-ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి -అందరూ చంద్రబాబులాగా ఉండరు -కేసీఆర్ ఓడిపోతారన్నది గోబెల్స్ ప్రచారమే -టీడీపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపాటు
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా వెన్నుపోటు పార్టీ అయిన టీడీపీకి ఇతర పార్టీల్లోని నాయకులు కూడా వెన్నుపోటుదారులుగానే కనిపిస్తున్నారని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించినట్లుగానే, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణంలో పాల్గొంటామని ఆయన స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు రాజేంద్రప్రసాద్, మరికొందరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

అది పిచ్చివాగుడు అని మేము మౌనంగా ఉంటే మరింత రెచ్చిపోతున్నారు. నా గురించి తప్పుడు కూతలు కూస్తే నాలుకలు చీరేస్తాను అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, అదుపుతప్పితే జరుగబోయే పరిణామాలకు మీరే బాధ్యులని టీడీపీ నేతలనుద్దేశించి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ క్యాడర్‌ను అయోమయానికి గురిచేయడానికి, తమపై బురదజల్లే నీచానికి ఒడిగట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందరూ చంద్రబాబులాగా ఉండరని, అధికారం కోసం నానా గడ్డికరిచే రకం తాము కాదని, విలువలతో కూడిన రాజకీయం చేస్తామని, పదవుల కోసం తిన్నింటివాసాలు లెక్కపెట్టేవాళ్లం కాదని పేర్కొన్నారు.
జనామోదం లేకున్నా కాంగ్రెస్ నేతలు అడ్డదారిలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, టీఆర్‌ఎస్‌లో చీలిక వస్తుందని కలలు కంటున్నారని, వారి కలలు కల్లలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, మే 16 తరువాత పొన్నాలతోపాటు ముఖ్య నేతలంతా ఇళ్లకే పరిమితం అవుతారని తెలిపారు. పొన్నాల తన పనితీరుతో ఏం సాధించారని కేసీఆర్ ఓర్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పొన్నాల నిజానికి ఒక ఫెయిల్యూర్ పీసీసీ అధ్యక్షుడని అభివర్ణించారు. కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, భారీ మెజార్టీతో కేసీఆర్ గెలువబోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా హుందాగా ఉండకపోవడం మర్యాద కాదని ఆయన సూచించారు.