రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. వనరులున్నా 60 ఏండ్లుగా వెనుకపడేయబడిన రాష్ర్టాన్ని 16 నెలల్లో అభివృద్ధి బాట పట్టించిన టీఆర్‌ఎస్‌కే వరంగల్ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు ఉన్నది. దశాబ్దాలపాటు అధికారంలో ఉండి తెలంగాణకు ఏమీ చేయని కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశ్నించారు.

ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు: డిప్యూటీ సీఎం కడియం.. దయాకర్‌కు భారీ మెజార్టీ ఖాయం: మంత్రి ఈటల.. అడ్రస్ లేనోళ్ల మాటలు పట్టించుకోవద్దు: మంత్రి పోచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి, గవిచర్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని కేంద్రప్రభుత్వం చిన్నచూపుచూస్తున్నదన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఎవరూ చేయని విధంగా పేదలకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమ లు చేస్తున్నదని, సంగెం మండలవాసి అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని ఓటర్లను కోరారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ప్రచారంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు చెప్తూ ఓట్లడగాలి: మంత్రి పోచారం విపక్షాలవి రాజకీయ విమర్శలు. గత ఎన్నికల్లో ఓడిపోయి అడ్రస్ గల్లంతైన వారి మాటలు పట్టించుకోవద్దు. ఇప్పుడు మళ్లీ వచ్చి ఓట్లడుగుతున్నారు. వాళ్లు ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసుఅని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తూ అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అద్భుతపథకాలు ప్రవేశపెట్టారని, వీటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లడగాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, చెన్నాపురం, దమ్మన్నపేటల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం భూపాలపల్లిలో ప్రచార వారధి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పత్రి ఇంట్లో ఎవరో ఒకరికి లబ్ధి చేకూరుతున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. దేశాన్ని ఆకర్షిస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం, డబుల్‌బెడ్ రూం ఇండ్ల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు అవసరాలను గుర్తిస్తూ పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, సిరికొండ క్రాంతికుమార్ పాల్గొన్నారు.
ఇంటి దొంగలకు బుద్ధి చెప్పాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణ ప్రజల హక్కులను ఆంధ్రాపాలకుల మోకాళ్ల వద్ద తాకట్టు పెట్టాలని, వారికి తాబేదార్లుగా మారి కుట్ర పూరితంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కుటిల నీతితో వ్యవహరిస్తున్న ఇంటి దొంగలైన టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. తొర్రూరులోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావుతో కలిసి వ్యాపారస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా చంద్రబాబు కుట్రలు పన్నుతుంటే ఆ వ్యూహానికి ఇక్కడి టీడీపీ, బీజేపీ నేతలు చేతులుకలుపుతూ ప్రజలను ఇబ్బందుల పాల్జేసి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి వంటి ఇంటిదొంగలతో అప్రమత్తంగా ఉండాలన్నారు.టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వ్యాపారులు వినతి మేరకు తొర్రూరు అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.