Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్ యోధులు వీరే!

-లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
-జాబితాలో సామాజిక సమతూకం
-ఎనిమిదిమంది బలహీనవర్గాలవారికి..
-ఇద్దరు మహిళలకు అవకాశం
-ఏడుగురు సిట్టింగ్‌లకు మళ్లీ చాన్స్..
-ఎమ్మెల్సీ బరిలో గుత్తా, నవీన్‌కుమార్

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ యోధులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ విధేయత, విజయావకాశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారుచేసినట్టు సమాచారం. అదే సమయంలో సామాజిక సమతూకం పాటించారు. ఎస్టీ, ఎస్సీల్లో ఉపకులాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్టీల్లో ఆదివాసీ, లంబాడాలకు, ఎస్సీల్లో మాదిగ, నేతకానివారికి సీట్లను కేటాయించారు. ఓసీల్లో కమ్మ, వెలమ, రెడ్లకు సీట్లు కేటాయించారు. ఎస్టీ రిజర్వుడు స్థానాలు రెండు ఉండగా వాటిలో ఒకటి ఆదివాసీలకు, మరొకటి లంబాడాలకు ఇచ్చారు. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకుగాను రెండింటిలో మాదిగలకు, ఒక స్థానంలో నేతకానివారికి అవకాశం కల్పించారు. బీసీ వర్గాలవారికి భువనగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. మిగిలిన ఎనిమిది సీట్లలో ఐదుగురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వెలమలకు అవకాశం దక్కింది. మొత్తంగా ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సీతారాంనాయక్ (మహబూబాబాద్), ఏపీ జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ)కి సీట్లు కేటాయించలేదు. అయితే.. గుత్తాను ఎమ్మెల్సీ బరిలో నిలుపాలని నిర్ణయించారు.

బీ ఫారాలు అందజేత
పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఎంపికైనవారికి గురువారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీఫారాలు అందజేశారు. ఆయా అభ్యర్థుల వెంట సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో అందరినీ సమన్వయంచేసుకొని విజయం సాధించాలని వారికి సీఎం చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో గెలువాలని సూచించారు.

అన్న ప్రోద్బలంతో రాజకీయాల్లోకి..
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన మన్నె శ్రీనివాస్‌రెడ్డి 1959లో సోమేశ్వరమ్మ, అచ్చిరెడ్డి దంపతులకు జన్మించారు. స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంట. అన్న, ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీ అధినేత సత్యనారాయణరెడ్డి అన్న ప్రోద్బలంతో 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పీఏసీఎస్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2006 లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా..
బోయినపల్లి వినోద్‌కుమార్ 1959, జూలై 22వ తేదీన జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 70వ దశకంలోనే సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. 2004లో హన్మకొండ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచారు. 2008లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిపొందారు. హన్మకొండ నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్‌డ్ కావడంలో 2009లో కరీంనగర్‌లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014లో అక్కడి నుంచే గెలుపొందారు. ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల కరీంనగర్ సభలో ఫెడరల్‌ఫ్రంట్ అధికారంలోకి రాగానే వినోద్‌కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు.

స్వచ్ఛంద సంస్థలతో సామాజిక సేవ..
బొర్లకుంట వెంకటేశ్ నేతకాని 1976 జూన్ 16న జన్మించారు. ఎంకాం, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ(లా) చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆయన పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువతకు ఉచిత శిక్షణ అందించారు. తెలంగాణ నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సొసైటీ ఏర్పాటు చేశారు. 2007లో గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. పదోన్నతిపై డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్‌గా కరీంనగర్‌లో విధులు నిర్వర్తించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
కొత్త ప్రభాకర్‌రెడ్డి 1966, జూన్ 6వ తేదీన సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం పోతారంలో జన్మించారు. బీఏ పూర్తిచేశారు. రవాణారంగంలో వ్యాపార అనుభవం ఉన్నది. 2007 నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించినా పోటీచేసే అవకాశం దక్కలేదు. 2014లో మెదక్ లోక్‌సభకు కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీఅయిన స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. గడిచిన అయిదేండ్లలో పార్లమెంటులో అనేక అంశాలపై కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.

గులాబీ దండులో క్రియాశీలకం
హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌కు చెందిన పుస్తె శ్రీకాంత్ 1972 నవంబర్ 14న జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 1994 నుంచి క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. శ్రీకాంత్ తండ్రి బాబూరావు 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీడీపీ తరపున పోటీచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ప్రజాసేవలో అపార అనుభవం..
గోడం నగేశ్ 1964 అక్టోబర్ 21న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంఈడీ పూర్తిచేశారు. 1989 నుంచి 94 వరకు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 1994లో బోథ్ అసెంబ్లీ నుంచి గెలుపొంది.. టీడీపీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమఅభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా, గిరిజన కోఆపరేటివ్ కార్పోరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకు పీఏసీ మెంబర్‌గా, 2001 నుంచి 2003 వరకు 610జీవో హౌజ్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. 2010 నుంచి 2014 వరకు అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీలో పనిచేశారు. హెచ్చార్డీ బడ్జెట్ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా కొనసాగారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. పార్లమెంట్‌లో బొగ్గు ఖనిజాల స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు.

వైద్యనిపుణుడు.. చురుకైన ఎంపీ
భువనగిరి పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వరుసగా రెండోసారి పోటీచేయనున్నారు. ఆయన రాజమ్మ, లక్ష్మయ్య దంపతులకు 1959 మార్చి 2న సూర్యాపేటలో జన్మించారు. ఎంబీబీఎస్, ఎమ్మెస్ పూర్తిచేసి డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో డాక్టర్ల జేఏసీ తరఫున చురుకుగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆమరణదీక్షకు స్పందించి 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా సీఎం కేసీఆర 2014లో భువనగిరి టికెట్ కేటాయించారు. ఎంపీగా మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన బూర.. ఐదేండ్లలో 210 ప్రశ్నలను లేవనెత్తారు. 10 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ కింద రూ.15.6 కోట్లు కేటాయించారు. భువనగిరికి కేంద్రీయ విద్యాలయం, బీబీనగర్‌కు ఎయిమ్స్ వచ్చేలా కృషిచేశారు. తన బీఎల్‌ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు రూ.1.5 కోట్లకు పైగా సొంత డబ్బు వ్యయం చేసి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు.

లష్కర్ యువకిరణం..
తలసాని సాయికిరణ్ యాదవ్ (33) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు. 1986లో మే 13న జన్మించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో ఎంబీఏ విద్యనభ్యసించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆశాకిరణ్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తర్వాత సాయికిరణ్ తలసాని సాయి సేవాదళ్‌ను ప్రారంభించి సనత్‌నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు.

ఎల్లవేళలా పార్టీ విధేయుడు
నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు దాదాపు 25 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు. 1952లో పోతుగంటి ఎల్లమ్మ, నాగయ్య దంపతులకు జన్మించారు. ఆయన మార్కెటింగ్ శాఖలో కార్యదర్శిగా ఉద్యోగం చేశారు. మాజీ మంత్రి మహేంద్రనాథ్ స్ఫూర్తిగా 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరఫున అచ్చంపేట అసెంబ్లీకి పోటీచేసి వరుసగా 1994, 1999, 2004లో గెలుపొందారు. 2001-2004 మధ్య రాష్ట్ర క్రీడలశాఖ మంత్రిగా పనిచేశారు. 2014ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజాభిప్రాయం, నియోజక అభివృద్ధి కోసం గత ఏడాది టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీకి విధేయులుగా ఉంటూ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్ఠానికి కృషిచేశారు. సీఎం కేసీఆర్ ఆయన పనితీరును గుర్తించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

పార్టీ విస్తరణకు విశేష కృషి
డాక్టర్ రంజిత్‌రెడ్డి 1964 సెప్టెంబర్ 18న వరంగల్‌లో జన్మించారు. ప్రాథమిక, మాధ్యమిక విద్య అక్కడే పూర్తిచేశారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్‌లో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ విద్యనభ్యసించారు. తొలినాళ్లలో పౌల్ట్రీ పరిశ్రమలో టెక్నికల్ అడ్వయిజర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనంతరం పౌల్ట్రీరైతుగా ఎదిగారు. 1996లో ఎస్సార్ హేచరీస్ సంస్థను ప్రారంభించారు. తెలంగాణ పౌల్ట్రీ, బ్రీడర్స్ అసొసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడంతోపాటు, ఆర్వీ మెడికల్ కళాశాల, ఎంఆర్ మెడికల్ కళాశాలలకు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2004లో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుని పార్టీ విస్తరణకు కృషిచేశారు.

కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి..
జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వరుసగా రెండోసారి అదే స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన పూర్తిపేరు భీంరావు బసంత్‌రావు పాటిల్. 1955 నవంబర్ 1న కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో హన్ముబాయి పాటిల్, బసంత్‌రావు పాటిల్ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ వరకు చదివి.. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉద్యమంలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటినుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేస్తున్నారు.

రికార్డుస్థాయి మెజార్టీ ఘనత
పసునూరి దయాకర్ వరుసగా రెండోసారి వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన 1967 ఆగస్టు 2న కమలమ్మ, ప్రకాశం దంపతులకు జన్మించారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2001లో వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2012లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2015లో మాజీ డిప్యూటీసీఎం కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ టీఆర్‌ఎస్ తరఫున పోటీచేశారు. రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందారు. నాలుగేండ్లుగా విశేష సేవలందించారు.

సుపరిచిత నేత..పారిశ్రామికవేత్త..
ఖమ్మం అభ్యర్థిగా ఖరారైన నామా నాగేశ్వర్‌రావు వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా సుపరిచితుడు. స్వస్థలం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి. వరల క్ష్మి, ముత్తయ్య దంపతులకు 1958 మార్చి 15న జన్మించారు. నాగేశ్వర్ రావు తన తండ్రి పేరుతో నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవ చేస్తున్నారు. మొదటిసారి 2004లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ తరఫున బరిలో నిలిచి గెలుపొందారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. 2014లో మరోసారి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

వ్యాపారవేత్త.. రాజకీయనేత
ఓవైపు వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ, మరోవైపు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డి నల్లగొండ లోక్‌సభ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా మనుగోడు మండలం చల్మెడ. రామనర్సమ్మ, లింగారెడ్డి దంపతులకు 1955 సెప్టెంబర్ 3న జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, పెరిగిన నర్సింహారెడ్డి.. హెచ్‌ఎంటీ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 1997 నుంచి స్నేహిత అగ్రి బయోటెక్ ఎండీగా కొనసాగుతున్నారు. 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయన టీఆర్‌ఎస్‌లో కొసాగుతున్నారు.

కలుపుగోలు నాయకురాలు
మాలోతు కవిత ఉమ్మడి వరంగల్ జిల్లా మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో 1979 డిసెంబర్ 31న జన్మించారు. బీఎస్సీ కంప్యూటర్ పూర్తిచేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కూతురు. 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ కార్యదర్శిగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం కలిగిన నాయకురాలిగా పేరు సంపాదించారు.

విద్యావేత్త.. వైద్యసేవ
మర్రి రాజశేఖర్‌రెడ్డి 1976 జూన్ 17న జన్మించారు. విద్యావేత్తగా సుపరిచితుడు. రా్రష్ట్రమంత్రి చామకూర మల్లారెడ్డికి స్వయానా అల్లుడు. బోయిన్‌పల్లిలో పుట్టి పెరిగిన ఆయన, బీకాం విద్యనభ్యసించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చైర్మన్‌గా, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వైస్‌చైర్మన్‌గా, సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వైద్యశిబిరాల నిర్వహణ సహా పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. గత ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషించారు.

తెలంగాణ బతుకమ్మ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. కరీంనగర్‌లో జన్మించిన కవిత హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. వీఎన్నార్‌విజ్ఞాన్‌జ్యోతిలో ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశారు. ఆ తర్వాత మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు అమెరికా వెళ్లారు. 2003లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ను వివాహమాడారు. 2004లో ఇండియాకు తిరిగివచ్చి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతికంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో చురుకుగా వ్యవహరించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్‌లో అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడి రాజకీయ ఉద్దండుల ప్రశంసలు పొందారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఇటీవలే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. టీఆర్‌ఎస్‌కు అంతర్జాతీయంగా ప్రతి దేశంలో శాఖల ఏర్పాటుకు కృషిచేస్తున్నారు.

టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా
ఆదిలాబాద్ : గోడం నగేశ్
పెద్దపల్లి : బొర్లకుంట వెంకటేశ్ నేతకాని
కరీంనగర్ : బోయినపల్లి వినోద్‌కుమార్
నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
జహీరాబాద్ : బీబీ పాటిల్
మెదక్ : కొత్త ప్రభాకర్‌రెడ్డి
మల్కాజ్‌గిరి : మర్రి రాజశేఖర్‌రెడ్డి
చేవెళ్ల : డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి
సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్‌యాదవ్
మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూలు : పోతుగంటి రాములు
నల్లగొండ : వేమిరెడ్డి నర్సింహారెడ్డి
భువనగిరి : డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
వరంగల్ : పసునూరి దయాకర్
మహబూబాబాద్ : మాలోతు కవిత
ఖమ్మం : నామా నాగేశ్వర్‌రావు
హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.