Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

-సభ్యులుగా విఠల్, మతీనుద్దీన్, చంద్రావతి.. నేడు బాధ్యతల స్వీకారం

KCR nominates Ghanta Chakrapani as a TPSC Chairman తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ప్రస్తుతానికి కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘ నేత సీ విఠల్, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతిలను నియమించారు. వీరి నియామకంపై జీవో 169ను ప్రభుత్వం బుధవారం రాత్రి జారీ చేసింది. కమిషన్ ఏర్పాటులో కీలకమైన కార్యదర్శి నియామకాన్ని ప్రభుత్వం మంగళవారమే పూర్తి చేసింది. స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన సీనియర్ అధికారి సుందర్ అబ్నార్‌ను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా మంగళవారం నియమించగా, ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ సభ్యులు ఆరేండ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. గురువారం ఉదయం 11 గంటలకు చక్రపాణి, ముగ్గురు సభ్యులు పదవీ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందు ఉదయం పది గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. కమిషన్ ఏర్పాటు, చైర్మన్, సభ్యుల ఎంపికపై తెలంగాణ సమాజం హర్షాతిరేకాలు ప్రకటించింది. సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ ఎంపికలు జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సకలజనుల సమ్మెకు నాయకత్వం వహించిన ముఖ్యనాయకులకు మంచి పదవులు లభించడంపట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమించడంపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి సంతోషం వెలిబుచ్చారు.

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (చైర్మన్) దళిత సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి జర్నలిజంతో జీవితాన్ని ప్రారంభించారు. జీవగడ్డ పత్రికలో చాలాకాలం ప్రస్తుత ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి పనిచేశారు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. ఉస్మానియా యూనివర్సిటీనుంచి పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సామాజిక శాస్ర్తాల ప్రొఫెసర్‌గా ఘంటా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంగా సైద్ధాంతికంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యాలను వివరించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ఉద్యమకాలంలో టీవీ చర్చాగోష్ఠుల్లో తెలంగాణ వ్యతిరేక వాదాలను సునిశితంగా ఎండగట్టి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ఘంటాపథంగా చాటారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీజేఏసీ చైర్మన్ కోదండరాంవంటి అనేక మంది ఉద్యమకారులతో కలిసి.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ ఉద్యమ పంథా నిర్మాణంలో దిశా నిర్దేశంలో వ్యూహ, ప్రతి వ్యూహాలలో మేధావులతో కలిసి పనిచేశారు. మలివిడత ఉద్యమం మొదలైన దగ్గర నుంచి ఆ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఉద్యమశక్తులను ఏకం చేసేందుకు విశేష కృషి సల్పారు.

ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించేందుకు అనేక సభలు, సమావేశాలు, సెమినార్లను వేదికగా చేసుకుని.. వేల ఉపన్యాసాలు ఇచ్చారు. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన వ్యక్తులకు ప్రాముఖ్యం కలిగిన పదవులు ఇచ్చే క్రమంలో ఘంటాకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ అవకాశం కల్పించారు. వాస్తవానికి రెండు, మూడు నెలల క్రితమే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి ఘంటా పేరు ఖరారైందని వార్తలు వచ్చాయి. అయితే.. చట్టపరమైన, సాంకేతిక కారణాలతో నియామకాలు జరుగలేదు. పేద దళిత కుటుంబంనుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్న మేధావి ఘంటా చక్రపాణి.

సీ విఠల్ (సభ్యుడు) టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన సీ విఠల్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మలివిడత తెలంగాణ పోరాటం మొదలైన 2001నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విఠల్ టీ ఉద్యోగ సంఘాల జేఏసీలో 2009నుంచి ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణకు చెందిన లక్ష ఉద్యోగాలలో ఆంధ్రా ఉద్యోగులు ఉన్నారని గిరిగ్లానీ కమిషన్ ఎదుట నిరూపించడానికి కావాల్సిన ముడిసరుకును అందించడంలో విఠల్ పాత్ర ప్రత్యేకమైనది. మెదక్ జిల్లాకు చెందిన విఠల్.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు.

మొదటినుంచి ఉద్యమ నేపథ్యం కలిగిన నేత. 370(1) (డీ) పైన, రాష్ట్రపతి ఉత్తర్వులు, గిరిగ్లానీ కమిషన్‌వంటి అనేక ఆంశాలపై మంచి పట్టుకలిగి, రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షించిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)కు నివేదికలు సమర్పించడంలో విఠల్ ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యోగులను ఢిల్లీ వరకు కదిలించడంలో ఆయన నాయకత్వం వహించారు. సకలజనుల సమ్మె కాలంలో విఠల్‌పై అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపింది. చివరి రోజుల్లో కూడా తన కుటిలబుద్ధిని వదులుకోని ఉమ్మడి ప్రభుత్వం.. ఇంటర్మీడియట్ బోర్డులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విఠల్‌ను ఈ ఏడాది జూన్ 1 తరువాత రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాకు బదిలీ చేసి వేధించింది. అయితే తీవ్ర నిరసనలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేయాల్సి వచ్చింది.

డాక్టర్ మతీనుద్దీన్ ఖాద్రీ (సభ్యుడు) ముస్లిం మైనారిటీ కోటాలో కమిషన్ సభ్యుడిగా నియమితులైన డాక్టర్ మతీనుద్దీన్ ఖాద్రీ.. హైదరాబాద్ పాతనగరంలోని ఈదీబజార్ ప్రాంతానికి చెందినవారు. ఆయన ప్రముఖ విద్యావేత్త. ప్రస్తుతం సుల్తాన్ ఉలుమ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ ముస్లిం సంస్థ తామిరే మిల్లత్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన పీహెచ్‌డీ పట్టా తీసుకున్నారు. గత 30 ఏండ్లుగా ఆయన ముస్లిం మైనారిటీల విద్యాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకోసం కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటుచేసి, వివిధ కోర్సులపట్ల అవగాహన కల్పించి, వారు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యేందుకు శిక్షణ అందిస్తున్నారు. ముస్లిం మైనారిటీల్లో ఆయనకు విద్యావేత్తగా పేరున్నది.

డాక్టర్ బానోతు చంద్రావతి (సభ్యురాలు) ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బానోతు చంద్రావతి.. ఖమ్మం జిల్లావాసి. 1984 ఆగస్టు 31న రాంమూర్తి, రాంబాయిలకు జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన చంద్రావతి.. 2009 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరానుంచి సీపీఐ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఐదేండ్లుపాటు శాసనసభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరి అదే స్థానంనుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు. చంద్రావతి భర్త సురేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.