బ్రహ్మాండంగా ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నరు.

త్వరలో నామినేటెడ్‌ పోస్టులు
పార్టీలో ముందునుంచి కష్టపడ్డ వాళ్లున్నరు. పదవులు రాక కొందరు ఇబ్బంది పడ్డరు. తొందర్లోనే నాలుగైదు వందల మందికి నామినేటేడ్‌ పదవులు రాబోతున్నాయి. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా.. డైరెక్టర్లుగా అవకాశం రాబోతున్నది. జీహెచ్‌ఎంసీలో కో-ఆప్షన్‌ పదవులను తొందరలోనే పూర్తిచేసే బాధ్యత నాది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్యాడర్‌కు ఉండే గౌరవం వేరు. ప్రజల్లో గౌరవాన్ని ఇచ్చేలా పార్టీ పదవులను నిర్వహించుకుందాం. జిల్లా, డివిజన్‌, బస్తీ కమిటీల్లో నాయకత్వం వహించే అవకాశం రావచ్చు. ఆ పదవికి వన్నే తెచ్చే బాధ్యత మనందరి మీదున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోషల్‌ మీడియా కమిటీలు వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. డివిజన్‌ స్థాయిలో 150 డివిజన్లలో చురుకైన యువతీ, యువకులతో ఈ కమిటీలు ఉండేలా చూడాలి. ఈసారి కమిటీలకు దసరా, దీపావళి తర్వాత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుకుందాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.