శాసనమండలి నూతన సభ్యులుగా టీఆర్‌ఎస్‌కు నలుగురు బుధవారం ప్రమాణం చేశారు. స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన నవీన్‌కుమార్‌తో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. అనంతరం వారిని అభినందించారు. తొలుత కొత్త ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి.. అక్కడినుంచి మండలి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో శాసనమండలి కార్యాలయం సందడిగా మారింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి వేర్వేరుగా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం తనవంతు కృషిచేస్తానని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రమాణం చేసిన ఎమ్మెల్సీలను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి అభినందించారు.
