-వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా -కాంగ్రెస్ గెలువకుంటే ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? -గద్వాలలో మంత్రి కేటీఆర్ సవాల్ -అప్పర్ కృష్ణను కాంగ్రెస్ నేతలు అడ్డుకొని పాలమూరును ముంచారని ఆరోపణ -పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు -దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం -మా పనితీరు, ప్రజలపై నాకు విశ్వాసం ఉంది -ఇరవై ఏండ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి: మంత్రి కేటీఆర్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మళ్లీ ఘనవిజయం సాధించి తీరుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నడిగడ్డ నుంచి ప్రారంభించిన టీఆర్‌ఎస్ జైత్రయాత్రను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని, దీనిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటిద్వారా లబ్ధి పొందిన ప్రజలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మరో 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ఆకాంక్షించారు. శాశ్వత అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదన్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్.. కాంగ్రెస్ గెలువలేక పోతే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇందుకు ఇటీవల వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శమని అన్నారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలో రూ.40కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనచేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గద్వాల పాత బస్టాండ్‌లో జరిగిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అత్యంత వేగంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లోను ఎలాంటి తేడాలు లేకుండా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతోపాటు గద్వాలలో రూ.40కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.17వేలకోట్ల రుణమాఫీ చేశామని చెప్పా రు. వ్యవసాయానికి 24గంటల కరంట్‌ను నిరంతరాయంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరాకు రూ.8వేలు ఇవ్వాలని నిర్ణయించిన తొలి సీఎం కూడా కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
అత్యంత దరిద్రంగా కాంగ్రెస్ పాత్ర రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పాత్ర అత్యంత దరిద్రం గా ఉందని కేటీఆర్ విమర్శించారు. దేశంలోనే ఇలాంటి ప్రతిపక్షపార్టీ ఏరాష్ట్రంలోనూ లేదని దుయ్యబట్టారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనను, మూడున్నరేండ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చూశారని చెప్తూ.. మంచి, చెడులను ప్రజలు ఆలోచించాలని, సొంతఆస్తులను పెంచుకునే నాయకులను కాకుండా ప్రజల క్షేమంకోరి ప్రజలకోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌లకు కాంగ్రెస్ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నదని మండిపడ్డారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దగా పడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పాలమూరు-రంగారెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్య పాలనలో జిల్లాకు చెందిన జైపాల్‌రెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి తదితర నాయకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తెలంగాణ నుంచి మంత్రులుగా ఉంటూ ఇతర ప్రాంతాల్లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హారతులు పట్టారని మాజీమంత్రి డీకే అరుణనుద్దేశించి వ్యాఖ్యానించారు.
అప్పర్ కృష్ణాను ముంచేసిన కాంగ్రెస్ కృష్ణానదిపై అప్పర్‌కృష్ణ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసి, 164 టీఎంసీలతో ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేయాలని నిజాంకాలంలోనే నిర్ణయించారని కేటీఆర్ గుర్తుచేశారు. 16.40లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా రూపకల్పనచేసిన ఈ ప్రాజెక్ట్‌ను సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా ముంచేసిందని ఆరోపించారు. దీని పర్యవసానంగా పాలమూరులో దశాబ్దాల తరబడి కరువు విలయతాండవం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మూడున్నరేండ్లలోనే ఐదున్నర లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరందించిన చరిత్ర టీఆర్‌ఎస్‌దని కేటీఆర్ స్పష్టంచేశారు. 87వేల ఎకరాలకు సాగునీరందించిన ఆర్డీఎస్‌ను కూడా కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యంచేసి నడిగడ్డకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆర్డీఎస్ ఆయకట్టు కోసం నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ జోగుళాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేసిన సంగతిని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇటీవల నడిగడ్డను దృష్టిలో ఉంచుకొని ఆర్డీఎస్‌కు ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. తుమ్మిళ్ల పనులను ఏడాదిలోపు పూర్తిచేసి నడిగడ్డలోని 50వేల ఎకరాలకు సాగునీరందించి తీరుతామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఓడిపోతున్నా కాంగ్రెస్ నేతల ప్రగల్భాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోను, ఇతర అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ తోక ముడిచినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. 2019 ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉందన్న మంత్రి.. గడిచిన మూడున్నరేండ్లుగా తాము చేపట్టిన అభివృద్ధి పనులపైన, వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న ప్రజలపైన తమకు పూర్తివిశ్వాసం ఉందని చెప్పారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ గెలువకుంటే రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నారా? అని సవాలు విసిరారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ప్రజల విశ్వాసం పొందలేరని ఎద్దేవాచేశారు. రాష్ర్టాన్ని, దేశాన్ని సర్వనాశనంచేసిన కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఊహించుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
తుమ్మిళ్లతో నడిగడ్డ సస్యశ్యామలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇప్పటికే నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్టు చెప్పారు. జూరాల ప్రాజెక్ట్‌ను 30 ఏండ్లపాటు నిర్మించిన కాంగ్రెస్, నెట్టెంపాడును దశాబ్దకాలం కిందట మొదలుపెట్టి వదిలేసిందని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తర్వాతే తెలంగాణలో ప్రాజెక్టులకు నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ కొబ్బరికాయలు కొట్టారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి, పార్టీ రాష్ట్రకార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ రాష్ట్రకార్యదర్శి రాము లు, మాజీ ఎంపీ జగన్నాథం, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.