-తెల్ల కార్డుపై బియ్యం కోటా పెంపుపై కసరత్తు -పరిశీలనలో సబ్సిడీ బియ్యం ధర మార్పు -ఆర్థిక మంత్రి ఈటెల వెల్లడి -సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ -రేషన్‌కార్డులు, పెన్షన్లు, సబ్సిడీలపై చర్చ
అక్టోబర్ నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్లరేషన్ కార్డులు అందచేస్తామని హామీ ఇచ్చారు. పౌరసరఫరాలశాఖపై నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ సచివాలయంలో మంగళవారం సమావేశమై రేషన్ కార్డులు, బియ్యం కోటా, సబ్సిడీ, పెన్షన్లు తదితర అంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ప్రతీ పేద కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో క్యాబినెట్ సబ్‌కమిటీ కసరత్తు చేస్తున్నదని చెప్పారు.
ప్రస్తుతం తెల్ల రేషన్‌కార్డుపై కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున గరిష్టంగా 20 కిలోల సబ్సిడీ బియ్యం ఇస్తున్నామని, ఈ కోటాను 30 కిలోలకు పెంచాలనే అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. కిలో బియ్యం ధరను మూడు రూపాయలుగా నిర్ణయించాలన్న అంశం కూడా చర్చకు వచ్చిందని, కానీ ధర ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. సమగ్ర సర్వేను కూడా రేషన్‌కార్డుల విధివిధానాల రూపకల్పనలో ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. బియ్యం కోసం కాకుండా ఇతర పథకాల కోసం తీసుకొన్న కార్డులను పక్కన పెట్టాలనే అంశాన్ని కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకు అనుగుణంగా సబ్‌కమిటీ నిర్మాణాత్మకమైన నివేదిక సిద్ధం చేస్తున్నదని చెప్పారు.
దసరా పండుగ తర్వాత మరోసారి సమావేశమై సీఎంకు నివేదిక అందచేస్తామని, దానికి సీఎం ఆమోదం రాగానే విధివిధానాలు ఖరారవుతాయని పేర్కొన్నారు. సబ్‌కమిటీ సమావేశంలో రేషన్‌కార్డుల విధివిధానాలు, లెవీ, బియ్యం కోటా పెంపు, లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీ పార్ధసారథి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆహారభద్రత, అమ్మహస్తం పథకం, అవసరమైన నిధులు తదితర వివరాలను కమిటీకీ వివరించారు. పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమగ్ర సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సర్వే వివరాలను తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వివరాలను వెల్లడించారు. పెన్షన్లపై కూడా కేటీఆర్ ఆరా తీశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు? సబ్సిడీ బియ్యం ఎంత అవసరముంది? ఎంతమేరకు ప్రభుత్వంపై భారం పడుతుంది? అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. బియ్యం కిలో మూడు రూపాయలైతే సుమారు రూ.వెయ్యి కోట్ల భారం పడుతుందని, ధరను అనుసరించి నిధుల్లో మార్పులు వస్తాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.