Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్‌కు ఇది అఖండ విజయం

-స్థానిక ఎన్నికల ప్రస్థానంలో చారిత్రాత్మకం
-ఎన్నిక ఏదైనా కేసీఆర్ మా నాయకుడంటున్న ప్రజలు
-తెలంగాణ ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు
-ఈ తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది
-ప్రజల మూడ్ మార్పునకు కారణాలను విశ్లేషించాలి
-పరిషత్ ఫలితాలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన

రాష్ట్రం లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్ పార్టీకి అఖండమైన, అపూర్వమైన విజయాన్ని అందించడమనేది దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభివర్ణించారు. వంద శాతం జెడ్పీ పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకోవడమనేది తనకు తెలిసి ఎన్నడూ ఏ పార్టీ కూడా సాధించని ఘనత అని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మంగళవారం సాయంత్రం కేటీఆర్.. మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేకానంద, మాగంటి గోపీనాథ్, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణితో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే పరిషత్ ఎన్నికలు ఎదుర్కొని నిజామాబాద్, కరీంనగర్ జెడ్పీ పీఠాలను గెలుచుకొన్నది. నాటి నుంచి టీఆర్‌ఎస్‌కు ఇవి ఐదో స్థానిక ఎన్నికలు. కానీ టీఆర్‌ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. ఈ ఘనతను సాధించిపెట్టిన గులాబీ సైన్యానికి.. మాకు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నిక ఏదైనా సరే.. బ్యాలెట్ పద్ధతిలో జరిగినా, ఈవీఎంల ద్వారానైనా కేసీఆర్ మా నాయకుడని నిర్దంద్వంగా ప్రజలు తీర్పునిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

శ్రీనివాస్‌రెడ్డిది ఆస్వాదించదగిన విజయం
నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు తేర చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. పోలైన ఓట్ల లో 96% ఓట్లతో సాధించిన విజయం ఆస్వాదించదగిందన్నారు.

కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టిన ప్రజలు
రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలు, 564 పైచిలుకు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల డిసెంబర్‌లో ఏ తీర్పునైతే ఇచ్చారో అదేరకంగా తీర్పునిచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లువేసి 75% స్థానాలు కట్టబెట్టినట్లే.. పరిషత్ ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వకంగా.. వినయంగా.. వినమ్రంగా శిరస్సువంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పారు. రాష్ట్రంలోని చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను ఏ ఇతర పార్టీ.. మరే ఒక్కరి మద్దతులేకుండా టీఆర్‌ఎస్ స్వయంగా కైవసం చేసుకోబోతున్నదన్నారు. ఆరుజిల్లాల్లో ప్రత్యర్థులు ఖాతా కూడా తెరువలేదని (వరంగల్ రూరల్-16, కరీంనగర్-15, మహబూబ్‌నగర్-14, జనగాం-12, జోగుళాంబ గద్వాల-12, వరంగల్ అర్బన్ -7), మరో ఆరు జిల్లాల్లో ఒక్క సీటు మాత్రమే వచ్చిందని (సిద్దిపేటలో-23కు 22, కు మ్రంభీం ఆసిఫాబాద్-15కు 14, వనపర్తి-14కు 13, రాజన్న సిరిసిల్ల-12కు 11, ములుగు-8కు 7) తెలిపారు.

ప్రజాతీర్పే శిరోధార్యం
జీహెచ్‌ఎంసీలో 99 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించినట్లే.. ఈరోజు 32 జెడ్పీలను గెలుచుకొన్నామని, 90 శాతానికి పైగా ఎంపీపీలను గెలుచుకోబోతున్నామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలామంది చాలా మాటలు మాట్లాడినారని, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ప్రజాతీర్పు శిరోధార్యమని చెప్పారు. ఎన్నికలు ఏదైనా ప్రజల మూడ్‌కు నిదర్శనమని, పార్లమెంట్ ఎన్నికల్లో 16 గెలుస్తామని ఆశించినప్పటికీ అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని.. అయినంతమాత్రాన తాము బాధపడలేదన్నారు. దేశం మూడ్ ఒకలా ఉన్నది. నరేంద్రమోదీ ప్రధాని కావాలని అనుకున్నరో.. ఇంకేమనుకున్నరో కానీ ఒకరకమైన తీర్పునిచ్చారు. అయినా మాకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఈరోజు క్షేత్రస్థాయి ఎన్నికలు వచ్చేసరికి సీఎం కేసీఆర్ పట్ల విశ్వాసం చూపించారు. ఇంత ఏకపక్షంగా తీర్పు ఉంటుందని చివరకు ప్రతిపక్షాలు కూడా ఊహించి ఉండవు అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే ఎగిరిపడటం, ఓడిపోగానే కిందపడిపోవడం మంచిది కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీలు గెలిచిందని, ఇప్పుడు నాలుగో, ఐదో జెడ్పీటీసీలు గెలిచిందని గుర్తుచేశారు.

ప్రజల మూడ్‌ను విశ్లేషించాలి
పార్లమెంటు ఎన్నికల్లో ఓటేసిన వాళ్లే.. పరిషత్ ఎన్నికల్లోనూ ఓటేశారని.. రెండింటి మధ్య ప్రజల మూడ్ ఎలా మారిందనేది విశ్లేషించాలని కేటీఆర్ చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు టీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఆ మూడు పార్లమెంటు పరిధిలోని అన్ని జెడ్పీ స్థానాలను ఇవాళ మేం గెలిచినం. జగిత్యాల జిల్లాలో 18 జెడ్పీటీసీల్లో 17 టీఆర్‌ఎస్ గెలుచుకుంది. కానీ నిజామాబాద్ పార్లమెంటు ఓడిపోయింది. సిరిసిల్లలో 12లో 11 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నా కరీంనగర్ పార్లమెంటు స్థానం ఓడిపోయాం. ఎందుకు జరిగిందనేది మేంగానీ, మేధావులుగానీ ఆలోచించాలి. ప్రజల మూడ్ ఎందుకు మారిందనేది విశ్లేషించాలి. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్.. దేశస్థాయిలో బీజేపీ ఉండాలని కోరుకున్నారా? అనేది సమీక్షించాలి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇంచార్జిలు కార్యక్షేత్రంలోనే ఉండాలి
32 జిల్లాలకు ఇంచార్జిలను వేసుకున్నామని, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, ఇతర పదవుల ఎన్నికలు ముగిసేవరకు ఎవరూ కూడా కార్యక్షేత్రాన్ని వదలకుండా ఎక్కడివారు అక్కడే ఉండి పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తిచేయాలని కేటీఆర్ సూచించారు.

ఆ రెండు చోట్ల గులాబీ జోరు
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ఏడింటిలో ఐదు జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్ గెలుచుకున్నదని, నియోజకవర్గంలో ఐదువేల పైచిలుకు మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చిందని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఐదింట నాలుగు జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్ గెలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మెజార్టీలు కూడా ఆరువేల నుంచి తొమ్మిది వేల వరకు చాలా భారీ మెజార్టీలు వచ్చాయని తెలిపారు. మేం గెలిచినపుడు ఎట్లున్నమో ఓడినపుడు కూడా అట్లున్నం. అనేక ఉత్థాన పతనాలను టీఆర్‌ఎస్ చూసింది. 18-19 ఏండ్లలో ఒక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమోనన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మా పార్టీ నాయకుడు కేసీఆర్ మాత్రం విజయం వచ్చినపుడు గర్వపడొద్దు, ఓటమి వచ్చినపుడు కుంగిపోవద్దని ఒకటే మాట చెప్తరు. ఈరోజు ప్రజలు మనకు ఇచ్చింది గెలుపు కాదు.. బాధ్యతని విజయాన్ని ఆస్వాదిస్తున్న టీఆర్‌ఎస్ లక్షలమంది కార్యకర్తలకు విజ్ఞప్తిచేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.