-రూ.20.27 కోట్ల సభ్యత్వ రుసుము జమ -20 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు త్వరలోనే గుర్తింపుకార్డులు -సభ్యత్వ నమోదులో గజ్వేల్ నియోజకవర్గం టాప్ -ప్రభుత్వంపై ఆ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు -పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఎన్నికలు, పార్టీ కార్యాలయాల నిర్మాణంపై సమీక్ష బీజేపీతో అయ్యేదేంలేదు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో అయ్యేదేంలేదని, ప్రభుత్వంపై అసత్యప్రచారంతోపాటు, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్న మాటలతోనే ఆ పార్టీ బలమేమిటో అర్థమవుతున్నదన్నారు. గురువారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డాటా ఎంట్రీ, కమిటీల ఎన్నికలు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల స్థితిగతులపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరుకల్లా పార్టీ కమిటీలన్నింటి ఎన్నికలను పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తీసుకొన్న సభ్యత్వ పుస్తకాలను ఈ నెల 25 వరకు తిరిగి ఇచ్చేయాలని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలను దసరానాటికి పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వ నమోదుకు కృషిచేసిన పార్టీ నాయకులను, నియోజకవర్గ ఇంచార్జీలను, డాటా ఎంట్రీ ఇంచార్జీలను కేటీఆర్ అభినందించారు.

ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీయే మేలు రాష్ట్రంలో ప్రభుత్వంపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అమలుచేయడంలేదంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారని, ఈ పథకంకంటే ఆరోగ్యశ్రీ అన్నివిధాలుగా మెరుగ్గా ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని పథకానికి ఉద్యోగులు, జర్నలిస్టులతోపాటు మరో 75 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని తెలిపారు. ఆయుష్మాన్‌భారత్ పథకం కింద 25లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఆరోగ్యశ్రీ కింద 75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీలు స్థానాలు గెలిచిన బీజేపీ.. ఆ తరువాత జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో ఏడు జెడ్పీటీసీలకే పరిమితమైందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారని వారిని గట్టిగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ నెలాఖరుకల్లా కమిటీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వం నమోదయిందని.. ఇందులో 20 లక్షలమంది క్రియాశీల కార్యకర్తలున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమావేశానంతరం ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, సత్యవతి రాథోడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, పార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణితో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించి త్వరలో క్రియాశీల కార్యకర్తలందరికి గుర్తింపుకార్డులు జారీచేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 25 కల్లా సభ్యత్వ పుస్తకాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని కేటీఆర్ స్పష్టంచేసినట్లు పల్లా చెప్పారు. సభ్యత్వ నమోదులో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం 90,575 సభ్యత్వంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని, ఆ తరువాత మేడ్చల్ నియోజకవర్గం 80,175తో రెండోస్థానంలో, 74,650తో పాలకుర్తి నియోజకవర్గం మూడోస్థానంలో నిలిచిందన్నారు. దాదాపుగా అత్యధిక నియోజకవర్గాల్లో 50 వేల సభ్యత్వ నమోదు అయిందన్నారు. సభ్యత్వం అయిన వాటిల్లో 52 లక్షల సభ్యత్వం డాటా ఎంట్రీ పూర్తయిందని పేర్కొన్నారు. ఈనెల 31 నాటికి డాటా ఎంట్రీ పూర్తికావాలని, గ్రామ, మండల కమిటీలు, అనుబంధ సంఘాల ఎన్నికలు ఈ నెలాఖరుకు పూర్తిచేసి.. నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారని తెలిపారు.

రూ.20.27 కోట్లు జమ ఇప్పటివరకు సభ్యత్వ నమోదు ద్వారా రూ. 20,27,60,950 జమ అయ్యాయని పల్లా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుసహా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు మరెక్కడా అమలుకావడంలేదన్నారు. ఆసరా పింఛన్ల కింద రూ.3,016, రూ.2,016, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యు త్ లాంటి అనేక అద్బుతమైన పథకాలు దేశంలో ఎక్కడా అమలుకావడంలేదన్నారు. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదని గుర్తుచేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 80 శాతం స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని పల్లా చెప్పారు. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు కోర్టుకు వెళ్లి ఎన్నికల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు.