‘పల్లెలు, పట్టణాల అభివృద్ధితోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. 21 రోజుల్లోనే ఇంటి అనుమతులు మంజూరుచేసే టీఎస్ బీపాస్ ఏప్రిల్2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చుకుందాం. పారిశుద్ధ్యంతోపాటు మొక్కలునాటి సంరక్షించే బాధ్యతను కార్పొరేటర్లు తీసుకోవాలి’ అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
-21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు -మెరుగైన సేవలందించేందుకే కొత్త మున్సిపల్ చట్టం -పనిచేయకపోతే కార్పొరేటర్లు ఇంటికి పోవుడే.. -ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి -ఖమ్మం, ఇల్లెందు పట్టణప్రగతి కార్యక్రమాల్లో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, వారికి మెరుగైన సులభతరమైన సేవలు అందించేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు మంజూరుచేసే టీఎస్‌బీపాస్ చట్టం ఏప్రిల్ 2వ తేదీనుంచి అమల్లోకి రాన్నునదని తెలిపారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందనేది సీఎం కేసీఆర్ ప్రగాఢ విశ్వాసమన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయమని.. అనంతరం ఎలాంటి వివక్ష లేకుండా అన్నిప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారని చెప్పారు. డివిజన్ పరిధిలో నాటిన మొక్కల్లో 80 శాతానికి తక్కువగా నమోదైతే కార్పొరేటర్ పదవి ఊడిపోతుందని హెచ్చరించారు. ఇది తమాషాకోసం తాను చెప్పడం లేదని వందకు వందశాతం అమలుచేసి తీరుతామని అన్నారు. ఆదివారం ఖమ్మం, ఇల్లెందు పట్టణప్రగతి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు సర్వాంగసుందరంగా, పరిశుభ్రంగా తయారుకావాలంటే ఒక్కో కార్పొరేటర్ ఒక్కో కేసీఆర్ కావాలని అన్నారు.
పట్టణప్రగతిలో పారిశుద్ధ్యంతోపాటు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలో మొత్తం గృహాల సంఖ్య, వాటిల్లో పెరుగుతున్న మొక్కలను లెక్కించి అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఇకనుంచి అధికారులు, కొర్పొరేటర్లు కలిసి మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే ఎవరుచెప్పినా వినబోనని.. సీఎం వద్దకు వెళ్లినా.. కోర్టు మెట్లెక్కినా పదవిని కాపాడుకోలేరని హెచ్చరించారు. మన పట్టణాన్ని మనమే బాగుచేసుకోవాలనే సామాజిక స్పృహ ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. ఆదర్శ పట్టణమంటే నాలుగు లైట్లు, రెండు ఫుట్‌పాత్‌లు, లకారం ట్యాంక్ కాదన్న మంత్రి పారిశుధ్య సమస్య లేకుండా ప్రజలకు అన్నిరకాల వసతులు కల్పించినప్పుడే నాగరిక నగరంగా ఆవిర్భవిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ బృహత్తరమైన ఆలోచన మేరకే పట్టణప్రగతి, పల్లెప్రగతి చేపట్టి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నామని తెలిపారు. పారదర్శకమైన పాలన, పౌరసేవలు, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, హరితహారం కార్యక్రమం వందశాతం అమలుపర్చడమే ప్రధాన ధ్యేయంగా పట్టణప్రగతి కొనసాగుతున్నదన్నారు. విదేశాలలో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారని, అతిక్రమిస్తే జరిమానాలు తీవ్రస్థాయిలో ఉంటాయని చెప్పారు. మనం నాగరిక సమాజంలో బతుకుతున్నామని, అటువంటి సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి తమ పట్టణాన్ని ఆదర్శపట్టణంగా తీర్చిదిద్దుకోవాలని హితవుపలికారు.

మనం మారుదాం.. పట్టణప్రగతి ప్రణాళికలో భాగంగా తొలుత ప్రజాప్రతినిధులం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మారుదామని, తర్వాత ప్రజల్లో మార్పును ఆశిద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. మన ఇల్లు బాగుంటే సరిపోదు ఆవాసం ఉంటున్న కాలనీ అంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. అన్ని డివిజన్లలో ఉన్నవారంతా ఈ విధంగా ప్రయత్నిస్తే పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చటం గొప్ప విషయమే కాదన్నారు. పొరుగునే ఉన్న రాష్టం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెతికినా చెత్తా, చెదారం, ప్లాస్టిక్ కంటికి కనిపించదన్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రమాణం చేసుకుని ముందుకు సాగుతున్నారని, అదేతరహాలో మనం కూడా మారాలని ఆకాంక్షించారు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపాలిటీ వారు ఇచ్చిన తడిపొడి చెత్తను ప్రత్యేక డబ్బాల్లో వేసి సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వాలని అన్నారు. చెత్తను అనేక ప్రాంతాలలో కాల్చి వేస్తున్నారని, దీనివల్ల అనేక విషవాయువులు గాలిలో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారుతాయని తెలిపారు.
తప్పుడు సమాచారమిస్తే కూల్చివేతే.. కొత్త మున్సిపల్‌చట్టాన్ని సీఎం కేసీఆర్ పౌరులు కేంద్రంగానే రూపొందించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తచట్టం ప్రకారం ఉదయం 5 గంటలకే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది డివిజన్లలో ఉండాలని.. ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తామంటే కుదరదని స్పష్టంచేశారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భవననిర్మాణానికి నయాపైసా లంచం ఇవ్వకుండా 600 చదరపు గజాలలోపువారు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 75 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎలాంటి అనుమతి లేకుండానే ఇల్లు నిర్మించుకోవచ్చని అన్నారు. భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని, గడువు దాటితే కమిషనర్ లేదా టౌన్‌ప్లానింగ్ అధికారి సంతకం పెట్టి పత్రాన్ని బట్వాడా చేస్తారని వెల్లడించారు.

ఎవ్వరైనా అధికారి లేదా ఉద్యోగి లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇచ్చి భవన నిర్మాణాలు చేపడితే కొత్తచట్టం ప్రకారం ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయనున్నట్టు తెలిపారు. ఇంటి పన్నుల చెల్లింపు విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ స్థలాన్ని తక్కువగా చూపించి ఇంటినిర్మాణం జరిపితే ఆకస్మిక తనిఖీలు జరిపి 25రెట్లు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. లంచాలు లేని పురపాలక పాలనను అందించేందుకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని అన్నారు. ప్రతినెలా నగరపాలక కౌన్సిల్ సమావేశాలు జరుగాలన్నారు. రెణ్నెళ్లకోసారి డివిజన్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కార్యాచరణ రూపొందించుకోవాలని చట్టం చెప్తున్నదన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని అంశాలను కరపత్రాలుగా ముద్రించి ఇంటింటికీ విధిగా అందించి అవగాహన కల్పించాలని సూచించారు. నిధులకు ఢోకాలేదని.. విధుల్లో ఉద్యోగులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్లాస్టిక్ నిషేధంపై ప్రధాన దృష్టి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇంటింటికీ జూట్ బ్యాగులు అందించాలని చెప్పారు. వరంగల్ నగరంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలవుతున్నదని పేర్కొన్నారు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని తెలిపారు. డివిజన్ల పరిధిలో సంబంధిత కార్పొరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ ఒక్కరూపాయికే నల్లాను ఏర్పాటుచేసి నీటిసరఫరా సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గర్భిణిగా ఉన్న నాటినుంచి.. గతంలో ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు కనిపించేవారని, నేడు సీఎం కేసీఆర్ పాలనలో అటువంటి పరిస్థితి లేదన్నారు. ఇదే సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. కులం, మతం తేడా లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచు పెండ్లికి రూ.లక్ష నూటాపదహారు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. మహిళ గర్భిణిగా ఉన్న నాటినుంచి ప్రసూతి వరకు ప్రభుత్వమే సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నదని, ప్రసవం తర్వాత రూ.13 వేలతోపాటు కేసీఆర్ కిట్‌ను కూడా అందిస్తున్నామని అన్నారు. బాలింతకు, పుట్టిన శిశువుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్డు, పాలు బాలామృతం సరఫరాచేస్తున్నట్టు తెలిపారు. పుట్టిన బిడ్డ పెరిగి పాఠశాలకు వెళ్లాక.. సీఎం మనమడు, మనుమరాలు తినే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటురంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు టీఎస్‌ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలను నెలకొల్పామని అన్నారు.
రైతుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతూ వారికి సాగునీరు అందిస్తూ, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ రేగాకాంతారావు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జెడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, ఆంగోత్ బిందు, లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్రకార్యదర్శి తాతా మధు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలు కట్టినందుకు రూ.లక్ష జరిమానా తన పర్యటన సందర్భంగా పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినవారిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ప్లాస్టిక్ నిషేధానికి కృషిచేస్తుంటే ఫ్లెక్సీలు కట్టడమేమిటని ప్రశ్నించారు. ఖమ్మంలో శాంతినగర్ జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు, 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఫ్లెక్సీలు కట్టారు. ఇల్లెందులో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వారిద్దరిపై అసహనం వ్యక్తంచేసిన కేటీఆర్.. రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. వారినుంచి జరిమానా వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మంలో కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా కార్పొరేటర్ మురళి బొకే ఇవ్వబోగా మంత్రి కేటీఆర్ నిరాకరించారు. ఫ్లెక్సీలు వద్దని చెప్పినా ఏర్పాటు చేసినందుకు మీరు అందజేసే గిఫ్ట్‌ను నిరాకరిస్తున్నట్టు వేదికపైనే ప్రకటించారు.
బస్సుదిగి.. బాధలు విని -చిన్నారి గొంతు చికిత్సకు కేటీఆర్ హామీ ఖమ్మంలో బాస్కెట్‌బాల్ ఇండోర్‌స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బస్సుఎక్కిన మంత్రి కేటీఆర్.. జనం మధ్యలో ఓ చిన్నారిని ఎత్తుకున్న తండ్రిని చూసి కిందకు దిగారు. ఆయనను దగ్గరకు పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కూతురు ప్రీతి (7) గొంతు సమస్యతో బాధపడుతున్నదని.. డబ్బులు లేక అపరేషన్ చేయించలేకోతున్నామని ముదిగొండ మండలం మాధాపురంకు చెందిన మల్లెల ఉపేందర్ దంపతులు మంత్రికి వివరించారు. దీంతో చలించిన కేటీఆర్.. తక్షణ వైద్యసేవల కింద రూ.10వేలు అందించారు. మెరుగైన వైద్యసేవలు, సీఎం రిలీఫ్‌ఫండ్ కింద శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారికి వైద్యసేవల అంశాన్ని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌కు అప్పగించారు. దీంతో చిన్నారి, తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు చిన్నారి తండ్రికి ఫోన్‌చేసి తన కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు.
భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అనుమతి మంజూరవుతుంది. గడువు దాటితే అనుమతిపత్రం ఇంటికే బట్వాడా అవుతుంది. తప్పుడు సమాచారమిస్తే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడమూ జరుగుతుంది. ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరం మారుదాం. తర్వాత ప్రజల్లో మార్పును ఆశిద్దాం. మనఇల్లు ఒక్కటే బాగుంటే సరిపోదు.. ఆవాసం ఉంటున్న కాలనీఅంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన ప్రతిఒక్కరిలో ఉండాలి. అలా అనుకుంటే స్వచ్ఛ నగరాన్ని నిర్మించటం గొప్ప విషయమేమీ కాదు.
పరిశుభ్రత, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి. అపరిశుభ్రత కారణంగానే ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. చెత్తను అనేకప్రాంతాల్లో కాల్చివేస్తున్నారు. దీనివల్ల విషవాయువులు గాలిలో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారుతాయి.