Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్‌దే విజయం

– ద్వితీయ, తృతీయ స్థానాల కోసమే ఇక పోటీ – తెలంగాణ ద్రోహులెవరో మెదక్ ప్రజలందరికీ తెలుసు – కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు..? – భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao

మెదక్ ఉప ఎన్నిక తెలంగాణ ద్రోహులకు, తెలంగాణవాదికి మధ్య జరుగుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ అయిన మెతుకుసీమ ప్రజలకు ద్రోహుల చరిత్ర మొత్తం తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్తారు అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. నామినేషన్ దాఖలు చేయడంతోనే టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమైందని, ఇక పోటీలో ద్వితీయ, తృతీయ స్థానాలు ఎవరివో తేలాల్సి ఉన్నదని అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో హరీశ్‌రావు వెంటరాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు.

అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ ఇంట్లో హరీశ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, యువకులను కాంగ్రెస్ నాయకులు జైల్లో పెట్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న సునీతారెడ్డి అప్పుడు మంత్రిగా, బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ఇద్దరూ ఆంధ్రా సీఎంల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. వీరు ఏ ముఖం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతారు? అని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న సునీత ఏనాడూ విద్యార్థులపై కేసుల గురించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన మాలాంటి వాళ్లను పోలీసులతో కొట్టించి, జైళ్లలో పెట్టించారు. తెలంగాణ అడిగినందుకు విద్యార్థులు, ఉద్యమకారులను జైల్లో పెట్టించినందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలా? ఆంధ్రా సీఎంలకు వత్తాసు పలుకుతూ తెలంగాణ రాకుండా అడ్డుపడినందుకు ఓటు వేయాలా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జగ్గారెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి. ఈ విషయం తెలంగాణాలో ఎవరిని అడిగినా చెప్తారు. తెలంగాణ వద్దని, ఉమ్మడి రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమంటూ సోనియాకు లేఖ ఇచ్చిన జగ్గారెడ్డికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.

సంగారెడ్డిని బీదర్‌లో కలపాలని ఓసారి, హైదరాబాద్‌లో కలపాలని మరోసారి మాట్లాడిన ఆయన ద్రోహాన్ని 4 కోట్ల జనం మరచిపోరు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ప్రజలకు ఈ రోజు వరకు కొంత గౌరవం ఉండేది. పచ్చి తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడంతో వారిద్దరిపై గౌరవం చచ్చిపోయింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న బీజేపీకి ప్రజలకు ఎందుకు ఓట్లు వేయాలి. పోలవరంలో తెలంగాణ గ్రామాలను ముంచినందుకా? హైదరాబాద్‌లో గవర్నర్ పాలన పెట్టినందుకా? తెలంగాణకు విద్యుత్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటునందుకా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారని హరీశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన వారికి ఆంధ్రా నాయకులు టిక్కెట్లు ఇప్పించే దురదృష్ట పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ ఆంధ్రావాళ్లేనని, వారు కేంద్రంలో చక్రం తిప్పి జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్టు ఇప్పించారని విమర్శించారు. సునీతారెడ్డిని బలవంతంగా పోటీలో నిలిపినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు.

జగ్గారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడంతోటే ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో జిల్లాలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. జగ్గారెడ్డిని బీజేపీలో చేర్చుకున్నందుకు ఆ పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి విమర్శించారు. పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడానికి తెలంగాణ ద్రోహే దొరికాడా? అని ప్రశ్నించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబుమోహన్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణతోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సర్వేతోనే ప్రజలపక్షం తెలిసిపోయింది తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంవైపే ఉన్నారని, ఇందుకు సమగ్ర సర్వే సక్సెస్ కావడమే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సర్వేపై పలువురు కోర్టుకెళ్లారు. సర్వేకు హాజరుకావద్దని విపక్షాలు పిలుపునిచ్చాయి. అయినా ప్రజలు వందశాతం సర్వేలో పాల్గొన్నారు అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 86 రోజుల్లో 80 చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నదని వెల్లడించారు.

కల్యాణ లక్ష్మీ పథకం దళిత ఆడబిడ్డలకు వరం లాంటిందని, మ్యానిఫెస్టేలో చేర్చకపోయినప్పటికీ ఈ పథకాన్ని మైనార్టీలకు వర్తింపజేస్తున్నామని చెప్పారు. ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రైతులకు రూ.19 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆటోలకు రూ.80 కోట్ల పన్నులు రద్దు చేసింది. మైనార్టీలు, ఎస్టీలకు 12% రిజర్వేషన్‌కు కేబినెట్ అమోదం తెలిపింది అని పేర్కొంటూ ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.