ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం.. బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవు: కేటీఆర్ బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మాకు ఓపిక, సహనం, సంస్కారం ఉన్నయి కాబట్టే ఎంతలేసి మాటలన్నా ఊరుకుంటున్నాం. ఒకవేళ మా ఓపిక నశిస్తే ప్రధానమంత్రి నుంచి కేంద్రమంత్రుల దాకా ఎవరినీ ఉపేక్షించబోం. అందరినీ కడిగిపారేస్తాం.
దుబ్బాక ఉద్యమాల గడ్డ. అక్కడి చైతన్యవంతమైన ప్రజలు మొదట్నుంచీ తెలంగాణ ఉద్యమానికి, సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటూ వస్తున్నరు. 2008లో 16 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు పోయినపుడు రామలింగారెడ్డితో అక్కడ కలిసి తిరిగిన. కొండపాక, దౌల్తాబాద్ తదితర ప్రాంతాల ప్రజల ఆలోచనా విధానం, ప్రగతిశీల భావజాలం చాలా గొప్పది. ఇప్పటికీ అదే స్ఫూర్తి ప్రదర్శిస్తున్నరు. -మంత్రి కేటీఆర్

ఎవరెన్ని ఎత్తులేసినా, ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో గెలిచేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్సేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆరేండ్లలోనే తెలంగాణ అసాధారణ ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక వ్యవసాయరుణాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, రైతుబంధులో 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులకే ప్రయోజనం కలుగుతున్నదని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొనటం ప్రభుత్వ చిత్తశుద్ధికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులపట్ల ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శమన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రం ఆరేండ్లలోనే రెండింతలైందని పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని.. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆ పార్టీ సీనియర్లు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలే ఉన్నాయని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ వివరాలు..
ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు పంచాయతీ, మున్సిపల్, పార్లమెంట్ ఇలా ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. చైతన్యవంతమైన దుబ్బాక ప్రజలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకే జై కొడ్తరు. మా సీటు మాకు దక్కడమే కాదు.. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావడం ఖాయం. అక్కడి ప్రజల ఆలోచనా విధానం, ప్రగతిశీల భావజాలం చాలా గొప్పది. ఎప్పటికీ అదే స్ఫూర్తి ప్రదర్శిస్తారు. దుబ్బాక అభివృద్ధిలో మా పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి కూడా సహభాగస్వామి.. ఆదర్శవివాహం చేసుకొని ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి ప్రచారం చేయకపోయినా భారీ మెజారిటీతో గెలిచాం. దుబ్బాకలోనూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చు. కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపే ప్రజలు ఉన్నారు.
సామాజిక మాధ్యమాల్లోనే బీజేపీ బీజేపీ సమాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ ఉంటది. ప్రజల్లో వారికి స్థానమే లేదు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీ నెలకొల్పి అందులో విషప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ పార్టీకి ఉన్న ప్రజాదరణ ఏపాటిదో ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు తేల్చిచెప్తూనే ఉన్నప్పటికీ కుసంస్కారులుగానే వ్యవహరిస్తున్నారు. స్థాయిని మరిచి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఊరుకొనేది లేదు. ఓపిక నశించినపుడు అందరినీ కడిగిపారేస్తాం. ప్రధాని మొదలు కేంద్రమంత్రుల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టం. మాకూ చక్కటి భాష వచ్చు. మర్యాదగా మట్లాడితేనే మర్యాద ఇచ్చేది. హద్దుమీరి అసత్య ప్రచారాలకు దిగితే ఊరుకునేది లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాష మార్చుకుంటే మంచిది. మంచిది. కరోనా కట్టడి కోసం రాష్ర్టానికి రూ.7వేల కోట్లు ఇచ్చామని బండి సంజయ్ అసత్య ప్రచారం చేసి పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ నేతలకు సద్బుద్ధులు చిప్తే
కేంద్రం ఏమిచ్చిందో చెప్పండి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో బీజేపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషంలో ప్రజలు సంబురాలు చేసుకుంటుంటే భద్రాచలం నుంచి ఏడు మండలాలను గుంజుకుపోయారు. సీలేరు విద్యుత్కేంద్రాన్ని తరలించింది. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల కోసం రాష్ర్టానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే ఎంతిచ్చారు? రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్నదెంత? కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నదెంతో బీజేపీ నేతలు చెప్పాలి. బీజేపీ నేతలకు దమ్ముంటే దుబ్బాక మీదుగా వెళుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలి.
కాంగ్రెస్‌కు మిగిలేది గుండుసున్నా కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీదాకా ఖాళీ అయిం ది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలందరూ తలకిందులుగా తపస్సుచేసినా దుబ్బాకలో డిపాజిట్ కూడా దక్కించుకోలేరు. ఆపార్టీకి మిగిలేది గుండు సున్నానే. కాంగ్రెస్‌లో పెద్దనాయకులందరూ ఫ్రస్ట్రేషన్‌లో ఉ న్నారు. వారిలో చాలామంది త్వరలో తలోదారి చూసుకుంటారు. రేవంత్‌రెడ్డి విదూషకుడి వంటివా డు. ప్రజలు ఆయన మాటలకు విలువ ఇవ్వరు.
తెలంగాణలో అద్భుత ప్రగతి రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆరేండ్లలోనే తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. వ్యసాయరంగంలో సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనం. ఇదేదో మాకు మేం డబ్బా కొట్టుకోవడం లేదు. రూ. 27,718 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఏకైకరాష్ట్రం తెలంగాణ అని ఆర్బీఐ నివేదికలే స్పష్టంచేస్తున్నాయి. రైతుబంధు ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని కూడా పేర్కొన్నది. రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదల చేసిన జీఎస్డీపీలో వ్యవసాయరంగం గత ఆరేండ్లలో 300 రెట్లు వృద్ధి సాధించిందని పేర్కొన్నది. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెండింతలయింది. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయమే అధికమని పలు నివేదికలు స్పష్టంచేశాయి. కేంద్రప్రభుత్వ నిర్వాకంతో గత రెండేండ్లలో దేశ ఆర్థికపరిస్థితి మందగమనంలోకి వెళ్లింది. వరుసగా ఎనిమిది క్వార్టర్స్‌లో జీడీపీ పడిపోతూనే ఉన్నది. దీనికి బీజేపీ నేతలు ఏమి సమాధానం చెప్తారు.
గణనీయంగా పెరిగిన పెట్టుబడులు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు తెలంగాణను అనుకూలమైన ప్రాంతంగా ఎంచుకుంటున్నారు. ఆరేండ్లలో దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిలో దాదాపు 80 శాతం కార్యకలాపాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న సంస్థలు, పారిశ్రామికవేత్తలు అదనంగా 23 శాతం వారి వారి కార్యకలాపాలాను విస్తరించుకుంటున్నారు. ఇది శుభపరిణామం.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయా? ఆ తర్వాతనా అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండలి గడువుకు మూడునెలల ముందు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అన్నీ మావే అంటరు.. మరి మామ ఇంట్లో దొరికిన డబ్బులు? బీజేపీ నేతలు ఏమన్నా అంటే పెన్షన్లు మేమే ఇస్తున్నం, కేసీఆర్‌కిట్‌కు డబ్బులు మావే అంటరు. మరుగుదొడ్లకు డబ్బులు మావే అంటరు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మేమే కట్టిస్తున్నం అంటరు. కానీ మామ (బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో నగదు దొరికిన నేపథ్యంలో) ఇంట్లో దొరికిన పైసలు మాత్రం తమవి కాదంటరు. దుబ్బాక, సిద్దిపేటలో బీజేపీ నాయకులు పోలీసులపట్ల వ్యవహరించిన తీరును సభ్యసమాజం తీవ్రంగా ఖండించింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ను పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడతారా?. దుబ్బాక ఎన్నికలకు సైన్యాన్ని దింపాలని కోరటం బీజేపీ నేతల అవివేకానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనం. దుబ్బాకలో ఎన్నికలు నిర్వహితంచేది కేంద్ర ఎన్నికల సంఘమే అన్న కనీస స్పృహ కూడా వారికి లేకపోవడం విచారకరం.
హరీశ్ అయినా, నేనైనా కేసీఆర్ సారథ్యంలోనే.. దుబ్బాకలో బాగా కష్టపడే నాయకత్వం ఉన్నది. ఆ జిల్లా మంత్రి హరీశ్‌రావుకు దుబ్బాక బాధ్యతలు అప్పగించారు. మా నాయకుడు కేసీఆర్.. ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే దానిని నిర్వహిస్తాం. హరీశ్ అయినా నేనయినా సీఎం కేసీఆర్ సైన్యంలో భాగమే. మా నాయకుడికి ఎక్కడ ఎవరిని దింపాలో? బాగాతెలుసు. కష్టపడే వాళ్లకు క్రెడిట్ ఇస్తే నష్టమేంటి.. దుబ్బాక గెలుపు క్రెడిట్ ఆ జిల్లా మంత్రి హరీశ్‌రావుకే పోతుంది. ప్రతి నియోజకర్గంలోనూ సుశిక్షితులైన, చిత్తశుద్ధికలిగిన, ప్రజలకు సేవచేయాలనే సంకల్పం గల నాయకులున్నారు.