-మేం పాలకులం కాదు.. సేవకులం -టీఈఈఏ సదస్సులో మంత్రి ఈటెల

టీఆర్‌ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ కాదు.. సర్వీస్ పార్టీ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తాము పరిపాలకులం కాదు.. సేవకులం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఎర్రగడ్డలోని జెన్‌కో ఆడిటోరియంలో తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్ సవాళ్లు- ఇంజినీర్ల పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి ఈటెల ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంతకాలం మన సొమ్ముతో సీమాంధ్రవాళ్ళు సోకులు చేశారని, ఇక వారు సోకులు చేసే కాలం చెల్లిపోయిందన్నారు. టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు చెందిన రూ. 46,650 కోట్లతో సీమాంధ్రలో జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించారని, ఆ డబ్బును తమకు చెల్లిస్తే సీమాంధ్ర నుంచి ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా తీసుకోబోమని సవాల్ చేశారు.
టీఈఈఏ సలహాదారు నీలం జానయ్య మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలుగా ఉండి తెలంగాణకు తీరని అన్యాయం చేసిన అజయ్‌జైన్, విజయానంద్, సాయిప్రసాద్‌లపై సీబీఐ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి స్వామిరెడ్డి, ముఖ్య సలహాదారు మోహన్‌రెడ్డి, టీఈఈఏ నాయకులు సంపత్‌రావు, మధుసూదన్‌రెడ్డి, చంద్రయ్య, సమ్మయ్య, రవి, సుశీల్, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, భద్రయ్య, శ్రీరాంనాయక్, జగత్‌రెడ్డి, బాలరాజ్, రాజు, రమణకిరణ్, వాణి, మాధవి, పెంటారెడ్డి, దేవదాసు, విష్ణుమూర్తి, బాలాజీ నాయక్, సురేందర్, విశ్వనాథ్, గుప్తా, వివేక్, ప్రవీణ్, కష్ణయ్య పాల్గొన్నారు.